సీఎం సొంత జిల్లాలో MLC ఎన్నిక ఏకగ్రీవం కాకుండా టీడీపీ వేసిన ఎత్తుగడ చీదేసింది. అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటీ..! వెనుకా ముందు ఆలోచించకుండా విసిరిన పాచికలు రివర్స్ కొట్టాయి. సీన్ సీతారైంది. ఉన్నదీపాయే అని కేడర్ తల పట్టుకున్న పరిస్థితి. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.
టీడీపీ మద్దతుతో నామినేషన్ వేసిన రమణయ్య
ఉమ్మడి కడప జిల్లా స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో టీడీపీ అనుసరించిన వ్యూహం బెడిసికొట్టింది. స్థానిక సంస్థల్లోని ఓటర్లలో 98 శాతం మంది అధికారపార్టీ వైసీపీకి చెందిన వాళ్లే. మిగిలిన ఇండిపెండెంట్లు, టీడీపీ ప్రజాప్రతినిధుల ఓట్లు 60 వరకు ఉంటాయి. ఎంత పోరాటం చేసినా వైసీపీని కాదని ఒక్క ఓటు అదనంగా టీడీపీకి దక్కడం అంత సులువైన విషయం కాదు. ఈ సంగతి జిల్లా టీడీపీ నేతలకు తెలియంది కాదు. కానీ.. సీఎం సొంత జిల్లాలో వైసీపీ MLC అభ్యర్థి రామసుబ్బారెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ఏం చేయాలా అని తెగ జుట్టు పీక్కున్నారు జిల్లా టీడీపీ నేతలు. ఇంతలో టీడీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రమణయ్య యాదవ్ నామినేషన్ వేయడంతో ఎన్నికలు తప్పవనే భావన కలిగింది. కానీ… రమణయ్య యాదవ్ నామినేషన్ స్క్రూటినీలో పోవడంతో టీడీపీ కథ అడ్డం తిరిగింది. అయితే ఈ సందర్భంగా జరిగిన పరిణామాలే రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి.
ప్రతిపాదిత సంతకాలు తమవి కావని టీడీపీ కౌన్సిలర్లు ఫిర్యాదు
రమణయ్య యాదవ్ నామినేషన్ పత్రంలో తాము ప్రతిపాదిత సంతకాలు చేయలేదని ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లు ఫిర్యాదు చేయడంతో సీన్ రివర్స్ అయ్యింది. ఆ సంతకాలు తమవి కావని ఏకంగా ఎన్నికల అధికారికే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు ఆ టీడీపీ కౌన్సిలర్లు. వారే ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని ఏకైక టీడీపీ కౌన్సిలర్ శివజ్యోతి, మైదుకూరు మున్సిపాలిటీలోని టీడీపీ కౌన్సిలర్లు వెంకట సుబ్బారెడ్డి, ఖాదర్ బాషా. దీంతో అభ్యర్థి రమణయ్య యాదవ్‌తో పాటు జిల్లా టీడీపీ నేతలు షాక్ తిన్నారు. ఎన్నికల అధికారి ఎదుట రమణయ్య యాదవ్ బిక్కముఖం వేశారు. ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడం ఓ ఎత్తు అయితే.. ఎన్నికల నియమావళి ప్రకారం చట్టబద్ధంగా నడుచుకుంటానని ప్రమాణం చేసి.. తప్పుడు వివరాలు ఇచ్చినందుకు రమణయ్య క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సి వస్తోంది.
టీడీపీకి చెందిన నేతలే తెరవెనుక షాక్ ఇచ్చారా?
వైసీపీ ప్రలోభపెట్టి తమ ముగ్గురు కౌన్సిలర్లతో తప్పుడు ఫిర్యాదు చేయించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నప్పటికీ.. ఈ ఎపిసోడ్‌లో మరో చర్చా నడుస్తోంది. ఈ ముగ్గురు కౌన్సిలర్లు రివర్స్ కావడంలో టీడీపీకే చెందిన ఓ మైనారిటీ నాయకుడు… మరో మండలస్థాయి నేత కీలక పాత్ర పోషించినట్టు చర్చ సాగుతోంది. కౌన్సిలర్ శివజ్యోతి భర్త కుతుబుద్దీన్ టీడీపీకి చెందిన TNTUC జిల్లా అధ్యక్షుడు. అలాంటి నాయకుడి సతీమణే ప్లేటు ఫిరాయించడంతో హాట్ టాపిక్‌గా మారింది. పైగా మైదుకూరు టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలోని కౌన్సిలర్ల తీరు కూడా తెలుగు తమ్ముళ్లకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికలను జిల్లా టీడీపీ నేతలు సీరియస్‌గా తీసుకోలేదా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తలవంపులు తెచ్చేలా సీనియర్ నాయకులు వ్యవహరించారనే ప్రచారం జరుగుతోందట. టీడీపీ జిల్లా అధ్యక్షులు, నామినేషన్‌కు పురమాయించిన నేతలు సీరియస్‌గా లేరన్న విమర్శలు కేడర్‌లో వినిపిస్తున్నాయి. బలం లేని చోట అభ్యర్థిని పోటీకి పెట్టినప్పుడు.. స్థానిక సంస్థల్లోని తమ ప్రజాప్రతినిధుల కదలికలపై నజర్ పెట్టాలి. నామినేషన్‌లో ప్రతిపాదితులుగా సంతకాలు పెట్టినవాళ్లను కాపాడుకోవడం అత్యంత కీలకం. ఈ విషయం తెలిసినా అంతా లైట్ తీసుకున్నారనే చర్చ నడుస్తోంది. మొత్తానికి ఉమ్మడి కడప జిల్లా టీడీపీలో ఏ కార్యక్రమం నిర్వహించినా సమన్వయ లోపం ఉంటుందనేది MLC ఎన్నికల సందర్భంగా మరోసారి రుజువైంది.