తెలంగాణ అధికారులకు గవర్నమెంట్ ఆఫీస్‌లు మొహం మొత్తాయా? అందుకే చూపు స్టార్ హోటల్స్ వైపు మళ్ళుతోందా? ఎలాంటి మీటింగ్‌నైనా… నిక్షేపంగా, కంఫర్ట్‌గా పెట్టుకునే వీలున్న గవర్నమెంట్ బిల్డింగ్స్‌ని వదిలేసి చూపులెందుకు ఏడు నక్షత్రాల హోటళ్లవైపు మళ్ళాయి? ఎవరి కంఫర్ట్ కోసం అదంతా చేస్తున్నారు? ఏం… ప్రజాభవన్‌లో కంఫర్ట్ లేదా? ఏ మీటింగ్ కోసం స్టార్ హోటల్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఏంటా కథ?
ఏదైనా సమస్యను సవివరంగా, సావధానంగా చెప్పాలంటే…. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బెస్ట్ మెథడ్. కీలకమైన మీటింగ్స్‌లో దీన్ని వాడుతుంటారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పలు అంశాలపై మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులకు వివరించేందుకు ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు. అటు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ప్రతిపక్ష నాయకులైతే వాళ్ళ ఆఫీసుల్లో.. ప్రభుత్వ పరంగా అయితే…. ప్రజా భవన్ లోనో, సెక్రటేరియట్ లోనో, ఈ రెండూ కాదంటే… ఎంసీఆర్ హెచ్చార్డీలోనో పిపిటి ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్, బనకచర్ల, కేంద్ర బడ్జెట్ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించిన పిపిటిలన్నిటిని ప్రజాభవన్‌లోనే ఇచ్చింది తెలంగాణ సర్కార్. ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఈ ప్రజెంటేషన్స్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే… తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. వచ్చే సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో… తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, వాటాలు, పథకాల అమలు తదితర అంశాలపై ఎంపీలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. శనివారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు అందాల్సిన వాళ్ళకు ఆహ్వానాలు అందేశాయి.
మెట్రోరైలు రెండో దశ పనులు, వరంగల్ ఎయిర్ పోర్టు, త్రిబుల్ ఆర్ వంటి వాటికి సంబంధించి కేంద్రం నుంచి రాష్టానికి రావాల్సిన నిధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే… ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని ప్రయివేటు స్టార్ హోటల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నది ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్. ఇప్పటి వరకు పిపిటిలను ప్రజా భవన్‌లో పెట్టినప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. పైగా అందరికీ కంఫర్ట్‌గానే ఉంది. అలాంటిది ఇప్పుడు మంత్రులు… ఎంపీల సమావేశాన్ని అంత ఖర్చుపెట్టి స్టార్ హోటల్లో ఎందుకు పెట్టారనే చర్చ మొదలైంది రాష్ట్ర రాజకీయవర్గాల్లో. ప్రైవేటు స్టార్ హోటల్లో జరిగే ఎంపీల సమావేశానికి జీఏడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలకు సమాచారం పంపారు. సుమారు 50 నుంచి 60 మంది అతిధులకు హోటల్లో ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో… పొదుపు చర్యలు పాటించావల్సింది పోయి… ఇలా స్టార్ హోటల్స్‌లో అధికారిక సమావేశాలు పెట్టి ప్రజా ధనాన్ని దుబారా చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న విమర్శలు పెరుగుతున్నాయి. పోనీ….ప్రజాభవన్‌లో ఎమన్నా ఇబ్బందులు ఉన్నాయా? లేక సచివాలయం, హెచ్చార్డీ సంస్థల్లో అనుకూలంగా లేదా అంటే… అలాంటి కారణాలేం బయటికి చెప్పడం లేదు. ఏ మీ లేకుండా స్టార్ హోటల్స్‌లో మీటింగ్స్ అంటే… దుబారానేకదా అన్నది ఎక్కువ మంది వాదన. క్రమంగా విమర్శలు పెరిగిపోతున్న క్రమంలో… స్టార్ హోటల్ మీటింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు.