కేబినెట్‌లో ఆయనకు రెండోసారి ఛాన్స్ దక్కింది. అవకాశం ఇచ్చినా ఒకే.. లేకపోయినా డబుల్ ఓకే అన్నట్టుగా వ్యవహారం నడిచింది. ఒకానొక సమయంలో తెరవెనక మంత్రాంగం నడిచినా.. ఆయన మరోలా నరుక్కొచ్చారని తాజాగా చర్చ జరుగుతోంది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి అదా.. కథ అని నోరెళ్ల బెడుతున్నారట. ఇంతకీ ఎవరా మంత్రి?
సీఎం జగన్‌కు సన్నిహితం ఆదిమూలపు సురేష్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ఏపీ కేబినెట్‌లో రెండోసారి కూడా చోటు దక్కించుకున్నారు. వైసీపీ అధికారంలోకి రావటంతో మొదటిసారిగా విద్యాశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సీఎం జగన్ విద్యా శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు అమలు చేసే బాధ్యతలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు సీఎంతో విద్యాశాఖపై మాట్లాడే అవకాశం రావటం ఆయనకు మరింత దగ్గర చేసింది. దీనికితోడు వైఎస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కూడా ఉండటంతో సీఎం జగన్‌కు మరింత సన్నిహితం అయ్యారు.
రెండోసారి కేబినెట్‌లో చోటుకోసం తెరవెనక చాలా చేశారా?
తాజాగా జరిగిన కేబినెట్ కూర్పులో తన స్థానాన్ని పదిలం చేసుకోవడంతోపాటు.. ఈ దఫా మరింత ప్రాధాన్యం కలిగిన పోర్ట్ ఫోలియోను పట్టేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను సురేష్‌కు కేటాయించారు. ఇంత వరకు అందరికీ తెలిసినా.. రెండోసారి కూడా మంత్రివర్గంలో సురేష్ కొనసాగడానికి కొన్ని అంశాలు తెరవెనక చాలా దోహదం చేశాయనే చర్చ ఊపందుకుంది. వాటి చుట్టూనే ప్రస్తుతం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
భార్య తరఫున కేంద్రం నుంచి ఒత్తిళ్లు తెచ్చి పదవి సుస్థిరం చేసుకున్నారా?
మంత్రి సురేష్ భార్య ఆదాయపు పన్నుశాఖలో ఉన్నతాధికారి. కారణాలు ఏవైనా.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ IRS అధికారైన సురేష్‌తోపాటు. ఆయన భార్యపైనా CBI విచారణ పెండింగ్‌లో ఉంది. మంత్రిగా లేకపోతే ఆ కేసు విషయంలో ఇబ్బందులు వస్తాయని అనుకున్నారో ఏమో.. భార్య తరఫు నుంచి కేంద్రంలో ఉన్న సంబంధాలతో పదవిని సుస్ధిరం చేసుకున్నారని టాక్ నడుస్తోంది. సురేష్ స్థానంలో మంత్రివర్గంలో చోటు కల్పించాలని అనుకున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి కూడా సమీప బంధువు కావడంలో ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారట. ఆ తర్వాతే లైన్ క్లియరైనట్టు చెబుతున్నారు.
ఢిల్లీ లాబీయింగ్ ముందు బాలినేని ఒత్తిళ్లు తేలిపోయాయా?
తనకు మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోతే జిల్లా నుంచి ఇంకెవరికీ ఛాన్స్ ఇవ్వొద్దని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పెద్ద ఎత్తున ఒత్తిడి తేవడంతో సురేష్ ఇరకాటంలో పడ్డారట. ఆ ఎపిసోడ్‌లో ఎక్కడా బయట పడకుండా.. బాలినేని ఒత్తిళ్లు పార్టీ అధిష్ఠానంపై పనిచేయకుండా.. కేంద్రం నుంచి నరుక్కొచ్చారని కూడా చెవులు కొరుక్కుంటున్నారు. మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్నప్పుడు కూడా సీఎం జగన్ నిర్ణయానికే విధేయత ప్రకటించారు. ఇప్పుడు కేబినెట్‌లో స్థానం సుస్ధిరం కావడంతో ఆ ఉద్యమం ప్రభావం పడకపోవచ్చనే లెక్కలు వేసుకుంటున్నారట. మొత్తానికి అన్ని విధాలుగా తనకు వ్యతిరేకత లేకుండా.. రాకుండా తెర వెనక గట్టిగానే కథ నడిపించినట్టు తెలుస్తోంది. ఇదా విషయం అని అంతా నోరెళ్ల బెడుతున్నారట. ఢిల్లీ నుంచి గట్టిగానే బిగించారని కథలు కథలుగా చెప్పుకొంటున్నారట పార్టీ కేడర్.