కుక్క తోకను ఆడించాలిగానీ… తోక కుక్కని ఆడించకూడదన్న సామెతను అక్కడ పదే పదే గుర్తు చేసుకుంటున్నారా? నలుగురు షాడో ఎమ్మెల్యేలు తయారై నియోజకవర్గాన్ని నలిపేస్తున్నారా? ఎమ్మెల్యే పేరు చెప్పి పీఏలు పనులు చేసుకుంటూ నాలుగు రాళ్ళు వెనకేసుకుంటున్నారా? ఆ కాంగ్రెస్ శాసనసభ్యుడు వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎక్కడ జరుగుతోందా తంతు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికలకు ముందు అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న యెన్నం…బీఆర్ఎస్ మీదున్న వ్యతిరేకత, ఇతర టికెట్ ఆశావహులంతా కలిసి పని చేయడం లాంటి కారణాలతో ఈజీగా అసెంబ్లీ మెట్లు ఎక్కారు. అంత వరకు బాగానే ఉన్నా….. కొన్నాళ్ళ పాటు ఆల్ఈజ్‌వెల్ అనుకున్నా… ఇటీవల పాలమూరు హస్తం చీలపోయిందన్నది ఇంటర్నల్ టాక్. ఇందులో కొత్త కాంగ్రెస్‌గా పిలిచే ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిది ఒక గ్రూప్ కాగా …. పాత కాంగ్రెస్‌గా చెప్పుకునే డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌ది మరో వర్గం.
ఈ వర్గాలతో నియోజకవర్గంలోని సీనియర్ లీడర్స్ సైతం రెండుగా చీలిపోయారు. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ టీంకు ఢిల్లీ స్థాయి పెద్ద ఒకరు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే… గ్రూపులున్నా, మొదట్లో ఎవరి పని వారు చేసుకునేవారు. కానీ… ఇటీవలి కాలంలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే దాకా వెళ్తోందట వ్యవహారం. మాది పాత కాంగ్రెస్. అంతా మేమేనని ఓ వర్గం అంటుంటే… పాతేంది కొత్తేంది భయ్…. అంతా కాంగ్రెసోళ్ళమేనని మరో టీమ్ గట్టిగా మాట్లాడుతుంటడం కాక రేపుతోంది. మరోవైపు మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేల పెత్తనాలు పెరిగిపోతున్నాయట. ఎమ్మెల్యే కోటరీలోని నలుగురైదుగురు అసలు మేమే ఎమ్మెల్యేలమని ఫీలైపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తం మేమే.
మేం ఆర్డరేస్తే ఎమ్మెల్యే వేసినట్టేనంటూ… గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్స్‌లో సైతం హవా నడిపిస్తున్నారట. ఇక ప్రైవేట్ సెటిల్ మెంట్స్, భూముల పంచాయతీల్లో మునిగి తేలుతున్నట్టు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. జిల్లా కేంద్రం అయిన మహబూబ్‌నగర్‌లో ఎస్ ఐ , మొదలు పోలీస్ ఉన్నతాధికారుల వరకు అందర్నీ తమ గుప్పిట్లో పెట్టుకుని షాడో ఎమ్మెల్యేలు ఇసుక , మట్టి , ఫిల్టర్ ఇసుక దందాలు చక్కబెడుతున్నారన్న ప్రచారం ఉంది. ఇక పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పలువురు బాధితులకు సైతం వన్ టౌన్ సమీపంలోని షాడో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని చెప్పేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఎక్సైజ్ శాఖ అధికారుల ద్వారా మద్యం షాపుల యజమానులను భయపెట్టి తమ వాళ్ళకు సిట్టింగ్ దుకాణాలు ఇప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఇక పట్టణంలోని లిటిగేషన్ ల్యాండ్స్ కన్నేసి పలువురిని భయపెడున్నారట. మరోవైపు మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్దుల ఎంపిక నాదేనని చెప్పుకుంటున్నారట ఎమ్మెల్యే. దాంతో పలువురు ఆశావహులు ఆయన చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ పనులు ఇప్పించడం, రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్ శాఖల్లో పైరవీలన్నీ షాడో ఎమ్మెల్యేల కనుసన్ననల్లో జరుగుతున్నాయన్నది లోకల్ టాక్. వాళ్ళది ఒక లెక్క అయితే… ఎమ్మెల్యే పీఏలది మరో లెక్క.
ప్రస్తుతం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి నలుగురు వ్యక్తిగత సహయకులు ఉన్నారు. వీరంతా వివిధ డిపార్ట్‌మెంట్స్‌ని పంచుకుని లైజనింగ్ వ్యవహారాలు చూస్తున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్టుగా వీరి వ్యవహారశైలి ఉంటోందని నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నారు. ఎవరికైనా సాయం చేయమని ఎమ్మెల్యే చెప్పినా సరే… ముందు వీళ్ళు సంతృప్తి చెందాలట. ఇక పోలీస్ పైరవీలు మొదలు అన్ని శాఖల్లో సార్ చెప్పారంటూ సొంత పనులు చక్కబెట్టుకొని నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నటైంలో ఆయా డివిజన్ల ఆశావహులకు మున్సిపల్ పనులు ఇప్పించడం, కమీషన్ నొక్కేయడంలో ఒక పీఏ కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆ ఆఫీస్‌లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఎమ్మెల్యే హాజరయ్యే వివిధ ప్రయివేటు కార్యక్రమాలకు నిర్వాహకుల నుంచి పీఏలు గట్టిగానే పిండుకుంటున్నట్టు టాక్. మొత్తం మీద మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మెతక వైఖరికి తోడు తన గెలుపు కోసం క్రుషి చేసిన వారు పవర్ ఎంజాయ్ చేస్తే తప్పేముందిలే అనే భావనలో ఉండటం ఇతరులకు బాగా కలిసి వస్తోందంటున్నారు. షాడోల ఆగడాలు, పిఏల పిండేసుకోవడాలు కలగలిసి ఎమ్మెల్యేని గట్టిగా డ్యామేజ్ చేస్తున్నాయన్న అభిప్రాయం బలంగా ఉంది. అన్నీతెలిసి కూడా ఎమ్మెల్యే ఇలా వదిలేస్తున్నారంటే ఆయన మరోసారి గెలవాలని అనుకోవడం లేదా అన్న మాటలు వినిపిస్తున్నాయి లోకల్‌గా.