NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ను అడ్డుకుంటోంది ఎవరు?

Pawan

Pawan

సీఎం జగన్ పాలనకు వ్యతిరేకంగా ఉమ్మడిపోరు చేస్తామని ప్రకటించాయి టీడీపీ – జనసేన. ప్రతిపక్షాలను కూడా కలుపుకొని ఉమ్మడిగా ఉద్యమాలు చేస్తామని ఘనంగా వెల్లడించాయి. ఆ సందర్భంగా పవన్ స్పీడ్ చూసిన వాళ్లకు ఆ రోజో.. ఆ తర్వాత రోజో కార్యాచరణ ప్రకటిస్తారని… రెండు పార్టీల కార్యకర్తలు కలిసి రోడ్ల మీదకు వస్తారని అంతా అనుకున్నారు. అంతేనా… టీడీపీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జనసేనతో పోత్తుకు ఇక బీజం పడినట్టేనని అంతా భావించారు. కానీ నెల రోజులైనా ఉమ్మడి కార్యాచరణ లేదు… దాని గురించిన ఊసే లేదు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఆగింది? అనే చర్చ ఇప్పుడు జరగుతోంది. పవన్ కల్యాణ్ వైజాగ్ టూర్ సందర్భంగా గత నెల 11న ఎయిర్ పోర్టులో రచ్చ రచ్చ జరగింది. విశాఖ గర్జన పూర్తి చేసుకుని వైజాగ్ ఎయిర్ పోర్టుకు వచ్చిన మంత్రుల కార్లపై దాడి జరిగింది. అది జనసేన నేతల పనేనని పోలీసులు కేసులు పెట్టి వందల మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో వైజాగ్ మొత్తం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఉత్తరాంధ్ర జనవాణి కోసం వైజాగ్ వెళ్లిన పవన్ కల్యాణ్‌ను హోటల్ నుంచి అడుగు బయటపెట్టనివ్వలేదు పోలీసులు. హోటల్ నుంచి నేరుగా విజయవాడ వచ్చిన పవన్ కల్యాణ్‌ను టీడీపీ అధినేత స్వయంగా వెళ్లి కలిశారు. పరామర్శించారు. ఇద్దరూ కలిసి ప్రెస్మీట్ పెట్టారు.

రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలకు పాల్పడుతోందని.. వాటికి వ్యతిరేకంగా ఉమ్మడిగా ఉద్యమం చేస్తామని… అక్కడ ప్రకటన చేశారు ఇద్దరు నేతలు. అయితే ఇప్పటికి అది కార్యరూపంలోకి రాలేదు. ఎందుకు జరగలేదో ఎవరికీ అంతుచిక్కలేదు. టీడీపీతో కలిసి వెళ్లాలన్నది జనసేనాని కోరిక. దానికి బీజేపీ ససేమిరా అంటోంది. త్వరగా టీడీపీతో కలిసి… త్వరత్వరగా జగన్‌ను సీఎం పదవి నుంచి దించేయాలన్నది జనసేనాని బలమైన కోరిక. కానీ దానికి బిజేపీ ఎప్పటికప్పుడు అడ్డుపడుతూనే ఉంది. పవన్ చెప్పటినట్టు చేయడం బీజేపీకి సుతరాము ఇష్టం లేదు. 2014 నాటి టీడీపీ-బీజేపీ-జనసేన కాంబినేషన్‌ను పునరావృతం చేయాలన్నది టీడీపీ, జనసేన ఉద్దేశం. దానికి బీజేపీ నో చెప్తోంది. ఇది పవన్ కల్యాణ్ కు అస్సలు నచ్చడం లేదు. ఏపీ బీజేపీ నాయకత్వంపై ఆయన పీకల్లోతు కోపంతో ఉన్నారు. ఉండటమే కాదు… అదే విషయాన్ని మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో బయటపెట్టేశారు కూడా. బీజేపీతో పొత్తులో ఉన్నా కలిసి ముందుకు సాగలేకపోతున్నామని… మోడీ అన్నా… బీజేపీ కేంద్ర నాయకత్వం అన్నా…తనకు బలమైన మంచి అభిప్రాయాలు ఉన్నాయని.. అలాగని ఊడిగం చేయబోనని చెప్పారు. అంతేనా… తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంటానని సంచలన ప్రకటన చేశారు. అది చూసిన వారికి.. పవన్ మాటలు విన్న వారికి… ఇక బిజేపీకి రాంరాం చెప్తేస్తారని అనుకున్నారు. కానీ…. అదీ జరగలేదు. పొత్తుల విషయంలో తన సొంత అభిప్రాయాలను పవన్ అమలు చేయలేకపోతున్నారట. తాను ఏదో చేయాలని అనుకోవడం దానికి కమలనాథుల నుంచి నో చెప్పడం పరిపాటిగా మారిందట.

టీడీపీతో కలిసి ఉమ్మడిగా పోరాడతాం అన్న పవన్ ప్రకటన కార్యరూపం దాల్చకపోడానికీ అదే కారణం అట. పవన్ పోలిటికల్ ఈక్వేషన్స్ … బీజేపీ బాస్‌ల లెక్కలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయట. టీడీపీతో కలిసి ఉద్యమాలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని బతికించడం కమలనాధులకు ఇష్టం లేదు. అందుకే టీడీపీ భాగస్వామ్యంతో చేసే ఏ కార్యక్రమానికీ ఆ పార్టీ నుంచి పవన్‌కు అనుమతి రావడం లేదట. ఉమ్మడి ఉద్యమాలు చేద్దాం అన్న పవన్ ప్రతిపాదనలతో టీడీపీ రెడీ అయ్యిందట. కానీ… పవన్ వైపు నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో పార్టీ ఇంతకు ముందే చేపట్టిన బాదుడే బాదుడును మళ్లీ స్పీడ్ పెంచుకుంటోందట.