Off The Record: అక్కడ కాంగ్రెస్ పార్టీలో అగ్గి ఓ రేంజ్‌లో అంటుకుందా? మంత్రికి వ్యతిరేకంగా.. ఏకంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు మొత్తం ఒక్కటయ్యారా? ఊరందరిదీ ఒక దారి అయితే.. ఆ మంత్రి దంపతులది మాత్రం మరో దారిగా మారిందా? ఒకరు మొదలుపెడితే.. ఇంకొకరు కొనసాగిస్తున్న ఆ రచ్చ ఏంటి? ఏ జిల్లాలో జరుగుతోంది?
Read Also: Mohan Babu: ఈ “కన్నప్ప” సినిమాలో అందరూ హీరోలే
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వార్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. ఇది ఎక్కడో మొదలైంది గానీ.. చివరికి ఎట్నుంటి ఎటు వెళ్తోందన్నది మాత్రం అంతుచిక్కడం లేదంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం అయితే.. వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధుల యుద్ధం హస్తిన దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు.. జిల్లా ఎమ్మెల్యేలు. ఈ ఆధిపత్య పోరు చాలా పెద్ద రచ్చకే దారితీస్తోందన్న అంచనాలు పెరుగుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒక్కటై మంత్రి మీదకి కత్తి ఎత్తడాన్ని అంత తేలిగ్గా తీసి పారేయలేమంటున్నాయి రాజకీయ వర్గాలు. మంత్రి తమను కలుపుకుని పోవడం లేదన్న అసంతృప్తి ఇన్నాళ్ళు ఎమ్మెల్యేలకు ఉండేది. అదలా ఉండగానే.. మంత్రి భర్త కొండా మురళి చేసిన తాజా వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఒకరిద్దరు నేతల్ని ఉద్దేశించి కామెంట్స్ చేశారు మురళి. పార్టీ మారినప్పుడు పదవులకు రాజీనామాలు చేసి రావాలంటూ.. మురళి అన్న ఆ మాటలే ఎమ్మెల్యేలందర్నీ ఏకం చేసినట్టు చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా.. ఎవరి దారి వారిదే అన్నట్టున్నగా ఉన్న శాసనసభ్యులు.. కొండా మురళి వ్యాఖ్యలతో ఒక్క తాటి మీదికి వచ్చారట. మంత్రి భర్త మాటలతోనే మండిపోతున్న టైంలో.. వరంగల్ భద్రకాళి టెంపుల్ బోనాల వ్యవహారంపై నేరుగా మంత్రే మాట్లాడిన మాటలతో.. ఏకంగా పెట్రోల్ పోసినట్టయిందట. కొండా మురళి వ్యాఖ్యలతో.. కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి అంతా ఇప్పుడు ఏకమైనట్టు తెలిసింది. కొండా ఫ్యామిలీకి రేవూరి ప్రకాష్‌రెడ్డితో కూడా కయ్యం మొదలైంది. ఇప్పుడు వరంగల్ సిటీలోని ఎమ్మెల్యేలతో పాటు.. కడియం శ్రీహరి లాంటి వాళ్ళంతా కలిసి కొండా దంపతులపై కారాలు, మిరియాలు నూరుతున్నట్టు తెలుస్తోంది.
Read Also: Off The Record: స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ డైలమా.. కారు ప్లాన్ తేడా కొట్టిందా?
ఇక, త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని, ఢిల్లీ వెళ్ళి అధిష్టానం పెద్దలకు మంత్రి మీద ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. అటు కొండా మురళి చేసిన వ్యాఖ్యల మీద పార్టీ పరిశీలకులను నియమించినట్టు ప్రకటించారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. ఆ లొల్లి అలా ఉండగానే… మీడియా చిట్ చాట్‌లో సురేఖ మరింత పెట్రోల్ పోశారు. భద్రకాళి ఆలయ బోనాల విషయంలో ఎవరెవరో తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని, రాజకీయాలు చేసే ప్రయత్నంలో ఉన్నారన్న అర్ధం వచ్చేలా మంత్రి అన్న మాటలతో ఫైర్ రెట్టింపైంది. దీంతో ఒకప్పటి… పాలిటిక్స్ ఇప్పుడు చేయాలని అనుకుంటే పరిస్థితులు కలిసి వస్తాయా..? అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఒకటి…రెండు వ్యవహారాల్లో అధిష్టానం దగ్గర మైనస్‌లో ఉన్న కొండా.. ఏరికోరి ఎందుకు సమస్యలు కొని తెచ్చుకుంటున్నారన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో…. కొండా లొల్లి ఎటు దారితీస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఇలాంటి ఎపిసోడ్స్‌లో పార్టీ అధిష్టానం కూడా చూసీ చూడనట్టు ఉంటే.. అందరికీ నష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సమస్యకు ఇంతటితో ఫుల్‌స్టాప్ పడుతుందా? లేక ఎపిసోడ్ కొనసాగుతుందా అన్నది చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు.
