పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో క్యాస్ట్ ఫీలింగ్ బాగా పెరిగిపోయిందా? లోకల్‌గా పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలన్నిటినీ పర్యవేక్షించే వాళ్ళంతా సొంత సామాజికవర్గానికి చెందిన వాళ్ళేనా? ఆ విషయంలో పిఠాపురానికి చెందిన మిగతా సామాజికవర్గాల మనోభావాలు ఎలా ఉన్నాయి? సొంత పార్టీవాళ్ళే తప్పుపట్టే పరిస్థితి వచ్చిందా? అక్కడేం జరుగుతోందో అసలు పవన్‌కు తెలుస్తోందా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు కాస్త తేడాగా కనిపిస్తున్నాయన్న చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ప్రత్యేకించి ఒక కులాన్నే నెత్తికెత్తుకుని మిగతా వాళ్ళని విస్మరిస్తున్నారా అంటూ రకరకాల విశ్లేషణలు బయలుదేరుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ లేనంత భారీ మెజారిటీతో గెలిచారు పవన్. కానీ… ఆయన రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండటంతో… నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. గతంలో ఇక్కడ పార్టీ కో ఆర్డినేటర్‌గా మర్రెడ్డి శ్రీనివాస్ ఉండేవారు. దాదాపు ఏడాదికి పైగానే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలోనే నడిచాయి. అయితే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కి, మర్రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చింది. ఇద్దరూ కలిసి ఒకే వేదిక పంచుకోవడానికి కూడా ఇష్టపడ్డం లేదు. దాంతో అందర్నీ సమన్వయ పరుచుకుంటూ…నియోజకవర్గ కార్యక్రమాల్లో లోటు జరక్కుండా చూసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది.
అందులో మర్రెడ్డితో పాటు, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ ఫైవ్ మెన్ కమిటీలో ఉన్నారు. ఆ ప్రకారమే…కొద్ది రోజులు అంతా సవ్యంగా జరిగింది. తర్వాత నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులు మేరకు మర్రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టేశారు. గతంలో లాగా ఆయన్ని అనపర్తి పార్టీ బాధ్యతలకు పరిమితం చేశారు. పిఠాపురంలో పార్టీ కార్యక్రమాల కోసం ఇల్లు ఇచ్చిన ఓదురి కిషోర్‌కు మర్రెడ్డి శ్రీనివాస్ స్థానంలో ఆకాశం ఇచ్చారు. దీని చుట్టూనే ఇప్పుడు సరికొత్త ఊహాగానాలు బయలుదేరాయి. గతంలో ఉన్న కమిటీగానీ, ఆ తర్వాత మార్పులు చేశాకగానీ… అంతా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప… మిగతా ఏ కులాన్ని పట్టించుకోలేదన్న చర్చలు మొదలయ్యాయి. కమిటీలో ఐదుగురు సభ్యులున్నందున కనీసం ఒకరో, ఇద్దరో వేరే కులాల నాయకులకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పిఠాపురంలో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. నూటికి నూరు శాతం డామినేషన్ వాళ్ళదేగానీ…. కేవలం వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తే పవన్‌కు అంత మెజార్టీ వచ్చిందా? నియోజకవర్గంలో వేరే కులాల వాళ్ళు అవసరం లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయట మిగతా సామాజికవర్గాల నుంచి.
పిఠాపురంలో కాపుల తర్వాత బీసీ, ఎస్సీ ఓటర్లు కీలకం. అలాంటప్పుడు లెక్క ఎక్కడ తప్పింది? ఎందుకు ఆయా కులాలను విస్మరించారంటూ మాట్లాడుకుంటున్నారు. పార్టీ అధినేత, పైగా అన్ని కులాల్లో ఫ్యాన్ బేస్ ఉన్న పవన్‌లాంటి వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న చోట సామాజిక సమీకరణల బ్యాలెన్స్ తప్పితే ఎలాగని అడుగుతున్నారు. ప్రస్తుతం పైకి అంతా బాగానే ఉన్నప్పటికీ…పదవులకు మేం పనికిరామా అంటూ మిగతా కులాల నాయకులు గుసగుసలాడుకుంటున్నారట. సింగిల్ కోఆర్డినేటర్ ఉన్నప్పుడు అందరికీ అవకాశం ఇవ్వలేరు కాబట్టి అర్ధం చేసుకుంటాం. కానీ… ఫైవ్ మ్యాన్ కమిటీని వేసినప్పుడు కూడా వందకు వంద శాతం ఒకే కులానికి ప్రాధాన్యం ఇవ్వడమంటే… ఇది పక్షపాతం కాదా? ఈ వ్యవహారమంతా పవన్ దృష్టిలో ఉండే జరుగుతోందా? లేదా అంటూ… రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు డిసిసిబి చైర్మన్‌గా, పెద్దాపురం కోఆర్డినేటర్‌గా ఉన్నారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్ కి నియోజకవర్గం కోసం సమయం కేటాయించే అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళందర్నీ ఫైవ్‌మెన్ కమిటీలో పెట్టి ఇతరుల్ని విస్మరించడమంటే… అధినేత కూడా ఆలోచించాలి కదా అని అంటున్నారట పిఠాపురం జనసేన కాపుయేతర నాయకులు. ఉప ముఖ్యమంత్రి హోదాలో.. అన్ని వర్గాలను ఒకే దృష్టితో చూడాల్సిన పవన్‌కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో సమన్వయ బాధ్యతల్ని ఒకే కులానికి అప్పగించడం ఎంత వరకు కరెక్ట్ అని సొంత నేతలే అడుగుతున్నారు.