సిక్కోలు టీడీపీలో కులాల కుంపట్లు అంటుకుంటున్నాయా? మేటర్ తూర్పు కాపు వర్సెస్ కాళింగలా మారిపోయిందా? వెలమ నేతలు ఎటువైపు మొగ్గితే అటు ప్లస్ అవుతుందా? అసలు జిల్లా పార్టీలో ఏం జరుగుతోంది? ఏ విషయంలో కుల కోణాలు ముందుకు వచ్చాయి? శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పదవికి కొత్త నాయకుడిని నియమించబోతోంది టీడీపీ. దీనికి సంబంధించిన కసరత్తు మొదలైపోయింది. ఆశావహులంతా ఓ రేంజ్‌లో ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కులాల కోణంలో… ఎవరికి వారు పావులు కదుపుతూ…. మాకంటే మాక్కావాలంటూ డిమాండ్ చేస్తున్నారట. ఆ లెక్కన చూసుకుంటే… వెలమ కమ్యూనిటీ తరపున రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఇద్దరు మంత్రులు… బాబాయ్, అబ్బాయ్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే… అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు పార్టీలో కీలకంగా ఉన్నారు. అందుకే జిల్లా అధ్యక్ష పదవిని కూడా వెలమ సామాజికవర్గానికి ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఆ తర్వాత చూస్తే… జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలుగా ఉన్న తూర్పు కాపు , కాళింగ కమ్యూనిటీల వైపు పార్టీ పెద్దలు చూస్తున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసి ఆయా కులాలకు చెందిన కొందరు నాయకులు ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారట. పార్టీలోని తమ గాడ్ ఫాదర్స్ ద్వారా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రేస్‌లో ప్రధానంగా మాజీ జట్పీటిసి, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ అనెపు రామకృష్ణ, జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, ఆమదాలవలస టిడిపి నేత మెదలవలస రమేష్ పేర్లు వినిపిస్తున్నాయి. ఐతే కాళింగ కమ్యూనిటీకి చెందిన మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణ మూర్తి అలియాస్ బాబ్జీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉండరన్న అంశంపై గట్టి ప్రచారం ఉంది. దీంతో… ఆమదాలవలసకు చెందిన అదే సామాజికవర్గం నాయకుడు మెదలవలస రమేష్‌ను తెరపైకి తీసుకువచ్చారట కాళింగ నేతలు. ఉమ్మడి జిల్లాలో భాగమైన ఎచ్చెర్ల నియోజకవర్గం ఇప్పుడు విజయనగరం పార్లమెంట్ పరిధిలోకి రావడంతో ఒకవేళ చౌదరి బాబ్జీ అభ్యర్దిత్వం చెల్లకుంటే టిడిపి సీనియర్ నేత, మాజీ గ్రంధాలయ చైర్మన్, తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన పీరుకట్ల విఠల్ , లేదా ఆనెపు రామకృష్ణకు పదవి దక్కుతుందని భావించారట. ఐతే… బాజ్జీ కాని పక్షంలో రమేష్ కు అవకాశం కల్పించాలని ఆమదాలవలస లాబీ గట్టి ప్రయత్నాల్లో ఉందని తెలియడంతో… ఉత్కంఠ పెరుగుతోంది.
ఈ క్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షరేస్‌లో ఈ మూడు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కాపు వర్సెస్ కాళింగలా మాదిరి మారి రెండు సామాజిక వర్గాలనేతలు పావులు కదుపుతున్నారట. ఇదే సమంలో ఇంకో లెక్క కూడా తెర మీదికి వస్తోంది. వెలమలకు మంత్రి పదవులు, కాళింగులకు ప్రభుత్వ విప్ రూపంలో కేబినెట్ ర్యాంక్ దక్కింది కాబట్టి…జిల్లా అధ్యక్ష పదవిని కాపులకు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆనెపు రామకృష్ణ లేదా పీరుకట్ల విఠల్‌లో ఎవరో ఒకరికి ఇవ్వమన్న విన్నపాలు టీడీపీ అధిష్టానానికి వెళ్తున్నాయట. తాజాగా విశాఖలో పర్యటించిన పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు మంత్రి లోకేష్‌ను కలిసి జల్లాలో అత్యధికంగా ఉన్న కాపులకు ప్రభుత్వ పరంగా , పార్టీ పరంగా న్యాయం చేయాలని అడిగారట కాపు సామాజిక వర్గం నాయకులు. మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావ్ విజయనగరం జిల్లా చీపురుపల్లికి మారిన తరువాత కాపులకు ఎలాంటి అవకాశాలు జిల్లాలో దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారట ఆ సామాజిక వర్గం నేతలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన ఆనెపు రామకృష్ణ లేదా విఠల్‌లో ఎవరినైనా అధ్యక్ష స్దానంలో కూర్చోపెట్టాలనికోరుతున్నారు కాపులు. అయితే… ఆనెపు రామకృష్ణకు సొంత నియెజకవర్గం ఆమదాలవలస నేతలే అడ్డంకిగా మారుతున్నారట. తను అన్నగా భావించే ఎమ్మెల్యే కూన రవికుమార్ బంధు ప్రీతితో వ్యవహరిస్తూ అడ్డు తగులుతున్నారన్నది ఆయన ఆవేదనగా తెలుస్తోంది. ఇతర నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల మద్దతు ఉన్నా , సొంత సెగ్మెంట్ ఆమదాలవలస ఎమ్మెల్యే అంత సుముఖత వ్యక్తం చేయటం లేదన్నది పార్టీలో ఇంటర్నల్ టాక్. రామకృష్ణ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు కావాలంటే… ముందు ఇంట గెలవాల్సి ఉందని అంటున్నారు. కాపు వర్సెస్ కాళింగలా తయారైన ఈ కుల పంచాయితీలో వెలమ నాయకులు కింజరాపు ఫ్యామిలీ ఎటువైపు మెగ్గుతుందన్నది ఆసక్తికరంగా మారింది. త్రీ మెన్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ తో పాటు ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకుని పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు. ఫైనల్‌గా అధిష్టానం ఓటు ఎటువైపు పడుతుందోనన్న ఆసక్తి పెరుగుతోంది సిక్కోలు టీడీపీ వర్గాల్లో.