చంద్రబాబుకు ఎంపీ కేశినేని టాటా..! ఏపీ టీడీపీతోపాటు పొలిటికల్ సర్కిళ్లలో విస్తృత చర్చకు దారితీసిన అంశం ఇది. ఎంపీ ఆఫీస్‌లో ఒక్క ఫొటో మార్పు.. పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకీ కేశినేని మనసులో ఏముంది? పార్టీ మారుతున్నారనే ప్రచారం వెనక కథేంటి?
కేశినేని భవన్‌లో ఫొటో మార్పుతో రచ్చ రచ్చ..!
బెజవాడ టీడీపీలో రాజకీయ రచ్చ తగ్గేలా లేదు. పార్టీలో వర్గ విభేదాలవల్ల ప్రతి అంశం చర్చగా మారుతోంది. 2024 ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పిన ఎంపీ కేశినేని నాని.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒక ఎంపీగానే పనిచేసుకు వెళ్తానని.. టీడీపీ వ్యవహారాల్లో తన పాత్ర ఉండదని ఆయన చెప్పేశారు. ఇదే సమయంలో ఎంపీకి చెందిన కేశినేని భవన్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫొటో మార్పు రచ్చ రచ్చ అయింది. చంద్రబాబు- కేశినేని కలిసి ఉన్న ఫొటో స్థానంలో కేశినేని నాని.. రతన్‌టాటా కలిసి ఉన్న ఫొటో పెట్టారు. ఇది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
టాటా ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు కృతజ్ఞతగా ఆ ఫొటో పెట్టారట..!
నాలుగు అంతస్తుల కేశినేని భవన్ బయట.. లోపల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు.. ఫొటోలు అలాగే ఉన్నాయి. చంద్రబాబు నిలువెత్తు కటౌట్‌లు ఏమీ మార్చలేదు. లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జ్‌ల ఫొటోలు యథాతథంగా ఉన్నాయి. గత ఐదేళ్లుగా టాటా ట్రస్ట్‌తో కలిసి 270 గ్రామాల్లో కేశినేని సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆ సేవలను గుర్తు చేస్తూ ఫొటో పెట్టామన్నది ఆఫీస్ వర్గాలు చెప్పేమాట. కానీ.. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు తీసేశారు అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఎవరో పనిగట్టుకుని ఎంపీపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని.. బెజవాడకు చెందిన కొందరు నాయకులు దీనివెనక ఉన్నట్టు ఎంపీ నాని అండ్ కో అనుమానంగా ఉందట.
నానిపై వ్యతిరేక ప్రచారం వెనక టీడీపీ వర్గపోరు ప్రభావం?
ఏపీ టీడీపీ ఆఫీస్ కంటే.. తమ ఎంపీ ఆఫీస్‌కే ఎక్కువ ఫ్లెక్సీలు ఉంటాయని.. వాటి నిండా చంద్రబాబు ఫొటోలో కనిపిస్తాయని నాని అనుచరులు చెబుతున్నారు. టాటా ట్రస్ట్ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతగా చిన్న ఫొటో పెడితే ఇంత రాద్ధాంతం చేస్తారా అని ఫైర్ అవుతున్నారట. మరోవైపు బెజవాడ టీడీపీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వడం లేదు. దీనిపై టీడీపీ కేడర్‌లోనూ గందరగోళం నెలకొంది. నానితో మాట్లాడేందుకు పార్టీ అధినాయకత్వం ప్రయత్నించినట్టు సమాచారం.
బెజవాడ టీడీపీ వర్గపోరుపై అధినాయకత్వం నాన్చివేత..?
బెజవాడలో బొండా ఉమా, బుద్ధ వెంకన్నలతోపాటు కేశినేని నాని కూడా పార్టీకి అవసరమనే ఆలోచనలో టీడీపీ పెద్దలు ఉన్నారట. అందుకే వర్గపోరుపై ఎటూ తేల్చడం లేదట. ఇంతలో నాని గురించి ఏదో ఒకటి నెగిటివ్ ప్రచారం బయటకొస్తోందన్నది ఎంపీ శిబిరం వాదన. మరి.. ఆ విషయాన్ని టీడీపీ అధిష్ఠానం గుర్తించిందో లేదో? వర్గపోరుకు పరిష్కారం కనుగొంటుందో లేదో చూడాలి.