ఆ ఎమ్మెల్యేది గిలిచిందాకా ఒక తీరు, కుర్చీలో కూర్చున్నాక మరో రీతి అన్నట్టుగా ఉందా? నాడు అష్టకష్టాలు పడి గెలిపించినవాళ్ళే నేడు దూరం అవుతున్నారా? ఎమ్మెల్యే ఆయనా? ఆయన కూతురా అన్నది తెలియకుండా పోయిందా? ఏ నియోజకవర్గంలో జరుగుతోందా వ్యవహారం? ఎవరా శాసనసభ్యుడు? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో నరసన్నపేట నియోజకవర్గం రూటే సపరేట్. ధర్మాన బ్రదర్స్‌కు కంచుకోట ఇది. అలాంటి కోటను గత ఎన్నికల్లో బద్దలు కొట్టారు బగ్గు రమణమూర్తి. టీడీపీ కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదగడం వరకు బాగానే ఉన్నా… ఆ తర్వాతే అసలు సీన్ మొదలైందట. ప్రస్తుతం నరసన్నపేట టీడీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే రమణమూర్తి కుటుంబ సభ్యుల అతిజోక్యాన్ని పార్టీలోని ఓవర్గం వ్యతిరేకిస్తోందట. అసలు కొందరికైతే… ఎమ్మెల్యే రమణమూర్తా లేక ఆయన కుమార్తెనా అన్న అనుమానం కలుగుతోందంటున్నారు.
పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో బగ్గు కుటుంబ సభ్యలు అతిగా ఇన్వాల్వ్ పోతూ… రచ్చ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. నరసన్నపేటలో డీలాపడ్డ పార్టీని సమష్టి కృషితో విజయపథం వైపు నడిపించామని, తీరా ఇప్పడు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఒంటెద్దు పోకడలతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని తమ్ముళ్ళు భయపడుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకునే నాయకుడిగా రమణమూర్తికి గుర్తింపు ఉంది. ఆయన రాజకీయ ఎదుగుదలకు అదే కారణం అంటారు.
కానీ… తాజా పరిణామాలు మాత్రం ఆ శైలికి భిన్నంగా జరుగుతున్నాయన్నది లోకల్ టాక్. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యవహారాలతో ఎమ్మెల్యే కుర్చీ కిందికే నీళ్ళు వస్తున్నట్టు సమాచారం. మాజీ డిప్యూటీ సి.ఎం కృష్ణదాసు స్పీడుకు బ్రేకులు వేయడానికి సహకరించిన కీలక నేతలను కూడా ఇప్పుడు రమణమూర్తి పక్కన పెడుతున్నారట. వాళ్ళకు బదులుగా… ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారిని ప్రోత్సహిస్తున్నారని, అదే పాత తెలుగుదేశం నాయకులకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. తెలుగు యువత ముఖ్య నాయకులకు, ఎమ్మెల్యే వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. యువత జిల్లా అధ్యక్షుడిని అవమానించేలా ఎమ్మెల్యే కుమార్తె వ్యవహరించడంతో దూరం పెరిగినట్టు సమాచారం.
ఈ నియోజకవర్గంలో కింజరాపు ఫ్యామిలీకి కూడా పట్టుంది. మొదట్లో రమణమూర్తికి సహకరించిన ఆ వర్గం మెల్లిగా పక్కకు జరుగుతోందట. ఈ వ్యవహారాలతో నియోజకవర్గంలోని కేడర్ కూడా రెండుగా చీలిపోతోందని అంటున్నారు. నరసన్నపేట నియోజకవర్గం ఇంటర్నల్ వార్ ఇక్కడ పార్టీని ఎటువైపు తీసుకువెళ్తుందోనన్న కంగారు కేడర్‌లో ఉంది. కింజరాపు ప్యామిలీకి పట్టున్న నరసన్నపేట నుంచి గత ఎన్నికల్లో బగ్గును కాకుండా వేరొకరిని బరిలో దింపాలని భావించారట. చివరి నిమిషంలో అధినేత సీనియర్ అయిన రమణమూర్తికి ఓటేయడంతో క్లారిటీ వచ్చిన గెలిచినా…ఇప్పుడు ఆయన నిలబెట్టుకోలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు.