రాజోలు వైసీపీకి కోఆర్డినేటర్ కావాలట. పార్టీ సీనియర్ నేతలే అధిష్ఠానాన్ని కోరినట్టు టాక్. వాస్తవానికి అక్కడ పార్టీ ఇంఛార్జ్ ఉన్నారు. మరోపార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సైతం వైసీపీకి సాయం పడుతున్నారు. అయినప్పటికీ ఎందుకు ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది? అసలు రాజోలు వైసీపీలో ఏం జరుగుతోంది?
రాజోలు వైసీపీలో హైడ్రామా..!
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం వైసీపీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీ కోఆర్డినేటర్ పెద్దపాటి అమ్మాజీ కొద్దిరోజులుగా రాజోలుకు చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోతున్నారట. అదేంటి అని అమ్మాజీ వర్గాన్ని ప్రశ్నిస్తే.. అదో పెద్దకథ..! బోల్డంత హైడ్రామా నడుస్తున్నట్టు సెలవిస్తున్నారు. ఇంఛార్జ్ అమ్మాజీ ప్రస్తుతం అలకలో ఉన్నారట. అందుకే రాజోలుకు రావడం లేదని పార్టీ వర్గాల టాక్. రెండేళ్లుగా రాజోలు వైసీపీ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు అమ్మాజీ.
కొన్నాళ్లుగా రాజోలులో వైసీపీ కార్యక్రమాలకు ఇంఛార్జ్ దూరం..?
జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీకి జైకొట్టిన తర్వాత రాజోలులో వర్గపోరు ఎక్కువైంది. అప్పటికే ఒకసారి పోటీచేసి ఓడిన రాజేశ్వరరావు, ఇంఛార్జ్ అమ్మాజీ, ఎమ్మెల్యే రాపాకల మధ్య వైసీపీ వ్యవహారాలు మూడుముక్కలాటలా మారాయి. అయితే అమ్మాజీ దూకుడికి రాపాక బ్రేక్‌లు వేసినట్టు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా ఎమ్మెల్యేతో కలిసి పనిచేయాలని పార్టీ పెద్దలు చెప్పారట. ఆ నిర్ణయం రుచించని ఆమె.. నాటి నుంచీ రాజోలులో వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం.
ఇంఛార్జ్ అమ్మాజీ రారు..! ఎమ్మెల్యే రాపాక పట్టించుకోరు..!!
అమ్మాజీ ఎలాగూ రావడం లేదు. అలాగని ఎమ్మెల్యే రాపాక ఉండి చేస్తోంది ఏదీలేదని అధికారపార్టీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. ఎన్నికల్లో తనతో పనిచేసిన వారిని తప్ప ఇతరులను ఎవ్వరినీ రాపాక దగ్గరకు రానివ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పైగా నామినేటెడ్ పదవులు అన్నీ అనుయాయులకే కట్టబెడుతున్నారట. ఆ ఎన్నికల్లో రాపాకకు వ్యతిరేకంగా పనిచేసిన వైసీపీ కేడర్‌లో కొందరు సైలెంట్ అయ్యారు. వెరసి.. రాజోలు వైసీపీలో సమన్వయం కొరవడింది. ఇంఛార్జ్ హోదాలో అమ్మాజీ రారు. ఎమ్మెల్యే రాపాక పట్టించుకోరు. దీంతో ఎంటీ దుస్థితి అని వైసీపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారట. రాజోలుకు వైసీపీ కోఆర్డినేటర్‌ను నియమించాలని కోరినట్టు సమాచారం.
కొత్త ఇంఛార్జ్‌ను నియమిస్తారా? తెగేవరకు సాగదీస్తారా?
రాజోలు వైసీపీలోని కొందరు సీనియర్ నాయకులు ఇప్పటికే తాడేపల్లిలోని పార్టీ పెద్దలకు తమ గోడు వినిపించి వచ్చారట. హైకమాండ్ జోక్యం చేసుకుంటే ఇక్కడి విషయాలు తెలుస్తాయని అమ్మాజీ కూడా అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఆమె కూడా ఎప్పటి నుంచో పంచాయితీ పెట్టమని కోరుతున్నారట. దీంతో తాడేపల్లి నుంచి వచ్చే సంకేతాల కోసం పార్టీ కేడర్ ఎదురు చూస్తోంది. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని నేతల మధ్య విభేదాలను చక్కదిద్దుతారా? లేక కొత్త ఇంఛార్జ్‌ను నియమిస్తారా? అన్నద తెలియాల్సి ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజోలు, మలికిపురం మండలాల్లో వైసీపీ పట్టుకోల్పోయిందనే అభిప్రాయం ఉంది. అందుకే తెగేవరకు సాగదీయకుండా వెంటనే ఆపరేషన్ రాజోలు టేకప్ చేయాలన్నది శ్రేణుల వాదన. మరి.. వైసీపీ పెద్దలు విరుగుడు మంత్రం వేస్తారో లేదో చూడాలి.