ఆయన కెరీర్ మొదలైందే కారులో..అక్కడి నుండి కమలంపైకి చేరుకున్న రఘునందనరావు..మళ్లీ కారెక్కే సూచనలున్నాయనే టాక్ తెలంగాణ బిజెపిలో కలకలం రేపుతోంది.ఇప్పటికైతే ఆయన అంత సీన్ లేదనే క్లారిటీ ఇచ్చేశారు..కానీ, అనే డౌట్లు మాత్రం అలాగే మిగులున్నాయి.అదెలా అంటే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటున్నారు..
బిజెపి నేత రఘనందన్ రావు పార్టీ వీడేది లేదని క్లారిటీ ఇచ్చేశారు.కానీ, అసలీ చర్చ ఎందుకు మొదలైంది? ఆయనలో ఉన్న అసంతృప్తి ఏంటి?నిప్పు లేకుండానే పొగరాదు. రాజకీయాల్లో ఆధారాల్లేకుండానే టాక్‌మొదలు కాదు..మరి రఘునందన్ రావు ఈ రోజు కొట్టిపారేసినా, కారెక్కే ఆలోచన కంటిన్యూ అవుతూనే ఉంటుందా?
మాధవనేని రఘునందనరావు తెలంగాణలో బిజెపికున్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు.మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందిన రఘునందనరావు వృత్తిరీత్యా న్యాయవాది, పాత్రికేయుడు.1990ల్లో రఘునందనరావు విలేకరిగా, ఆ తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 2001లో రఘునందనరావు టియ్యారెస్ లో చేరారు. పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన ఆయన టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో మెంబర్‌గానూ పనిచేశారు. 2013లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని కలిశారన్న ఆరోపణలతో పార్టీ ఆయన్ను బహిష్కరించింది. టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురయిన తరువాత ఆయన బీజేపీలో చేరారు.
బీజేపీలో చేరిన తరువాత 2014లో దుబ్బాక నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2018లో కూడా మళ్లీ అదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. 2020 నవంబర్ లో జరిగిన ఉప ఎన్నికలో గెలిచి ఆయన మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. ఇలా గెలిచినా, ఓడినా, నిత్యం వార్తల్లోనే ఉండే రఘునందన రావు… మళ్లీ పాతగూటికే చేరతారనే టాక్ నడుస్తోంది.
బీజేపీలో ప్రస్తుతం నడుస్తున్న పాలిటిక్స్ పై బయట పెద్ద చర్చే నడుస్తోంది. పార్టీ లో కొందరు సీనియర్ లు అసంతృప్తి తో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కొందరు నేతలు ఉంటారా పోతారా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై ఇలాంటి ప్రచారమే నడుస్తోంది. ఈ మధ్య ఆయన టియ్యారెస్ నేతలకు దగ్గరయ్యారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రఘునందన్ రావు సంబంధీకుల ఆస్పత్రి ఓపెనింగ్ కి హరీష్ రావు హాజరు కావడం చర్చనీయాంశం అయింది. ఏదో నడుస్తుండటం వల్లనే, ఇది జరిగిందని..ఇద్దరి మధ్యా అస్సలు పడని సమయంలో రఘునందనరావు వ్యక్తిగత కార్యక్రమానికి హరీష్ రావు రావడం ఏమిటనే గుసగుసలు సాగుతున్నాయి.
మరోపక్క బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిని రఘునందన్ రావు కలిసి పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, స్టేజి మీదకు పిలవడం లేదని పిర్యాదు చేశారనే వార్తలు వచ్చాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. దీనిపై గతంలో జరిగిన అంశాలను కూడా ప్రస్తావించినట్టు సమాచారం. రఘునందనరావు తాడోపేడో తేల్చుకునేందుకే ఇలా చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే, అయనకు పార్టీతో తెగదెంపులు చేసుకునే ఆలోచన లేదని ఒక ఝలక్ ఇవ్వాలనే ఇలా చేసారని కొందరు భావిస్తున్నారు.
అయితే, పార్టీ లో డిఫరెన్సెస్ ఉండడం సహజం అని పార్టీని వీడే ప్రసక్తే లేదని రఘునందన్ రావు అన్నారు. పార్టీని కకావికలం చేయాలని ఎవరూ అనుకోరని అంటున్నారు. ఇప్పటికైతే కాస్త గుంభనంగానే ఉన్నా, పార్టీ లో జరుగుతున్న పరిణామాలపై ఆయన అసంతృప్తితో ఉన్నారని మాత్రం బలంగానే టాక్ నడుస్తోందట.
Watch Here : https://youtu.be/Ysje1yGzfVo