తెలంగాణలో కమలం కట్టు తప్పుతోందా? క్రమ శిక్షణకు కేరాఫ్ అని చెప్పుకునే పార్టీలో ఇక అది భూతద్దం పెట్టి వెదికినా కనిపించే అవకాశాలు ఉండవా? పార్టీ పెద్దలే అందుకు ఊతం ఇస్తున్నారా? దారిన పెట్టాల్సి వాళ్ళే గాడి తప్పుతున్నారా? రాష్ట్ర పార్టీలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీలో అంతర్గత రచ్చ… అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పెద్ద నేతలు సైతం బహిరంగంగ వ్యాఖ్యలతో పరువు తీస్తున్నారన్న చర్చ జరుగుతోంది కాషాయ వర్గాల్లో. అదీ కూడా సొంత పార్టీ, నాయకుల మీదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో… గీత దాటుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట పార్టీలో. ఏదైనా సమస్య వస్తే… పార్టీ లైన్‌తో సంబంధం లేకుండా… ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు స్పందిస్తున్నారు. ఇక పార్టీ కమిటీల విషయంలో కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయం టాప్ టు బాటమ్ ఉందట. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అయితే… పార్టీలో తన పరిస్థితి ఎలా ఉందో సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్‌బాల్ ఇచ్చిమరీ చెప్పారట.
Mohammed Shami: టీమిండియాలో చోటుపై ఎలాంటి ఆశలూ లేవు.. షమీ ఆసక్తికర వ్యాఖ్యలు!
బీజేపీలో తనతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని ఆయన సింబాలిక్‌గా చెప్పినట్టు ప్రచారం జరగడం కలకలం రేపింది. అది వివాదాస్పదం అయ్యాక నా ఉద్దేశ్యం అది కాదంటూ… వివరణ ఇచ్చారు విశ్వేశ్వర్‌రెడ్డి. ఆ సంగతి ఎలా ఉన్నా… ఆ ఎపిసోడ్‌తో మాత్రం మరోసారి చంద్రశేఖర్ తివారి వ్యవహార శైలిపై పార్టీ వర్గాల్ల చర్చ జరుగుతోంది. ఆయనే సక్కగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయని మాట్లాడుకుంటున్నారట నాయకులు. సమన్వయం చేయాల్సిన తివారీ పెత్తనం చేస్తున్నారంటూ గుసగుసలాడుకుంటున్నారట. నేను చెప్పిందే వేదం… దాన్నే మీరు ఫాలో కావాలన్నట్టు మాట్లాడుతున్నారట తివారీ. అటు పార్టీ నేతలకు, కార్యకర్తలకు గౌరవం కూడా ఇవ్వడం లేదట ఆయన. అందుకే గతంలో పని చేసిన పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో పోల్చుకుని తేడా గురించి మాట్లాడుకుంటున్నారట. ఆయన భాషతో ఒక సమస్య అయితే… ఆటిట్యూడ్‌తో మరో ఇబ్బంది అంటున్నారు బీజేపీ లీడర్స్. సునీల్ బన్సల్ కూడా ఆయన పై గతంలో పరోక్షంగా కామెంట్ చేశారు.
హెడ్ క్వార్టర్‌ను వదిలి టూర్ చేయాలని చురకలు అంటించారు. బాధ్యత ఉండి కూడా చంద్రశేఖర్ తివారీ జిల్లాల్లో పర్యటించరన్న అపవాదు ఉంది. ఆయన్ని కలవడానికి వెళ్తే ఎవరైనా సరే… గంటల తరబడి వెయిట్ చేయాల్సిందేనట. ఎక్కువ టైం ఇవ్వరు, కనీస మర్యాద ఉండదు, ఎవరైనా పొరపాటున ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండా వస్తే సీరియస్ అవుతారని, ఇలాంటి నాయకుడితో వేగడం ఎలాగని సొంత పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళే వచ్చినా… సార్ కోసం గంటలు గంటలు వెయిట్ చేయాల్సిందేనట. దాన్ని భరించలేక ఒకరిద్దరు నేతలు ఇదేం పద్ధతి అంటూ కోపంగా వెళ్ళిపోయినట్టు సమాచారం. పార్టీ కార్యాలయంలో మీటింగ్ ఉన్నా సరే.. అంతా వచ్చి మీటింగ్ స్టార్ట్ అయ్యాక తీరిగ్గా వస్తారట తివారీ.
ఇక తెలంగాణ బీజేపీ కార్యాలయం 3rd ఫ్లోర్ రిస్ట్రిక్టెడ్. అయినా తివారీకి సంబంధించిన వాళ్ళకు మాత్రం ఎప్పుడైనా ఎంట్రీ ఉంటుందని చెప్పుకుంటున్నారు. స్థాయి లేని ఒకరిద్దరికి ప్రాధాన్యత ఇస్తూ అంతా వాళ్ళతో నడిపించే ప్రయత్నం చేస్తున్నారట సంస్థాగత ప్రధాన కార్యదర్శి. కొన్ని మండలాలు రెవెన్యూ పరిధి పరంగా ఒక జిల్లాలో ఉంటే సంస్థాగతంగా మరో జిల్లాలో కలిపారు. ఇబ్బందులు వస్తున్నాయని స్థానిక నేతలు చెప్పినా… పెడ చెవిన పెడుతున్నట్టు తెలిసింది. తివారీకి అసలు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని, అందుకే అలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది పార్టీ వర్గాల్లో. ఈ సమస్యను ఇప్పుడే పరిష్కరించకుంటే… ముందు ముందు మరిన్ని సమస్యలు వస్తాయన్న ఆందోళన పెరుగుతోంది కాషాయ వర్గాల్లో.