OTR: ఇంచార్జ్ Vs లోకల్ లీడర్స్: రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ.. చమర్తికి చెక్ పెడతారా?

  • రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్‌ చమర్తి జగన్ మోహన్ రాజుపై అసంతృప్తి
  • స్థానిక ఎన్నికల్లో ఇంకా శృతి మించిన వ్యవహారం
  • ఇన్ఛార్జ్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైన నాయకులు
  • వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు ఉన్న నియోజకవర్గం
Otr

Otr

OTR: వర్గ విభేదాలకు విరామం లేదు.. ఉన్న నేత విషయంలో అసంతృప్తి ఆగదు. లోకల్‌ టీడీపీ నాయకుల్ని కాదని ప్రతిసారి ఇంపోర్ట్‌ చేసుకోవడం, ఎక్కడో తేడా కొట్టి మళ్లీ మార్చేయడం రొటీన్‌గా మారిందట ఆ నియోజకవర్గంలో. ఈసారి ఇన్ఛార్జ్ అయితే… అంతా నా ఇష్టం అంటున్నారు. అధికార పార్టీకి గెలుపు గగనమైన ఆ నియోజకవర్గం ఏది? అక్కడే పదే పదే విఫల ప్రయోగాలు ఎందుకు చేస్తోంది? ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గం పాలిటిక్స్‌ కాస్త డిఫరెంట్‌. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా…. దాదాపు ప్రతి సందర్భంలోనూ ఇక్కడ ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి. అందుకు అసలు కారణం నాయకత్వ సమస్యేనని అంటారు. ఉన్న నేతపై అసంతృప్తి, వచ్చిన కొత్త నేతపై ఆధిపత్య పోరు ఇక్కడ సహజ పరిణామాలు. ఈ క్రమంలోనే రాజంపేట టిడిపి ఇన్చార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన చమర్తి జగన్ మోహన్ రాజు కూడా వివాదాస్పదం అవుతున్నారు. నందలూరు టీడీపీలో ఆయన మీద అసంతృప్తి కొండంత పెరిగిందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి.

ఇప్పుడు స్థానిక ఎన్నికల పుణ్యమా అంటూ… ఆ వ్యతిరేకత ఇంకా పెరిగిపోయింది. అందరినీ కలుపుకుని పోవాల్సిన నేత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సొంత పార్టీలోనే విమర్శలు పెరుగుతున్నాయి. ఇన్ఛార్జ్‌ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయామంటున్న నేతలు… ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో చమర్తి మార్క్‌ చూసి పార్టీ క్యాడర్ నివ్వెర పోయిందట. ఇక మిత్రపక్షాల నేతలు పైకి కామ్‌గానే కనిపిస్తున్నా… అంతర్గత చర్చల్లో మాత్రం టీడీపీ ఇన్ఛార్జ్‌ని ఎండగట్టేస్తున్నట్టు చెబుతున్నారు. రాజంపేట అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు రెండూ వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డి కూడా ఇక్కడి నుంచే ఉన్నారు. విపక్షం ఇంత బలంగా ఉన్న చోట కూటమిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా… స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలు ప్రస్తుత ఇంచార్జ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయంటున్నారు.

పరిషత్‌ ఎన్నికల్లో… నందలూరులో టిడిపి నేతలపైకే జగన్ మోహన్ రాజు వర్గం కాలు దువ్వడం, పరస్పరం రాళ్ళు, కర్రలతో దాడి చేసుకోవడం, ఏకంగా చమర్తి వర్గంలోని వ్యక్తి గన్ ఫైర్ చేయడం సంచలనం అయ్యాయి. అంత జరిగాక కూడా…. జగన్ మోహన్ రాజు పార్టీ నేతలతోగాని, కూటమి లీడర్స్‌తోగాని ఒక చిన్నపాటి భేటీ కూడా నిర్వహించకపోగా… తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారన్న విమర్శలు పెరుగుతున్నాయి. నందలూరు మేజర్ పంచాయతీ అభ్యర్థి ఎంపిక విషయంలో కూటమి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించారని, జనసేన బలపరిచిన అభ్యర్థిని కాదని రెబెల్‌ను రంగంలోకి దింపారని అంటున్నారు. దీంతో గ్లాస్‌ నేతలు ఆయనకు రివర్స్‌ అయ్యారు. ఇక రాజంపేట మునిసిపల్ ఎన్నికల్లో కూడా చమర్తి ప్లే చేసిన పాలిటిక్స్‌ చూసి పార్టీ అధిష్టాన పెద్దలు కూడా ముక్కున వేలేసుకున్నారట. చైర్మెన్ అభ్యర్థిగా దొంతం గాయత్రిని పోటీకి నిలబెట్టి ఏకగ్రీవం చేసుకున్నారు. వైస్ ఛైర్మన్ ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం తీసకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తన వర్గీయులతో నానా యాగీ చేయించారని అంటున్నారు. వైస్ చైర్మెన్‌గా గాయత్రి తండ్రి శివ ప్రసాద్ ను చేయాలని చమర్తి భావించారట.. అందుకు శివ ప్రసాద్ నుంచి భారీగానే ముట్టాయన్న గుసగుసలు ఉన్నాయి. కారణం ఏదైనా ఆరోజు జరిగిన రచ్చతో వైస్‌ ఎలక్షన్‌ ఒక రోజు వాయిదా వేయాల్సి వచ్చింది.

తర్వాత కూడా పార్టీ పెద్దలంతా రంగంలోకి దిగి… అఫీషియల్‌ క్యాండిడేట్‌కు ఓటేసేలా విప్‌ జారీ చేసినా… దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అధిష్టానం పంపిన నేతలపైకి తన వర్గం కౌన్సిలర్లను ఎగదోసి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పాటు, పరిశీలకులపై దాడికి యత్నించడం చూసి అంతా కంగుతిన్నారట. ఈ వ్యవహారశైలి గురించి పరిశీలకులంతా…అధిష్టానానికి పూసగుచ్చినట్టు చెప్పారట. దీంతో చమర్తికి చెక్ పెట్టే ప్రోగ్రామ్‌ మొదలైందని అంటున్నారు. ఇన్ఛార్జ్‌ పదవికే కళంకం తెచ్చేలా పనిచేస్తున్నావంటూ కొందరు సన్నిహితులు అంతర్గత సమావేశాల్లో జగన్‌మోహన్‌రాజుకు చెప్పినా… డోంట్ కేర్ అన్నట్టు సమాచారం. అంతేకాదు, నాకు అధిష్టానం దగ్గర పలుకుబడి ఉంది. నేను చెప్పిందే జరుగుతుందన్న ధీమా కూడా వ్యక్తం చేశారట. ఇలా… ప్రతిసారి రాజంపేటకు వేరే నియోజకవర్గం నుంచి నాయకుల్ని తీసుకొచ్చి ప్రోత్సహించడం, వారిపై అసమ్మతి రావడం, మళ్ళీ మార్చేయడం రొటీన్‌ అయిపోయిందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి స్థానిక టీడీపీ వర్గాలు.