ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసిపి నేత గంజి ప్రసాద్ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. అధికారపార్టీలో ఆధిపత్యపోరు చర్చకు వచ్చింది. నిందితులను వదిలిపెట్టేది లేదని హోంమంత్రి తానేటి వనిత ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరుకు మంత్రి స్టేట్‌మెంట్‌కు పొంతన ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులను అరెస్ట్ చేసినా.. రాజకీయ ఒత్తిళ్లతో విచారణ ముందుకెళ్లడం లేదని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తోంది. దానికితోడు నిందితులతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తున్నారు నాయకులు.
రిమాండ్‌లో ఉన్న నిందితులకు రాచమర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేసులో A8 నిందితుడిగా ఉన్న కోడూరి రవితేజ అనారోగ్యం పేరుతో జైలు నుంచి బయటకొచ్చారని చెబుతున్నారు. అర్దరాత్రి వేళ బయటకొచ్చి చాలా యవ్వరాలు చక్కబెట్టారట రవితేజ. ఛాన్స్ తీసుకుని ఒకరోజు రవితేజ పోలీసులు కళ్లుకప్పి తప్పించుకుని పారిపోయాడు. దాంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. విషయాన్ని గుట్టుగా ఉంచేందుకు ప్రయత్నించినా బయటకు పొక్కడం.. వెంటనే రవితేజను అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయింది. అయితే హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఈజీగా పారిపోవడం ఎలా సాధ్యమైందనే ప్రశ్నలకు పోలీసుల నుంచి సమాధానం లేదట. పైగా నిందితుల్లో కొందరు అనారోగ్యం పేరుతో జైలు నుంచి బయటకొచ్చి ఆస్పత్రిలో చేరి.. ప్రైవేట్ వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారని వైసీపీ వర్గాలే ఆరోపిస్తున్నాయి.
రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే నిందితులకు జైల్లోనూ.. ఆస్పత్రిలోనూ రాచమర్యాదలు అందుతున్నాయనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గంజి ప్రసాద్ హత్య కేసులో ఇప్పటికే పలువురు పోలీసులు శాఖాపరమైన చర్యలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ నిందితుల విషయంలో కఠినంగా వ్యహరించకపోవడం.. చర్చగా మారుతోంది. ఖైదీ పరారీ ఘటనలో నలుగురిపై పోలీసు అధికారులు వేటు వేశారు. అయితే రాజకీయ ఒత్తిళ్లకు లొంగి.. నిందితులకు కొమ్ము కాస్తున్న తెరవెనుక ఖాకీలపై వేటు ఉంటుందా అనేది వైసీపీలోని కొందరి ప్రశ్న. అందుకే ఈ అంశాన్ని ప్రస్తావించిన ప్రతిసారీ ఉలిక్కి పడుతున్నారట కొందరు పోలీసులు.