OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?

  • ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బెట్టింగ్స్‌ జోరు
  • స్పెషల్‌ అట్రాక్షన్‌ కుప్పం, పుత్తూరు, తిరుపతి
  • వార్‌ వన్‌సైడ్‌ అనుకున్న చోట బెట్టింగ్‌లకు కారణాలేంటి?
  • కుప్పంను క్లీన్‌స్వీప్‌ చేస్తామంటూ టీడీపీ తరపున పందేలు
Otr

Otr

OTR: పోలింగ్‌ పూర్తయిపోయి అట్టా…. బ్యాలెట్‌ బాక్స్‌లకు సీల్‌ వేశారో లేదో…. ఇట్టా కౌంటర్స్‌ ఓపెన్‌ చేసేశారు బెట్టింగ్‌ బంగార్రాజులు. ఆ విషయంలో ఏపీ మొత్తం ఒక ఎత్తయితే…. ఆ మూడు చోట్ల మాత్రం మరో ఎత్తు అన్నట్టుగా ఉంది. వార్‌ వన్‌సైడేనని అనుకున్న రెండు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో ఇప్పుడెందుకు పందేలు, పై పందేలు పెరిగిపోతున్నాయి? కూటమికి తిరుగులేదని చెప్పుకుంటున్న ఆ మూడు చోట్ల పందెంరాయుళ్ళ లెక్కలు ఎలా ఉన్నాయి?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌ ఇప్పుడు రాజకీయ వర్గాలను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ బెట్టింగ్‌ బ్యాచ్‌లు చేస్తున్న హంగామా ఇంకా ఉత్కంఠ రేపుతోంది. ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని భావిస్తున్న కుప్పం, పుత్తూరు, తిరుపతిలో కూడా వాళ్లు లెక్కలు కడుతుండటం వెనక లెక్క ఏమై ఉంటుందా అంటూ సరికొత్త సందేహాలు పెరుగుతున్నాయట పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతున్న ప్రచారం వేరు, గ్రౌండ్‌ రియాలిటీ వేరని, ఆ మూడు చోట్ల ఫలితాలు అంత వన్‌సైడేం కాదన్న అంచనాతోనే పందెం రాయుళ్లు రెండు వర్గాలుగా విడిపోయి కోట్లాది రూపాయలు కాస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

ప్రభుత్వ అనుకూలత, సంక్షేమం, అధికారం తమను గట్టెక్కిస్తాయనుకుంటున్న అధికార కూటమి వైపు కొందరు పందేలు కడుతుంటే… స్థానిక వ్యతిరేకత, అభ్యర్థుల ఎంపికలో లోపాలు, సైలెంట్ ఓటింగ్ ప్రతిపక్ష వైసీపీకి కలిసి వస్తాయన్న లెక్కతో మరికొందరు కాయ్‌ రాజా కాయ్‌ అంటున్నారట. వాట్సాప్ గ్రూపులు, రహస్య స్థావరాల కేంద్రంగా పందేల దందా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జోరుగా జరుగుతోందన్న ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా కుప్పం, పుత్తూరు మున్సిపాలిటీలతో పాటు తిరుపతి కార్పొరేషన్ చుట్టూనే ఈ పొలిటికల్ బెట్టింగులు గట్టిగా తిరుగుతున్నాయని సమాచారం. ఇందులో కూడా…అన్నింటికంటే ఎక్కువగా పందేలు కాస్తున్న హాట్ సీటు కుప్పం మున్సిపాలిటీ. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో దీని మీద ఫోకస్‌ బాగా పెరిగింది. గత 2021 పురపాలక ఎన్నికల్లో టీడీపీకి ఇక్కడ కోలుకోలేని దెబ్బ తగిలింది. అప్పుడు మొత్తం 25 వార్డులు ఉండగా… కేవలం ఆరింటికే పరిమితమైంది సైకిల్ పార్టీ. అప్పట్లో వైసీపీ ఏకంగా 19 వార్డులు గెల్చుకుని కుప్పం తొలి మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఫ్యాన్ జెండా ఎగరేసింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో… ఈసారి ఎలాగైనా పూర్తి ఆధిపత్యం సాధించి గట్టిగా బదులివ్వాలన్న కసిగా ఉన్నారు తెలుగు తమ్ముళ్లు.

అందుకు తగ్గట్టే… పెరిగిన వాటితో కలిపి 32 వార్డులున్న కుప్పంలో ఏకంగా 13 చోట్ల టీడీపీకి ఏకగ్రీవమైంది. మిగిలిన 19 స్థానాలకు జరిగిన పోరులో….. కొట్టేస్తామని, మొత్తం వార్డుల్ని తుడిచిపెట్టేస్తామని టీడీపీ శ్రేణులు సవాల్ విసురుతుంటే… అంతలేదమ్మా… వైసీపీ కూడా ఉనికి చాటుకుంటుంది, పట్టు చూపిస్తుందంటూ ఫ్యాన్ నేతలు పందేలు కాస్తున్నారట. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్, వైసీపీ ఎమ్మెల్సీ భరత్ మధ్య మాటల తూటాలు పేలిన క్రమంలో.. కుప్పంపై పందేల జోరు పెరిగిందని అంటున్నారు. ఇక నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు మున్సిపాలిటీపై సాగుతున్న బెట్టింగులు జిల్లా రాజకీయాల్లో మరో రకంగా సెగ పుట్టిస్తున్నాయి. ఇక్కడ కూటమి పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థి బరిలో నిలవడంతో లెక్కలు మరింత రసవత్తరంగా మారాయి. ఎలాగైనా పుత్తూరు మున్సిపాలిటీని కూటమి ఖాతాలో వేసి మాజీ మంత్రి రోజాకు మరోసారి గట్టి షాక్ ఇవ్వాలని తమ్ముళ్లు, జనసైనికులు ఉవ్విళ్లూరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పుత్తూరు మున్సిపాలిటీలో వచ్చిన పదివేల మెజార్టీ కంటే ఆధిక్యంతో ఇక్కడ గెలుస్తామంటూ పందెం కడుతున్నారట కూటమి కార్యకర్తలు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న సామాజిక సమీకరణాలు, చివరి నిమిషంలో జనసేనకు సీటు కేటాయించడం, స్థానికంగా ఉన్న తమిళ ఓటర్లు, వయోవృద్ధుల ఓటింగ్‌ లాంటి అంశాలను నమ్ముకుని వైసీపీ శిబిరం ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది.

అటు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్రపక్షాన్ని గెలిపించి పార్టీ పెద్దల దగ్గర మార్కులు కొట్టేయాలని గ్రౌండ్ వర్క్ చేశారు. దాంతో… రోజాకు మరో షాక్ తప్పదంటూ కూటమి తరపున పందేలు కాస్తుంటే… ఎమ్మెల్యే భానుకు రోజా స్ట్రాంగ్‌ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంటూ ఫ్యాన్ నేతలు అంతే ధీటుగా బెట్‌ కడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అటు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో నడుస్తున్న బెట్టింగుల కథ వేరే లెవల్‌. గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి కూటమి తరఫున జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు 60 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం మేయర్‌ సీటు టీడీపీ కోటాలోకి వచ్చింది. ఇక్కడ సొంతగా అంత బలం లేని జనసేనే కూటమి దన్నుతో 60 వేల ఆధిక్యం సాధించినప్పుడు, టీడీపీకి కంచుకోటగా ఉన్న తిరుపతి కార్పొరేషన్‌లో మెజారిటీ వార్డులను భారీ తేడాతో గెలుచుకుంటామని అంటున్నారు తెలుగుదేశం నాయకులు.

అదే సమయంలో వైసీపీ నేతలు కూడా ఏమాత్రం తగ్గడం లేదట. ఊహించని మెజారిటీతో తిరుపతి మేయర్ స్థానాన్ని, అత్యధిక వార్డులను గెలుచుకుని అధికార పక్షానికి షాక్‌ ఇస్తామంటూ ఆ వర్గం బెట్టింగ్‌లు పెడుతోందంటున్నారు. సాధారణ ప్రజల్లోనూ తిరుపతిలో కూటమికి ఎంత మెజారిటీ వస్తుందనే అంశంపైనే ఎక్కువ చర్చలు, బెట్టింగులు నడుస్తున్నాయి. ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నమోదైన భారీ పోలింగ్ శాతమే పందెంరాయుళ్ల బుర్రలను మరింత హీటెక్కిస్తోంది. పెరిగిన ఓటింగ్ శాతం కూటమి సంక్షేమ కార్యక్రమాల ఫలితమేనని అధికార పక్షం వైపు నిలిచేవారు వాదిస్తుంటే… లోలోపల ఉన్న సైలెంట్ ఓటింగే ఈ రికార్డు పోలింగ్‌కు కారణమని ప్రతిపక్షం వైపు మొగ్గే పందెం రాయుళ్లు లెక్కలేస్తున్నారు. అటు కుప్పంలో సీఎం ఇలాకా పరువు, ఇటు పుత్తూరులో రోజా వర్సెస్ ఎమ్మెల్యే భాను ప్రతిష్ట, మరోవైపు తిరుపతిలో కూటమి మెజారిటీ సవాల్… వెరసి కోట్లాది రూపాయల బెట్టింగులు జిల్లాలో నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.