కొత్తగా టీఆర్ఎస్‌లో ఒకరి చేరిక.. ఆ జిల్లాలో ఇద్దరిని టెన్షన్ పెట్టిస్తోందా? ఆ ఇద్దరిలో ఒకరు మంత్రి కావడంతో అధికారపార్టీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయా? పార్టీ వర్గాలు ఒక అంచనాకు రాలేని పరిస్థితి ఉందా? ఇంతకీ ఎవరి ప్లేస్ రీప్లేస్ కానుంది?
టీఆర్‌ఎస్‌లో చల్మెడ చేరికతో జిల్లా రాజకీయాల్లో చర్చ..!
కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయాలు రోజుకోలా మారుతున్నాయి. మాజీ మంత్రి చల్మెడ ఆనందరావు తనయుడు లక్ష్మీ నరసింహారావు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో కొత్త సమీకరణాలు.. సరికొత్త చర్చలు ఆసక్తి కలిగిస్తున్నాయి. చల్మెడ లక్ష్మీ నరసింహారావు 20ఏళ్లపాటు కాంగ్రెస్‌లో ఉన్నారు. 2009, 2014 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఎమ్మెల్సీగా పోటీ చేసినా ఓటమే పలకరించింది. కొంతకాలంగా చల్మెడ పార్టీ మారతారనే చర్చ జరిగింది. గత నెలలో సీఎం కేసీఆర్.. మాజీ మంత్రి ఆనందరావుతో మాట్లాడిన తర్వాత లక్ష్మీనరసింహారావు కారెక్కినట్టుగా టాక్. చేరిక వరకు బాగానే ఉన్నా.. చల్మెడకు గులాబీ బాస్ ఇచ్చిన హామీ ఏంటన్నది ప్రశ్న. ఈ అంశంపైనే రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.
వేములవాడకు ఉపఎన్నిక వస్తే బరిలో ఉంటారా?
తండ్రి మంత్రిగా పనిచేసినా.. లక్ష్మీనారసింహారావుకు వారసత్వ రాజకీయాలు కలిసి రాలేదు. ఆర్థిక అంగబలం ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఓటమే. కరీంనగర్‌లో చల్మెడ కుటుంబం స్థిరపడినా.. వారి స్వస్థలం వేములవాడ నియోజకవర్గంలోని కొనకరావుపేట మండలం మల్కపేట. ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వచ్చి.. రమేష్‌పై అనర్హత వేటు పడితే.. వేములవాడలో జరిగే ఉపఎన్నికల్లో చల్మెడ టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. ఆయన మాత్రం వేములవాడలో పోటీ ఉండేందుకు టీఆర్‌ఎస్‌లో చేరలేదని వెల్లడించారు. దీంతో కొత్త ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయట.
కరీంనగర్ అసెంబ్లీపై గురిపెట్టారా?
కరీంనగర్ లోక్‌సభ లేదా కరీంనగర్ అసెంబ్లీపై చల్మెడ ఫోకస్ పెట్టినట్టు గులాబీ శిబిరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌పైనే రెండుసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు చల్మెడ లక్ష్మీనరసింహారావు. ఇప్పుడు టీఆర్ఎస్‌లో చేరడం ద్వారా కరీంనగర్ అసెంబ్లీపై గురిపెట్టారా? లేక ఇంకెవరి ప్లేస్‌కైనా చల్మెడ ఎర్త్ పెట్టబోతున్నారు అనే ఆసక్తి పార్టీ వర్గాల్లో పెరుగుతోంది. మరి.. కరీంనగర్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి.