డీసీసీ ప్రకటనతో ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజుకుందా..? ప్రత్యర్థి వర్గానికి పదవి దక్కకుండా ఆ మాజీ ఎమ్మెల్యే వేసిన స్కెచ్ వర్కౌట్ అవలేదా? ప్రతిపక్షం బలంగా ఉన్న జిల్లాలో అధికార పార్టీ గ్రూపు గోల ఏ మలుపు తిరగబోతోంది? ఎక్కడ జరుగుతోందా పంచాయితీ? సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రమే. కానీ… గ్రూప్ వార్ మాత్రం వీధిన పడి తన్నుకుంటూ…..పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే స్థాయిలో ఉంది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వర్గాలుగా పార్టీ విడిపోయింది. నర్సారెడ్డి మీద సొంత పార్టీ నేతలే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు పెట్టారు. ఈ గ్రూపు తగదాలు తీవ్ర స్థాయికి చేరి పిడిగుద్దుల వరకూ వెళ్లింది. డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డే స్వయంగా దాడి చేశారని ఆరోపించారు మైనంపల్లి వర్గీయులు. దాంతో నర్సారెడ్డి మీద ఏకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బుక్ అయ్యాయి. అప్పట్లో పంచాయతీ పిసిసికి చేరింది. దానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ పలుమార్లు నర్సారెడ్డితో భేటీ కూడా అయ్యింది. ఆ వ్యవహారాన్ని కాసేపు అలా ఉంచితే… ఈ సారి డిసిసి అధ్యక్ష పదవి కోసం ఏకంగా 128 దరఖాస్తులు వచ్చాయి. అయినా… పోటీ మాత్రం నర్సారెడ్డి, మైనంపల్లి వర్గాల మధ్యనే ఉంది. ఎవరికి వారు తమ వాళ్ళకు డీసీసీ పోస్ట్ ఇప్పించేందుకు పోటీ పడ్డారు. ఎట్టి పరిస్థితిల్లోనూ ఈ సారి డిసిసి పీఠం నర్సారెడ్డికి దక్కొద్దని మైనంపల్లి వర్గం పావులు కదిపినట్లు ప్రచారం జరిగింది. అయినాసరే… ఫైనల్‌గా నర్సారెడ్డి కూతురు ఆకాంక్షరెడ్డికే పదవి దక్కింది. యువ నాయకురాలు కావడం ఆమెకు ప్లస్ అయిందని చెప్పుకుంటున్నారు.
తాము ఎంతగా వ్యతిరేకించినా… ప్రత్యర్థి వర్గానికి జిల్లా అధ్యక్ష పదవి ఎలా దక్కిందంటూ…డైలమాలో పడిందట మైనంపల్లి గ్రూప్. ఆ విషయంలో పెద్ద లాబీయింగే జరిగినట్టు లెక్కలేసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో నర్సారెడ్డి మీద అసంతృప్తిగా ఉన్న నాయకులు హైదరాబాద్‌లో రహస్యంగా సమావేశం అయ్యారు. డీసీసీ పోస్ట్ నర్సారెడ్డి కూతురికి ఇవ్వొద్దని, మరొకరి పేరు పరిశీలించాలన్నది వాళ్ళ డిమాండ్. సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ, గజ్వేల్ కాంగ్రెస్ నేత బండారు శ్రీకాంత్, కాంగ్రెస్ జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షుడు విజయ్ తో పాటు మరికొంతమంది నాయకులు రహస్యంగా మీట్ అయ్యారు. మొదట ఈ అంశంపై పీసీసీకి ఫిర్యాదు చేయాలనుకున్నా… మనసు మార్చుకుని జిల్లా నుంచి భారీగా జనసమీకరణతో గాంధీ భవన్‌కి వెళ్ళే ప్లాన్‌లో ఉందట నర్సారెడ్డి వ్యతిరేక వర్గం. అందుకు ఓ వాట్సాప్ గ్రూపును కూడా క్రియేట్ చేసి దానికి ఆపరేషన్ ఏ అని పేరు పెట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా ఏర్పడినప్పటి నుంచి నర్సారెడ్డే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కూతురికి అవకాశం దక్కింది. మరి కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అసలే జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈ గ్రూపు గొడవలు క్యాడర్ ని కలవరపెడుతున్నాయట. ప్రతిపక్ష BRS బలంగా ఉన్న జిల్లాలో సొంత పార్టీ వాళ్ళే ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు యత్నిస్తే తీవ్ర నష్టం తప్పదన్నది కేడర్ టెన్షన్. కాంగ్రెస్ హైకమాండ్ వెంటనే ఇరు వర్గాలకు సర్దిచెప్పి సయోధ్య కుదర్చకుంటే… జిల్లాలో గట్టి దెబ్బే తగులుతుందన్న భయం వ్యక్తం అవుతోంది జిల్లా పార్టీ వర్గాల్లో. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో హైటెన్షన్ మొదలుకాకముందే హైకమాండ్ హ్యాపీ ఎండ్ ఇస్తుందా..? లేదా చూడాలి మరి.