చిత్తశుద్ధి లేని శివపూజలా ఉందట.. తెలంగాణలో ఉద్యోగ ఖాళీల గుర్తింపు. నెలల తరబడి కసరత్తు చేశామని చెబుతూ.. అధికారులు ఇచ్చిన జాబితాపై సీఎం సంతృప్తి చెందలేదు. వారికి మరో డెడ్‌లైన్ పెట్టారు. అసలు ఆఫీసర్లు వాస్తవ లెక్కలే ఇచ్చారా? లేక తిమ్మిని బమ్మిని చేయాలని చూశారా?
ఉద్యోగ ఖాళీల లెక్కలను అధికారులు సరిచూసుకున్నారు
గత డిసెంబర్‌లోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. వెంటనే ఖాళీలను గుర్తించి నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు కూడా. ఆ ఆదేశాలు అందుకున్న అధికారులు ఉద్యోగ ఖాళీలపై కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం అన్నిశాఖల కార్యదర్శులతో పలుమార్లు సమావేశం అయ్యారు. ఓ ప్రొఫార్మా ఇచ్చి ఆ ప్రకారం వివరాలు పంపించాలని కోరారు సీఎస్. అధికారులు లెక్కలు అందజేశారు. వాటిని ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్నారట.
read also : తెలంగాణ నా గడ్డ : వైఎస్ షర్మిల
57 వేల ఖాళీలు ఉన్నట్టు రిపోర్ట్‌లో తేల్చారు
ఇటీవలే ఉద్యోగ భర్తీ ప్రక్రియలో మళ్లీ కదలిక వచ్చింది. సీఎం కేసీఆర్ దృష్టి పెట్టడమే దానికి కారణం. ఆయా శాఖలు ఇచ్చిన లెక్కలపై ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం ఆర్థికశాఖ ఆఫీసర్లు.. సంబంధిత శాఖల అధికారులతో భేటీ అయ్యారు. లెక్కలను మరోసారి రూడీ చేసుకున్న తర్వాత ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ వాటిని కేబినెట్ ముందు ఉంచింది. 57 వేల ఖాళీలు ఉన్నట్టు రిపోర్ట్‌లో తేల్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. రిపోర్ట్ చూసిన తర్వాత అందులోని లెక్కలు.. సంఖ్యలు ఆశ్చర్యపరిచాయట. కొన్ని శాఖల్లో ఖాళీలు కనీసం పది కూడా లేవట.
కొన్ని శాఖలు కావాలనే ఖాళీలు తక్కువ చేసి చూపించాయా?
ఒక్కో శాఖ ఒక్కో విధంగా లెక్కలు వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఖాళీల సంఖ్య ఎక్కువ చూపెడితే ఇబ్బందులు వస్తాయేమోనని కొన్ని శాఖలు తక్కువ చేసి చూపించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అవన్నీ కాకి లెక్కలనే విమర్శలు వస్తున్నాయి. అందుకే రిపోర్ట్‌లోని లెక్కలను చూశాక.. ఈ అంకెలేంటి తూచ్ అన్నారు సీఎం కేసీఆర్. గణాంకాలు అసంపూర్తిగా ఉన్నాయని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య.. ఖాళీల వివరాలు సమగ్రంగా అందజేయాలని.. ఐదు రోజుల్లోగా వాటిని అందజేయాలని డెడ్‌లైన్ పెట్టారు సీఎం.
ఐదు రోజుల్లో కొత్త వివరాలు పక్కాగా ఇస్తారా?
దీంతో ఇన్ని రోజులు అధికారులు కసరత్తు చేసి పొడిచింది ఏంటి? సీఎం ఆదేశించినా చిత్తశుద్దితో పని చేయలేదా? తమకెందుకొచ్చిన గొడవ అనుకొని ఏదోఒక లెక్క పంపించేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయట. తగిన సమయం ఇచ్చినప్పుడే సరిగా పనిచేయని అధికారులు.. ఇప్పుడు ఐదు రోజుల్లో ఖాళీలు, ఉద్యోగుల వివరాలు పక్కాగా ఇస్తారా అన్న సందేహాలు ఉన్నాయట.
కచ్చితమైన లెక్కలు ఏ శాఖ దగ్గరా లేవా?
కొత్త గణాంకాలు అందాక.. మళ్లీ కొత్త జిల్లాలు, జోన్లు, కేడర్ వారీగా లెక్కలు తీయాల్సి ఉంటుంది. అసలు తెలంగాణలో ఏ కేడర్‌లో ఎన్ని శాంక్షన్ పోస్ట్‌లు ఉన్నాయి? అందులో రెగ్యులర్ ఉద్యోగులు ఎంత? కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల ఖాళీలు ఎన్ని అనే కచ్చితమైన లెక్కలు ఏ శాఖ దగ్గరా లేవని తెలుస్తోంది. ముంజూరైన పోస్టులు ప్రస్తుతం అవసరమా లేదా అన్నదీ ఆయా శాఖలకు క్లారిటీ లేదట. మరి.. ఉద్యోగ లెక్కలు తేలేదెప్పుడో.. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయ్యేది ఎన్నడో చూడాలి.