వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా? కొత్త సీట్లలో పోటీ చేసేందుకు గులాబీ నాయకులు అల్రెడీ సిద్ధమైపోతున్నారా? వాళ్లకు అంత గట్టి భరోసా ఇచ్చింది ఎవరు? అధికారికంగా ఎక్కడా ఆ వాసనే లేని టైంలో… కారు పార్టీ నాయకులు అంత కాన్ఫిడెంట్‌గా ఎలా మాట్లాడగలుగుతున్నారు? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? తెలంగాణలో సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. అయితే… ఈసారి ఎలక్షన్స్ ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాల ప్రాతిపదికన జరుగుతాయా లేక పునర్విభజన చట్టంలో చెప్పినట్టు సీట్లు పెరుగుతాయా అన్న చర్చ జరుగుతోంది. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయన్న అంచనాలున్నాయి. అదే గనక నిజమైతే… తెలంగాణలో ఇప్పుడున్న 119 అసెంబ్లీ సీట్లకు బదులు 154 నుంచి 156 వరకు పెరగవచ్చన్నది లెక్క.
వివిధ పార్టీల్లోని ఆశావహులంతా ఇప్పుడు దీని గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయితే… ఎవరెలా లెక్కలేసుకున్నా పెద్ద సీరియస్‌నెస్ ఉండేది కాదుగానీ….ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు కొత్తగా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నోటి వెంట స్థానాల పెంపు మాట వస్తోందట. కేసీఆర్ భరోసా మాటల గురించే ప్రస్తుతం గులాబీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.ఈ విషయంలో ఆయన చాలా క్లారిటీతో ఉన్నారని అంటున్నారు బీఆర్‌ఎస్ నేతలు. రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయింది. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇప్పటినుంచే స్కెచ్ వేసుకుంటున్న సిద్ధం చేస్తున్న కేసీఆర్ నాయకుల్లో స్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారట.
తనను కలిసిన పార్టీ నేతలతో నియోజకవర్గాల పెంపు గురించే ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండండని కూడా కొందరు నాయకులకు చెబుతున్నారట బీఆర్‌ఎస్ అధ్యక్షుడు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పునర్విభజనకు సంబంధించి, అసెంబ్లీ స్థానాల పెంపునకు సంబంధించి క్లారిటీగా ఉందని, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా సీట్ల పెంపును డిక్లేర్ చేసి చట్టం కూడా తెచ్చే అవకాశం ఉందని చెబుతున్నారట కేసీఆర్. అందుకోసం నాయకుల్ని సిద్ధం చేసే క్రమంలో…ఎమ్మెల్యే స్థాయి నేతలు, గతంలో అవకాశం చేజారిన వాళ్లకు భరోసా ఇస్తున్నట్టు సమాచారం. కొందరికైతే ఈసారి ఫలానా సీట్లో పోటీకి సిద్ధంగా ఉండండి అని సూచిస్తున్నారట. మామూలుగా వేరే వాళ్ళు చెబితే ఇంకోలా ఉండేదిగానీ… స్వయంగా పార్టీ సుప్రీం కేసీఆర్ నోటి వెంటే ఆ మాటలు రావడంతో కొందరు బీఆర్‌ఎస్ నాయకులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. కేంద్రంలో ఏం జరుగుతోందో పెద్దాయనకు క్లారిటీ ఉండటం వల్లే అంత కాన్ఫిడెంట్ చెబుతున్నారంటూ వాళ్లలో వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి కొందరైతే…ఛాన్స్ చూసుకుని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ముందే ఓకే అనిపించుకుంటే ఇక తిరుగుండదని భావిస్తున్నారట. గతంలో రిజర్వేషన్లతో పాటు వివిధ కారణాలతో సీటు దక్కని వాళ్లు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటామంటున్నారు.