పాత రోత.. కొత్త వింత..! తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఇదే ఫాలో అవుతున్నారా? ‘కొత్త’ పెత్తనాలపై ‘పాత’వాళ్లు చిటపటలాడుతున్నారా? వెంట కేడర్ లేకుండా సింగిల్‌గా వచ్చి.. కాషాయ కండువా కప్పుకొంటున్న లీడర్ల తీరుపై ‘ఓల్డ్’ బీజేపీ నేతల అభ్యంతరాలేంటి? ఈ అంశంపై కమలదళంలో ప్రశ్నల పరంపర మొదలైందా? లెట్స్ వాచ్..!
గట్టిగానే సౌండ్ చేస్తోన్న ఓల్డ్ బీజేపీ నేతల ప్రశ్నలు..!
మొదటి నుంచి జెండాలు మోసేది మేము..! మాపై పెత్తనం చేసేది కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులా? ఇదేం పద్ధతి..? పార్టీలో జీవితాంతం జెండా మోస్తూనే ఉండాలా..? ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఈ ప్రశ్నలు గట్టిగానే సౌండ్ చేస్తున్నాయి. ఈ ప్రశ్నలు విన్న రాష్ట్ర నాయకత్వం నుంచే రీసౌండ్ లేదు. ఈ ఆసక్తికర పరిణామాలకు ఇటీవల జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ.. పదాధికారుల సమావేశాలు వేదికయ్యాయి. పార్టీలో ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్నవాళ్లు చాలా మందే ఉన్నారట. కానీ.. క్రమశిక్షణ గుర్తొచ్చి.. పైకి చెప్పుకోలేక.. ప్రశ్నించలేక ఇబ్బంది పడుతున్న కమలనాథులు లిస్ట్ పెద్దదేనని సమాచారం. ఎట్టకేలకు ఒక ఓల్డ్ బీజేపీ నేత బరస్ట్ కావడంతో.. మిగతావాళ్లు సైతం గళం ఎత్తడానికి గొంతు సవరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కాషాయ శిబిరంలో ఇదే హాట్ టాపిక్.
బీజేపీలో పాత తరం నేతలకు ప్రాధాన్యం తగ్గుతోందా?
ఈ ప్రాంతంలో బీజేపీ పేరు చెబితే వేళ్లమీద లెక్కపెట్టుకునే నాయకులు ఉండేవారు. దశాబ్దకాలంగా పరిస్థితి మారిపోయింది. వలసలు పెరిగాయి. దీంతో బీజేపీలోని పాత తరం నేతలకు ప్రాధాన్యం తగ్గడమో.. కనుమరుగు కావడమో జరుగుతోందన్న చర్చ ఉంది. సంవత్సరాల తరబడి పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలు.. ద్వితీయశ్రేణి నాయకులు.. నియోజకవర్గస్థాయి నేతలు వెనకబెంచీకి వెళ్లిపోతున్నారట. ఇప్పుడంతా కొత్త నాయకులదే హవా. ఇది మంచి పరిణామం కాదన్నది పాత బీజేపీ నాయకుల అభిప్రాయమట. కొత్తవారిని జాయిన్ చేసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నట్టు తెలుస్తోంది.
సింగిల్‌గా వచ్చే వలస నేతలకు తామే జెండాలు కట్టాలి.. జైజైలు కొట్టాలా?
ఇటీవల జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీలో కొత్తగా వచ్చిన వారి అంశం ప్రస్తావనకు వచ్చిందట. ఒక్కరే లింగు లిటుక్కుమంటూ బీజేపీలో చేరుతున్నారని.. వాళ్ల వెంట కేడర్ కూడా రావడం లేదని కొందరు చెప్పినట్టు సమాచారం. అలా వచ్చిన వారికి కూడా తామే జెండాలు కట్టాలి.. జై జై కొట్టాలి అని ఓల్డ్ బీజేపీ నాయకుడొకరు అసంతృప్తిని బయటపెట్టారట. ఏక్ నిరంజన్‌లా వచ్చిన వాళ్లకే స్టేజ్‌పైన.. మీటింగ్‌లలో ముందువరసలో చోటు ఉంటోందని.. మోడీవంటి బలమైన నాయకత్వం ఉన్న పార్టీలో సిస్టమ్ తప్పొద్దని ఆ నాయకుడు సూచించారట.
బీజేపీ పెరుగుతోందని వస్తున్నారా? బీజేపీని పెంచాలని వస్తున్నారా?
రాష్ట్ర కార్యవర్గంలో ప్రస్తావనకు వచ్చిన ఈ అంశంపై బీజేపీలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇటీవల కాషాయ కండువా కప్పుకొన్న నేతల్లో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్లు కేడర్ లేని లీడర్లేనని.. వారికే పెద్దపీట వేస్తున్నారని ఎక్కడికక్కడ అసంతృప్తి వ్యక్తం అవుతోందట. కొత్తవారిని బీజేపీలోకి ఆహ్వానించడంలో తప్పులేదని.. అయితే పార్టీ పెరుగుతోందని వస్తున్నారా లేక.. పార్టీని పెంచాలని వస్తున్నారో గమనించాలని వాదిస్తున్నారు. పైగా జెండాలు మోసేది మేము.. మాపై పెత్తనం చేసేది వాళ్లా అని ప్రశ్నిస్తున్నారు కూడా. మరి… ఈ పాత.. కొత్త రచ్చను బీజేపీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.