ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఆ ఎమ్మెల్యేలు జనం సమస్యల్ని పక్కన పెట్టి సొంత వ్యవహారాల మీదే ఫోకస్ పెంచుతున్నారా? భూములు, ఇతర అడ్డగోలు దందాలతో అనుచరులు చెలరేగిపోతున్నా…. శాసనసభ్యులకు తెలియడం లేదా? లేక తెలిసి కూడా… మనోళ్ళే కదా…. మన పవర్‌ని వాళ్ళు కూడా అనుభవిస్తే, వసూలు చేసుకుంటే తప్పేంటని భావిస్తున్నారా? ఎవరా ఎమ్మెల్యేలు? ఏంటా తేడా వ్యవహారాలు? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారాలపై తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన రెండేళ్ళలో నియోజకవర్గాల అభివృద్ధి కోసం చేసిందేం లేకపోగా… వేరే వ్యవహారాలు పెరిగిపోతున్నాయన్న టాక్ బలంగా నడుస్తోంది నియోజకవర్గాల్లో. తాండూర్ నియోజకవర్గాన్నే తీసుకుంటే… ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండేళ్ళ నుంచి పవర్‌లో ఉన్నా… నియోజకవర్గ అభివృద్ధికి చేసింది అంతంత మాత్రంగానే ఉందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు నిత్యం సీఎం ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప… నియోజకవర్గానికి కావాల్సిన పనులు మంజూరు చేయించుకోవడంలో చొరవ చూపడం లేదంటున్నారు. ఎమ్మెల్యే కుటుంబానికి రియల్ ఎస్టేట్, కన్వెన్షన్లతో పాటు మద్యం వ్యాపారం కూడా ఉంది.
సార్‌కి వాటి మీదున్నంత శ్రద్ధ గెలిపించిన ప్రజల సమస్యలు తీర్చడం మీద ఉండటం లేదన్నది లోకల్ టాక్. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన రియల్ వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. తాండూర్ నియోజకవర్గంలో సహజ నిక్షేపాలతో పాటు.. కాగ్న వాగులో మంచి ఇసుక లభ్యం అవుతుంది. దాంతో ఎమ్మెల్యే పేరు చెప్పుకొని అనుచరులు అక్రమంగా ఇసుక, సుద్ద మైనింగ్ చేస్తున్నారట. విషయం తెలిసి కూడా మనోహర్‌రెడ్డి నియంత్రించకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. అలాగే… ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కొంతమంది మైనింగ్ చెక్‌పోస్ట్‌ల దగ్గర భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ దందాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇక వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి.
గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా చేసి మరోసారి ఓడిపోయి ఈసారి సెకండ్ టైం అసెంబ్లీ మెట్లెక్కారాయన. రామ్మోహన్‌రెడ్డికి విద్యా వ్యాపారం ఉండగా…..ఆయన పేరు చెప్పి నియోజకవర్గంలో అనుచరులు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. గుట్టలను మాయం చేస్తూ… అడ్డసుడిగా మట్టి వ్యాపారం చేస్తున్నారట. ఇక ఫిల్టర్ ఇసుక దందా గురించి అయితే… చెప్పేపనేలేదు. మూడుపువ్వలు, ఆరుకాయల్లా రాత్రింబవళ్లు కొనసాగుతోందట. ఎమ్మెల్యే పలుకుబడి కారణంగా అధికారులు ఎవరూ ఈ అక్రమ వ్యాపారాలవైపు చూసే సాహసం చేయడం లేదన్నది లోకల్ టాక్. ఎమ్మెల్యే అనుచరులు కొందరైతే…. ఏకంగా ఎమ్మార్వో ఆఫీస్‌నే తమ సెటిల్మెంట్స్‌కు అడ్డాగా మార్చుకున్నారని… నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే….తనను విమర్శిస్తే కేసులు పెట్టి జైలుకు పంపడమే లక్ష్యంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం చకోరపక్షిలా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో తానే సీనియర్ అని… కాంగ్రెస్ అధిస్థానం తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీకే నష్టమని హెచ్చరిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ. దాంతో… ఇక్కడ కొత్తగా వెలిసే వెంచర్ల నుంచి ఎమ్మెల్యే మనుషులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
అది కూడా… పర్సంటేజ్‌ల లెక్కన తీసుకుంటారని, ఎమ్మెల్యేకి తెలియకుండానే అనుచరులు ఆ స్థాయి పనులు చేస్తారా అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. అయితే… ఆయన ఇలాంటి పనుల్ని ప్రోత్సహిస్తారా అన్నది ఇంకొంత మంది అనుమానం. కారణం ఏదైనా, ఆ పని ఎవరు చేసినా… అంతిమంగా ఆరోపణలు మాత్రం ఎమ్మెల్యేకే తగులుతున్నాయని, ఆయన ఇంకా బద్నాం అవకుండా ఉండాలంటే అనుచరుల్ని కంట్రోల్ చేసుకోవాలన్న సూచనలు సైతం వినిపిస్తున్నాయి ఇబ్రహీంపట్నంలో. ఎమ్మెల్యే పేరుచెప్పి దౌర్జన్యాలు కూడా పెరిగిపోతున్నాయని అంటున్నారు విపక్ష నాయకులు. ఓవరాల్‌గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారశైలి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గాల్లో.