ఎన్నికలు సమీపించే కొద్దీ మానుకోట రాజకీయం రాజుకుంటోంది. విమర్శలకు మరింత పదును పెడుతున్నారు లోకల్ ఎమ్మెల్యే. అయితే ఆయన గురి విపక్షాలపైనా.. లేక సొంత పార్టీలోని వైరిపక్షంపైనా..? ఎడా పెడా రెండుపక్షాలకు ఒకేసారి ఎమ్మెల్యే చాకిరేవు పెడుతున్నారా? పొలిటికల్ హైటెంపరేచర్‌లో చలి కాచుకుంటోంది ఎవరు?
మళ్లీ నోటికి పనిచెబుతున్న ఎమ్మెల్యే నాయక్
శంకర్ నాయక్. మహబూబాబాద్ అధికారపార్టీ ఎమ్మెల్యే. వివాదాస్పద వ్యాఖ్యలకు శంకర్ నాయక్‌ను కేరాఫ్ అడ్రస్‌గా చెబుతుంటారు BRS నాయకులు. తాజాగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలోనూ అదే చేశారు. విపక్ష పార్టీ నేతలను ఎమ్మెల్యే టార్గెట్ చేసినా.. లోగుట్టు వేరే ఉందని గులాబీ శిబిరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అనుమానాలకు కారణాలు లేకపోలేదు. ఇటీవల కాలంలో మానుకోటలో విపక్ష పార్టీ నేతల పర్యటనలు పెరిగాయి. ఇక సొంత పార్టీలో ఎమ్మెల్యేకు వైరిపక్షం ఉండనే ఉంది. వెరసి రెండు వైపుల నుంచి శంకర్ నాయక్‌కు రాజకీయ విమర్శల వాయింపు తప్పడం లేదు. ఇటీవల కాలంలో ఈ డోస్ ఇంకా పెరగడంతో.. లాభం లేదని అనుకున్నారో ఏమో.. ఎప్పటిలా తన నోటికి పనిచెప్పేస్తున్నారు. ఈ పదం నిషేదం.. లేదా ఆ మాట మాట్లాడకూడదు అనే నియమాలు ఏమీ లేకుండా.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తున్నారు ఈ ఎమ్మెల్యే. ఇంతకీ ఆయన తిట్టింది విపక్ష నేతలనా.. లేక సొంత పార్టీ నాయకుల్నా.. మానుకోట రాజకీయ శిబిరాల్లో ఈ డౌటే నెలకొంది.
అప్పట్లో షర్మిళ వర్సెస్ శంకర్ నాయక్
ఆ మధ్య వైఎస్ షర్మిల మాహబూబాబాద్‌లో పాదయాత్ర చేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్సెస్ షర్మిల మధ్య మాటల దాడి శ్రుతి మించింది. నానా రచ్చ అయ్యింది. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేశారు. రేవంత్ కూడా స్థానిక ఎమ్మెల్యేను గట్టిగానే కార్నర్ చేశారు. దీంతో కామ్‌గా ఉంటే రాజకీయంగా దెబ్బతింటామని అనుకున్నారో ఏమో.. వలస పక్షులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక కోసేస్తానని వార్నింగ్ ఇచ్చారు శంకర్ నాయక్. ఇంతకీ శంకర్ నాయక్ దృష్టిలో వలస పక్షులు ఎవరు? షర్మిల, రేవంత్‌లను ఉద్దేశించే ఆ కామెంట్స్ చేశారా లేక.. గులాబీ శిబిరంలోని తన ప్రత్యర్థులకు చురకలు వేశారా? ఈ ప్రశ్నల చుట్టూనే చర్చ సాగుతోంది. మానుకోటలో శంకర్ నాయక్‌కు.. ఎంపీ మాలోతు కవితకు పడటం లేదు. అలాగే మంత్రి సత్యవతి రాథోడ్‌తోనూ ఎమ్మెల్యేకు గ్యాప్ ఉంది. ఈ ముగ్గురూ అధికారపార్టీలోనే ఉన్నప్పటికీ ఉప్పు నిప్పులా కొనసాగుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో నాయక్ రివర్స్ అటాక్..!
మానుకోటలో పట్టు పెంచుకునేందుకు మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ మాలోతు కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. ఛాన్స్ చిక్కితే ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై వీరి నుంచి పంచులూ పడుతున్నాయి. వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఎవరికి వారు మహబూబాబాద్‌లో కదలికలు పెంచడంతో శంకర్ నాయక్ రివర్స్ అటాక్ మొదలుపెట్టారని అనుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలను వేదికగా చేసుకుని దుమ్ము దులిపేశారు నాయక్. నియోజకవర్గానికి వచ్చే నేతలు ఎవరైనా విమర్శలు.. ఆరోపణల్లో సంయమనం పాటించకపోతే మానుకోట కంకరరాళ్లకు మరోసారి పని కల్పించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అంతా బాగానే ఉంది. ఇంతకీ శంకర్ నాయక్ ఎవరిని తిట్టారు? విపక్షల్నా.. స్వపక్షంలోని నాయకుల్నా..? అనేది కేడర్‌కు అంతుచిక్కడం లేదని చెబుతున్నారు. ఈ అంశంపై ఎమ్మెల్యే శిబిరం వాదన మరోలా ఉంది. ఎవరు ఎలా అర్ధం చేసుకుంటే అలా..! ఇది అందరికీ వర్తిస్తుంది అని చెప్పడం హీట్ పెంచుతోంది. అయితే ఈ వ్యూహం ఎమ్మెల్యేకు పొలిటికల్‌గా వర్కవుట్ అవుతుందా… లేదా అనేది ప్రశ్నే. కాకపోతే ఎన్నికలు సమీపించే కొద్దీ మానుకోట రాజకీయం రసకందాయంలో పడటం ఖాయమనే వాదన నడుస్తోంది.