దుర్గం చిన్నయ్య. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే. సింగరేణి పట్టాల పంపిణీ ఆయనకు నిద్ర లేకుండా చేస్తోందట. ఈ అంశంలో ఇన్నాళ్లూ అదిగో ఇదిగో అని ప్రచారం ఊదరగొట్టింది ఆయనే. జిల్లాలోని మిగిలిన రెండు నియోజకవర్గాల్లో అక్కడి శాసనసభ్యులు పట్టాల పంపిణీ జోరు పెంచితే.. బెల్లంపల్లిలో ఎక్కడో బెడిసి కొట్టిందట. అందుకే తెగ ఆందోళన చెందుతున్నారట ఎమ్మెల్యే చిన్నయ్య.
సింగరేణిలో పనిచేసి అక్కడే తమ నివాసం ఏర్పాటు చేసుకున్న రిటైర్డ్ కార్మికులు.. స్థానికులకు సైతం పట్టాలు అందజేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో 76 జారీ చేసింది. గతంలో సింగరేణి స్థలాల్లో ఉన్నవారికి ఎలాంటి హక్కులు ఉండేవి కావు. కానీ.. 2017లో శ్రీరాంపూర్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్.. కోల్‌బెల్ట్‌లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇస్తామని ప్రకటించారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం TBGKS ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ఆ విషయాన్ని పొందుపర్చారు. శ్రీరాంపూర్ ఏరియాలో 4 వేలు.. మందమర్రిలో 6 వేలు పట్టాలు ఇచ్చారు. సింగరేణి పరిధిలో మొత్తం ఆరు చోట్ల పట్టాల పంపిణీ జరుగుతోంది. అయితే బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అడుగు ముందుకు పడటం లేదట.
ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా.. పట్టాలే ప్రచార అంశం. అందుకే ఎమ్మెల్యేలు ఆ పని పూర్తి చేస్తే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని లెక్కలు వేసుకుంటున్నారట. మంచిర్యాల, చెన్నూరుల్లో మంత్రులను తీసుకొచ్చి మరీ అట్టహాసంగా పంపిణీ చేపట్టారు. బెల్లంపల్లిలో ఆ ఊసే లేక పోవడంతో పార్టీ కేడర్ తమ ఎమ్మెల్యేను నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాయి. నియోజకవర్గంలో కేవలం 8 మందికి పట్టాలు ఇచ్చి మమ అనిపించేశారు.
బెల్లంపల్లిలో పట్టాలు పంపిణీ కాకపోవడానికి కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డొచ్చాయట. ఆ విషయాన్ని ఎమ్మెల్యే చిన్నయ్య ఆలస్యంగా గ్రహించారట. ఇతర నియోజకవర్గాలోల ఖాళీ స్థలాల్లో ఇళ్లు కట్టుకోవడం వల్ల.. అక్కడ పట్టాలు పంపిణీ చేయడానికి పెద్దగా ఇబ్బందులు రాలేదట. బెల్లంపల్లిలో మాత్రం ఇప్పటి వరకు అందిన 2 వేల 700 దరఖాస్తుల్లో కొన్ని సింగరేణి పాత క్వార్టర్స్ స్థలాల్లో ఇళ్లు కట్టుకుని ఉన్నారట. అందువల్లే సమస్య వచ్చిందని గుర్తించారట ఎమ్మెల్యే. దానికి ప్రభుత్వ పరంగా క్లియరెన్స్ రావాల్సి ఉందని అధికారులు చెప్పడంతో.. తొలుత కలెక్టర్‌కు.. అక్కడ నుంచి CSకు లేఖలు పంపినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ఫైల్ సీఎంవో దగ్గర పరిశీలనలో ఉందని చెబుతున్నారు.
పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు వరకు సమయం ఉండటంతో ఇలాంటివి మరికొన్ని వెలుగులోకి వస్తాయని సందేహిస్తున్నారట. ఏది ఏమైనా పాలసీ నిర్ణయం కావడంతో.. వీటిని కూడా క్లియర్ చేసి.. అట్టహాసంగా బెల్లంపల్లిలో పట్టాలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే పరి తపిస్తున్నట్టు టాక్. అయితే ఇవేమీ తెలియని కేడర్.. వ్యతిరేకవర్గం ఈలోపుగానే ఎమ్మెల్యేను సోషల్ మీడియాలో ఆడేసుకుంటోంది. మొత్తానికి కాస్త ఆలస్యమైనా పట్టాల విషయంలో నియోజకవర్గంపై పట్టు సడలకుండా.. సమస్య పరిష్కారానికి కిందా మీదా పడుతున్నారట చిన్నయ్య. మరి.. ఎమ్మెల్యేకు ఎప్పుడు రిలీఫ్ దక్కుతుందో చూడాలి.