అంత కాదు.. ఇంతన్నారు. పెద్ద సంఘాలన్నీ యుగళగీతం పాడాయి. మూడు రోజులు సమ్మెలో ఐక్యత చాటాయి. మరి.. వారి పోరాటం ఫలించిందా? లేక వాళ్లదంతా ఆరాటమేనా? సమ్మె లక్ష్యం ఏమైంది?
కార్మికుల్లో పల్చన కాకూడదనే సంఘాలు సమ్మెకు వెళ్లాయా?
కలిసి వస్తే సరే.. లేదంటే ద్రోహులే..! సింగరేణిలో మూడు రోజుల సమ్మెకు ముందు జరిగిన ప్రచారం. సింగరేణిలో బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికలోకం ఉద్యమించింది. ఉద్దేశం ఎలా ఉన్నా.. గుర్తింపు సంఘం చేసిన హడావిడి.. అనుసరించిన వ్యూహమే ఇప్పుడు కార్మికుల్లో చర్చగా మారింది. కార్మిక సంఘాల భుజాలపై తుపాకీ పెట్టి కేంద్ర సర్కార్‌ను గురిపెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయట. సమ్మెకు సై అన్న సంఘాలకు ఈ విషయం తెలిసినా.. గుర్తింపు సంఘం చేసిన ప్రతిపాదనకు తలూపక తప్పలేదు. ఈ సందర్భంగా పెట్టిన డిమాండ్స్‌లో బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ తప్పితే అన్నీ రాష్ట్ర సర్కార్ తీర్చేవే. ఇవి ఎంత వరకు నెరవేరుతాయో కార్మిక సంఘాల నేతలకు ముందే తెలుసు. కానీ.. కార్మికుల్లో పల్చన కాకుండా సమ్మెకు వెళ్లక తప్పలేదని చర్చ జరుగుతోంది.
గుర్తింపు సంఘం పన్నిన పద్మవ్యూహంలో జాతీయ సంఘాలు చిక్కుకున్నాయా?
మూడురోజుల సమ్మెతో బొగ్గు బావులు బోసిపోయాయి. గుర్తింపు సంఘం TBGKSకు మద్దతుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్మికులకు సంఘీభావం తెలియజేశారు. కేంద్ర సర్కార్ తీరును తప్పుపట్టారు నాయకులు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మూడు రోజుల సమ్మె ద్వారా సాధించింది ఏంటన్నది కార్మికుల ముందు ఉన్న ప్రశ్న. పైగా గుర్తింపు సంఘం పన్నిన పద్మవ్యూహంలో తామంతా చిక్కుకుపోయామనే భావనలో జాతీయ కార్మిక సంఘాలు ఇప్పుడు మథన పడుతున్నాయట.
సమ్మె విజయవంతమే కానీ.. ఫలవంతం కాలేదా?
సమ్మె మూడు రోజులు కార్మికులు వేతనాలు కోల్పోయారు. సింగరేణి సంస్థకు సైతం 120 కోట్ల వరకు నష్టం వచ్చిందని అంచనా. పే డే నిబంధనలు సడలించడంతో ఆదివారం కూడా వర్కింగ్ డే అయిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న పోరాటంలో సింగరేణి సమిధ అవుతుందనే చర్చ కార్మికుల్లో ఉందట. 12 డిమాండ్స్‌తో సమ్మెకు వెళ్లితే.. వాటిల్లో ఒక్కటీ సాధించింది లేదు. దీంతో మూడు రోజుల సమ్మె విజయవంతమే కానీ.. ఫలవంతం కాలేదని కార్మిక సంఘాల నేతలు అంతరంగిక సమావేశాల్లో చెప్పి వాపోతున్నారట. మొత్తానికి రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఎవరో సమ్మెకు పిలుపిస్తే.. ఆ వ్యూహంలో జాతీయ కార్మిక సంఘాలు, కార్మికులు పడ్డారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ పరిణామాలు త్వరలో జరిగే గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.