వెలంపల్లి శ్రీనివాస్. తాజా మాజీ మంత్రి. పదకొండు మందికి కేబినెట్‌లో తిరిగి చోటు దక్కినా.. ఆ జాబితాలో తాను లేకుండా పోయానని కొత్తలో కొంత బాధపడ్డారట వెలంపల్లి. ఇప్పుడా బాధ నెమ్మదిగా పోతున్నట్టే ఉంది. రోజువారీ కార్యక్రమాలు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్‌లోనూ టూర్ వేస్తూ.. మళ్లీ గెలుపొందే ప్రయత్నాలు చేస్తున్నారట. మినిస్టర్ పోస్ట్ పోయినా.. హ్యాపీగా ఉండటానికి చాలా కారణాలు చెబుతున్నారు ఆయన అనుచరులు. గతంలో ఆయన చేపట్టిన మంత్రి పదవి వల్ల నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు వచ్చేవట. ఏం చేయాలన్నా.. ఏం మాట్లాడాలన్నా.. అన్ని ఆచి తూచి మాట్లాడాల్సి రావడంతో కొన్ని విషయాల్లో టచ్ మీ నాట్‌గా ఉండిపోయేవారట. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవని చెబుతున్నారు వెలంపల్లి సన్నిహితులు.
మొన్నటి వరకు వెలంపల్లి దేవదాయ శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువ. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటారు. ఆ కారణంగానే విజయవాడ పశ్చిమలో ముస్లింలను అన్ని పార్టీలు జాగ్రత్తగా చూసుకునేవి. గడచిన మూడేళ్లలో వెలంపల్లి దేవదాయ మంత్రి కావడంతో.. ఆ హోదాలో ముస్లింల గురించి ఏమైనా మాట్లాడాలన్నా.. చేయాలన్నా చాలా జాగ్రత్తలు తీసుకునేవారట. ఒకటికి రెండుసార్లు ఆలోచించి కానీ అడుగులు వేసేవారు కాదట. ఎమ్మెల్యేగా రెండు అడుగులు ముందుకు వేద్దామన్నా.. మంత్రి హోదా గుర్తొచ్చేదట. దీనికి తగ్గట్టు ఈ మూడేళ్లలో దేవాలయాల విషయంలో చాలా సున్నితమైన అంశాలు జరగడంతో వెలంపల్లి బుక్ అయ్యారు. ముస్లిం ఓటర్లు గుర్తొచ్చి ఆచితూచి స్పందించేవారట.
ప్రస్తుతం మంత్రి పదవి నుంచి దిగిపోయాక.. వెలంపల్లి యధేచ్ఛగా పర్యటనలు చేసేస్తున్నారు. నగరంలో బుధవారం వెలిసిన వెలంపల్లి ఫ్లెక్సీలు చూస్తే ఆ మార్పు నిజమే అనిపించేలా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మంత్రిగా ఉన్నన్నాళ్లూ ఫ్లెక్సీల్లో వెలంపల్లి ఫొటోలన్నీ బొట్టు పెట్టుకుని ఉండేవి. ప్రభుత్వ ఇఫ్తార్ విందు.. షాదీఖానా ప్రారంభోత్సవం సందర్భంగా పెట్టిన ఫ్లెక్సీల్లో బొట్టు లేకుండా వెలంపల్లి ఫొటోలు ఉన్నాయి. ఆ ఫొటోలు చూసినవాళ్లంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ ఫొటోల కోసం ప్రత్యేకంగా వెలంపల్లి ఫొటో షూట్ ఏమైనా చేశారా..? లేక గ్రాఫిక్స్‌లో ఏమైనా మార్పులు చేపట్టారా అని కేడర్ ఆరా తీస్తోందట.
ఏది ఏమైనా.. గతంతో పోల్చుకుంటే తమ నాయకుడు మరింత యాక్టీవ్‌గా తిరుగుతున్నారని వెలంపల్లి అనుచురులు హ్యాపీ. తమకు అందుబాటులో ఉంటున్నారనే కామెంట్సూ వినిపిస్తున్నాయి. మరి.. ఈ మార్పు.. మాజీ మంత్రికి రాజకీయంగా ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.