పంచాయతీ పోరు ఆ ఎంపీలకు ప్రెస్టీజ్ ఇష్యూ అయిందా? అందుకే ఆఫర్స్ మీద ఆఫర్స్…. బంపరాఫర్స్ అంటూ పల్లె ఓటర్స్‌ను టెంప్ట్ చేస్తున్నారా? మేటర్ చివరికి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ హామీ దాకా వెళ్ళిపోయిందా? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? ఏ పార్టీ ఎంపీలు అలా హామీల వరద పారిస్తున్నారు? తెలంగాణలో గ్రామ పంచాయతీ పోరు రసవత్తరంగా జరుగుతోంది. ఇవి పార్టీలకు అతీతమైన ఎన్నికలైనా, ఆ సింబల్స్‌తో సంబంధం లేకున్నా…. అన్ని పార్టీల కేడర్ హడావిడి మాత్రం తగ్గడం లేదు. వాళ్ళ ఎన్నికల గుర్తు ఒక్కటే ఉండదు తప్ప…మిగతా మొత్తం రాజకీయ ప్రమేయంతోనే నడుస్తోంది. తమను గెలిపిస్తే…. ఊరికేం ఒరగబెడతామో….. గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తున్నారు అభ్యర్థులంతా. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పుష్కలంగా నిధులు తెచ్చేసి మన ఊరిని ఉద్ధరించేస్తామంటూ ఎక్కడా తగ్గకుండా గొప్ప గొప్ప హామీలిచ్చేస్తున్నారు. సరే…. వాళ్ళ మాటల్ని ఊరి జనం ఎంత వరకు నమ్ముతారు, నెత్తిన పెట్టుకుంటారా? లేక ఎత్తి కొడతారా అన్నది వేరే సంగతి. కానీ… ఇక్కడ బీజేపీ ఎంపీల ఇన్వాల్వ్‌మెంట్ మాత్రం ఆసక్తికరంగా మారింది. తమ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో బీజేపీ మద్దతుతో బరిలో ఉన్న వాళ్లని గెలిపిస్తే… కేంద్రం నుంచి పుష్కలంగా నిధులు తెస్తామని, ఎంపీ లాడ్స్ నిధుల్ని కూడా ఆ ఊళ్ళలోనే ఎక్కువగా ఖర్చు చేస్తామని చెప్పేస్తున్నారట. కేవలం మాటలతో సరిపెట్టకుండా పాగా వేస్తే పది లక్షలంటూ కొత్త స్కీమ్ మొదలుపెట్టి మా వాళ్ళని గెలిపించిన ఊరికి ఉన్నఫళంగా పది లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ నిధులిచ్చేస్తామంటూ ఆశ చూపిస్తున్నారు.
తమ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గ్రామ పంచాయతీల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలిచిన ప్రతి చోట ఇలాగే ఉంటుందంటూ ఓటు కొట్టు నిధులు పట్టు అంటూ కొత్త నినాదాన్ని తెర మీదికి తెచ్చారు కమలం ఎంపీలు. మొదట కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థులను ఏక గ్రీవంగా ఎన్నుకుంటే పది లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఏకగ్రీవం అయిన గ్రామాలకు నిధుల ప్రకటన చేసేశారాయన. ఇక మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామానికి పది లక్షలు ఇస్తానని ప్రకటించేశారు. గ్రామాల అభివృద్ధి జరుగుతోందంటే… అది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అన్న సంగతి గుర్తుంచుకోవాలని అంటున్నారామె. ప్రస్తుతం వివిధ స్కీమ్స్ కింద గ్రామాలకు వస్తున్న నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కిందవేనన్నది డీకే అరుణ వాదన. మరో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇదే బాటలో ఉన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటాకు అసలు నిధుల కేటాయింపే ఉండటంలేదని, వాళ్ళతో పెట్టుకుంటే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యం కాదు గనుక బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే కేంద్రం నుంచే నేరుగా పంచాయతీలకు ఆటంకం లేకుండా ఫండ్స్ వస్తాయన్నది ఆయన వాదన. గతంలో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉండేవని, ఇప్పుడు అవి కూడా లేవని, గ్రామాభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం అని చెబుతున్నారట రఘునందన్‌రావు. ఇక మరో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా పది లక్షల ప్రకటన చేశారట. బీజేపీ బలపరచిన అభ్యర్థులను సర్పంచ్‌గా గెలిపించండి, ఎంపీ లాడ్స్ నుంచి గ్రామ అభివృద్ధికి పది లక్షలు తీసుకోండి అంటున్నారాయన. అంతే కాదండోయ్….ప్రతి ఊరికీ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ ట్రక్‌ని పంపిస్తా, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోండి. రోడ్ల గుంతలకు ప్రత్యేక ట్రక్ పెట్టి ప్యాచ్ వర్క్ చేయిస్తానని కూడా ఆఫర్ ఇచ్చారు కొండా. గ్రామాల్లో సమస్యగా మారిన కోతులను పట్టుకునే ట్రక్కులు పెడతానని కూడా బంపర్ ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు విశ్వేశ్వర్‌రెడ్డి. మొత్తం మీద పంచాయతీ పోరులో పూర్తిగా వెనకబడిపోకుండా… కనీసం తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనైనా పార్టీ ఉనికి చాటేందుకు తహతహలాడుతున్నారు బీజేపీ ఎంపీలు.