ఆ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికలో కాంగ్రెస్ పెద్దలు ఎందుకు ఒక నిర్ణయానికి రాలేకపోయారు? పైగా కత్తి మీద సాములా మారిందని ఎందుకు ఫీలవుతున్నారు? జిల్లాకు చెందిన మంత్రి, సీనియర్ లీడర్ ఒక మాట మీదికి వచ్చి ఓకే అన్నా… వాళ్ళు చెప్పిన వ్యక్తికి ఎందుకు పదవి దక్కలేదు? కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ప్రభావం పడిందా? మంత్రి మాట సైతం నడవనంతగా ఏం జరిగింది? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? తెలంగాణలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం…. సంగారెడ్డి పీఠాన్ని పెండింగ్‌లో పెట్టింది. దీంతో… ఎందుకలా చేశారంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ సారి డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఇందుకోసం ఇన్ఛార్జ్‌లను కూడా నియమించింది పార్టీ. జిల్లా అధ్యక్షులుగా ఎవరు ఉంటే బాగుంటుందంటూ… కార్యకర్తల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. మరోవైపు సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి కోసం కీలక నేతలంతా గట్టి ప్రయత్నాలు చేశారు. ఎవరికి వారు గట్టిగా లాబీయింగ్ చేసిన క్రమంలో… చివరకు అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. సంగారెడ్డి డీసీసీ పోస్ట్ కోసం 46 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఈ సారి జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఉజ్వల్ రెడ్డి గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. అందుకు ఆయన జిల్లా ముఖ్య నేతలైన మంత్రి దామోదర్ రాజనర్సింహ, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మద్దతు తీసుకున్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సైతం ఉజ్వల్ రెడ్డికే మద్దతు పలకలడంతో ఇక డీసీసీ ఆయనదేనని అంతా భావించారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న టైంలో కథ మలుపు తిరిగింది. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ వేరే పేర్లను తెరపైకి తీసుకువచ్చారట.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి తన అన్న చంద్రశేఖర్ రెడ్డిని డీసీసీగా చేయాలని కోరారు. అలాగే… ఎంపీ సురేష్ షెట్కార్ తన తమ్ముడు నగేష్ కోసం పట్టుబట్టారట. వాళ్ళిద్దరి అనుచరులు కూడా తమ నాయకులు చెప్పిన పేర్లనే ప్రస్తావించడంతో గందరగోళం పెరిగిందని అంటున్నారు. నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏఐసీసీ ఇంచార్జ్ జరిత ప్రయత్నించినా…ఉపయోగం లేకుండా పోయింది. మంత్రి దామోదర రాజనర్సింహ కూడా అందరిని ఒకే తాటిపైకి తెచ్చి ఉజ్వల్ రెడ్డిని జిల్లా అధ్యక్షున్ని చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందట. దాంతో ఆయన ఎమ్మెల్యే, ఎంపీలపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. జిల్లాకి సంబంధించిన ఇతర నాయకులంతా మంత్రి మాటను కాదనలేదు. కానీ నారాయణఖేడ్ ఎమ్మెల్యే, జహీరాబాద్ ఎంపీలు మాత్రం తమ సోదరులకు పదవి కోసం మంత్రి మాటకు ఒకే చెప్పలేదట. అయితే ఎంపీ సురేష్ షెట్కార్, సంజీవరెడ్డి….. ఉజ్వల్ రెడ్డికి పోస్టు ఇవ్వొద్దని చెప్పడం వెనుక వేరే కారణాలు ఉన్నాయంటున్నారు. జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ఉజ్వల్ గతంలో ఆ ఎంపీ టికెట్ ఆశించారు. దాంతో ఇప్పుడు ఆయన్ని ఎంకరేజ్ చేస్తే…భవిష్యత్తులో తమకి పోటీగా తారవుతాడని లెక్కలేసుకుని ఎమ్మెల్యే, ఎంపీ ముందు చూపుతో మోకాలడ్డినట్టు చెప్పుకుంటున్నారు.
ఉజ్వల్‌కు ఒక వేళ డీసీసీ ఇస్తే రేపు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తమకు పోటీ దారుడు అవుతాడని అందుకే తమ కుటుంబ సభ్యులకే డీసీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. మరో వైపు డీసీసీ ఆశావహులు కూడా ఎక్కడా వెనక్కి తగ్గకపోవడంతో పార్టీ పెద్దలు ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టారన్నది ఇంటర్నల్ టాక్. ఇప్పుడు ఎవరో ఒకరిని ఎంపిక చేస్తే మిగతా ఇద్దరు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు అయిపోయేంత వరకు నిర్మలా జగ్గారెడ్డినే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగించవచ్చని తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్‌లోనైనా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చి జిల్లా అధ్యక్షుడిని ఖరారు చేస్తారా లేక అలాగే నానుస్తారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇక్కడ మరో ప్రచారం కూడా జరుగుతోంది. TGIIC ఛైర్‌పర్సన్, డీసీసీ ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి ఈ సారి దరఖాస్తు చేసుకోలేదు. కానీ ఏకాభిప్రాయం కుదరకపోతే నిర్మలా జగ్గారెడ్డికే మళ్ళీ డీసీసీ పోస్ట్ ఇవ్వడం బెటరన్న అభిప్రాయం కూడా ఉందట. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, మెదక్ జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి… సంగారెడ్డి జిల్లా మాత్రం కత్తి మీద సాములా మారిందట. కొన్నాళ్ల తర్వాతైనా కొత్త సారధి వస్తారో లేక పాత నేతనే కొత్త చూడాల్సి వస్తుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.