హైదరాబాద్ నడిబొడ్డున… అదీ జూబ్లీహిల్స్.. ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో దర్జాగా భూ దందా..! ఒకటి కాదు రెండు కాదు… అక్షరాలా 15 వందల కోట్ల రూపాయల స్కామ్ వెలుగు చూసింది.. గిమ్మిక్కులతో జిమ్మిక్కులు చేసి… లొసుగుల్ని అనుకూలంగా మలుచుకుని ఫిల్మ్‌నగర్‌లోని పదెకరాలు కారుచౌకగా కొట్టేయడమే కాకుండా… మరో నాలుగున్నర ఎకరాలకు ఎసరుపెట్టింది ఎవరు? రెడ్‌ఫోర్ట్ అక్బర్ సంస్థ వెనక ఉన్నదెవరు అంటే ఇద్దరు బడా నేతలన్నది జగమెరిగిన సత్యం. వారిద్దరూ కలిసి ఈ ప్రైమ్ ల్యాండ్‌లో చక్రం తిప్పారు. ఇప్పుడు అపార్ట్‌మెంట్లు, విల్లాలు కట్టేసేందుకు సిద్ధమయ్యారు. 220 కోట్లకు ఈ భూమిని దక్కించుకున్న ఇద్దరు నేతలు… దాదాపు 15 వేల కోట్ల లాభాన్ని తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఈ స్థలం వ్యవహారం అంతా వారి కనుసన్నల్లోనే సాగుతోంది. పేరుకే అక్బర్ ప్రాపర్టీస్.. కానీ, వెనుకుండి కథ నడిపేదంతా ఆ ఇద్దరే..! ఎలాంటి ఇబ్బందులు వచ్చినా క్షణాల్లో అధికారులకు ఫోన్లు చేసి క్లియరెన్సులు ఇప్పించుకుంటున్నారు. అందులో ఒకరి అధికారపార్టీ సభ్యుడు కావడంతో ఎవరూ అడ్డుచెప్పలేకపోతున్నారు.
రెవిన్యూ, పోలీస్, జీహెచ్‌ఎంసీ విభాగాలన్నీ.. సదరు నేత దెబ్బకు నోరు మూసుకుని చేతులు కట్టుకుని కూర్చున్నాయన్నది అంతా చెబుతున్న మాట. కొంతమంది బస్తీవాసులు కూడా మొదట వ్యతిరేకించినా.. ఆ నేతల ప్రభావంతో సైలెంట్ అయిపోయారు. దీంతో పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా జోరుగా సాగిపోతున్నాయి. కొండపైన ఉన్న హనుమంతుడి గుడి పరిసరాల్లో చాలా చెట్లు ఎన్నాయి. ఆ చెట్లు కొట్టాలన్నా, కొండ రాళ్లు తొలగించాలన్నా సంబంధిత శాఖల అనుమతులు కావాలి. కానీ, వీరికి అవేమీ పట్టడం లేదు. పర్యావరణ అనుమతుల్లేవవంటూ ఇటీవలే రెండు లక్షల ఫైన్ కూడా వేశారు. మరోవైపు నాలా వ్యవహారంపై కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అపార్ట్‌మెంట్లు, విల్లాలు ఉండే చోట మురుగునీటి నాలా ఉంటే డిమాండ్ ఉండదనుకున్నారో ఏమో..? దానికి మూసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇదే కనక జరిగితే ఫిల్మ్‌నగర్ పైనుంచేకాకుండా బస్తీల్లో నుంచి వచ్చే మురుగునీరంతా రోడ్లపైకి వచ్చి ఈ ప్రాంతం మొత్తం నానా అవస్థలు పడడం ఖాయం. ఇప్పటికే వర్షం వస్తే ఈ ప్రాంతంలో నీరంతా దిగువకు వచ్చి కనీసం నడిచే పరిస్థితి కూడా ఉండదు. ఇక రెడ్‌ఫోర్ట్ అక్బర్ సంస్థ వెనక ఉన్న కబ్జా దుష్ట ద్వయం వేసే అక్రమ పధకాలు.. వ్యూహ రచనలకు… ఫిల్మ్‌నగర్ టు షేక్‌పేట్ అస్తవ్యస్తంగా మారక తప్పదన్నది జగమెరిగిన సత్యం. మరి దీనికి పరిష్కారం ఏంటి? హనుమంతుడి గుడికి రక్షణ ఉందా? నాలా పరిస్థితి ఏంటి? ఆ నాలుగున్నర ఎకరాలు కజ్జా కావాల్సిందేనా…? ఇలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.