NTV Telugu Site icon

Off The Record: మంత్రికే షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఎందుకంటే..?

Nallamilli

Nallamilli

Off The Record: ఆ మంత్రి ఎమ్మెల్యే ఇగోని టచ్‌ చేశారా? అందుకే…. మంత్రి అయితే ఏంది? ఎవడైతే నాకేంటి…? నా రాజకీయం నాది, నా అవసరాలు నావంటూ…. ఓపెన్‌గానే ఫైరై పోయారా? ఎమ్మెల్యే ఇచ్చిన షాక్‌తో అవాక్కయిన మంత్రి తేరుకోవడానికి కాస్త టైం పట్టిందా? వ్యవహారం అంతదూరం వెళ్తుందని ఊహించలేకపోయిన ఆ మంత్రి ఎవరు? ఆయనకు ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే ఎవరు?.. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. ఆన్‌ రికార్డ్‌ బీజేపీ ఎమ్మెల్యే. అనధికారకంగా మాత్రం టీడీపీ శాసనసభ్యుడు. అలా ఎందుకంటే.. అది వేరేలెక్క. అసెంబ్లీ ఎన్నికల టైంలో జరిగిన వ్యవహారం…. అదో డిఫరెంట్‌ స్టోరీ. కానీ… ఇప్పుడు మేటర్‌ అదికాదు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి… రాష్ట్ర మంత్రి నారాయణ మీద ఫైర్‌ ఫైర్స్‌ ద ఫైర్‌ అంటున్నారట. ఇంకా… నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే…. నువ్వేంది? నీ కతేంది అన్నట్టుగా మంత్రి విషయంలో మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. సొంత కూటమి మంత్రి మీద ఎమ్మెల్యేకి ఎందుకంత కోపం వచ్చింది? భారీ డైలాగ్స్‌ ఎందుకు పేలుతున్నాయని అంటే… బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ గట్టిగానే ఉందన్నది లోకల్‌ వాయిస్‌. తాజాగా కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చారు నారాయణ. మున్సిపల్‌ శాఖ మంత్రి, పైగా జిల్లా ఇన్ఛార్జ్‌ మినిస్టర్‌ కూడా అవడంతో… తన టూర్‌లో భాగంగా… మున్సిపాలిటీల నుంచి సేకరించిన చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రతిపాదనలపై చర్చించారాయన. ఈ క్రమంలోనే.. అనపర్తి నియోజకవర్గంలోని బలభద్రపురం, కాపవరం గ్రామాలలో చెత్త నుంచి సంపద, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం స్థలాలను పరిశీలించారు. అక్కడే ఎమ్మెల్యేకు మండిపోయిందట.

Read Also: Off The Record: రోజాను టీడీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారా..?

అయితే, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల నుంచి ఎక్కడెక్కడి చెత్త తీసుకువచ్చి నా నియోజకవర్గంలో డంప్‌ చేయడం ఏంటంటూ గట్టిగానే రియాక్ట్ అయ్యారు. అదో కారణం అయితే… అంతకు మించిన రీజన్‌ ఇంకోటి ఉందని అంటున్నారు ఎమ్మెల్యే సన్నిహితులు. మంత్రి అనపర్తి నియోజకవర్గంలో పర్యటించాలనుకున్నప్పుడు లోకల్ ఎమ్మెల్యేగా… రామకృష్ణారెడ్డికి సమాచారం ఇవ్వలేదట. సరిగ్గా ఈ పాయింట్‌ మీదే ఎమ్మెల్యేకు టాప్‌ టు బాటమ్‌ ఫైరైపోయిందని అంటున్నారు. నేనంటే మరీ అంత లెక్కలేనితనమా? ఆయనకు ఎలా కనబడుతున్నాను అసలు? నేనొకడిని ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తుందా ? లేక అనపర్తికి అసలు ఎమ్మెల్యే లేడని అనుకుంటున్నారా? ఎవరికి నచ్చినట్లు వాళ్లు వచ్చి వెళితే వ్యవహారం వేరే విధంగా ఉంటుందని సన్నిహితుల దగ్గర ఓ రేంజ్‌లో మండిపడ్డట్టు తెలిసింది. అసలు కలెక్టర్‌ ఏం చేస్తున్నారంటూ… ఓపెన్ గానే బ్లాస్ట్ అయిపోయారు ఎమ్మెల్యే. ఇంత జరిగింది కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ నా నియోజకవర్గంలో చెత్త డంపింగ్‌ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తే లేదంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. దీనికోసం అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్లి పోరాడతానని చెప్పేశారట. ఈ విధంగా ఏర్పాటు చేస్తే ఊళ్ళకు ఊళ్ళే పోతాయని, లోకల్‌గా మా ఇబ్బందులు మాకు ఉంటాయి… ఆ నొప్పి మీకేం తెలుసునని అంటున్నారట నల్లమిల్లి. గత ప్రభుత్వంలో ఇదే ప్రాంతంలో గ్రాసిం ఇండస్ట్రీ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆ పరిశ్రమతో పరిసర గ్రామాలలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని అంటూ… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేశారు రామకృష్ణారెడ్డి.

Read Also: TTD: టీటీడీ ద‌ర్శనాలపై ఏపీ సీఎంకి మంత్రి కొండా సురేఖ లేఖ

ఇక, ఇప్పుడు అదే ప్రాంతంలో చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తే… తాను డిఫెన్స్ లో పడతానని ముందే అలర్ట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రతిపక్షం ఆందోళనలు చేస్తుందని ఉప్పు అందడంతో అధికారపక్షంలో ఉన్నప్పటికీ ముందుగా తానే ఓపెన్ అయిపోయారట. దాంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఉంటుందని లెక్కలేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యే రియాక్షన్‌తో మంత్రి నారాయణ తేరుకోవడానికి సమయం పట్టిందట. ఏమైనా ఉంటే పర్సనల్ గా చెప్పొచ్చు కదా అని ఆయన్ని ఉద్దేశించి కామెంట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. అందుకు నల్లమిల్లి సైతం… ఏదన్నా ఉంటే ముందు సమాచారం అడిగి ఫీల్డ్‌కి వెళ్లాల్సిందని రీ సౌండ్‌లో రిప్లై ఇచ్చారట.. లోకల్ గా ఉన్న వారికి కనీసం ప్రయారిటీ ఇవ్వకపోతే పరిణామాలు ఇలాగే ఉంటాయని అన్నట్టు తెలిసింది. పనిలో పనిగా రెండు జిల్లాల కలెక్టర్లు ,అధికారులని డైరెక్ట్ గా అటాక్ చేశారటఎమ్మెల్యే. మీరు ఉద్యోగాలు చేస్తారు వెళతారు. మేము ఈ ప్రాంతంలో ఫుల్ టైం పాలిటిక్స్ చేయాలి. ఇష్టం వచ్చినట్లు వ్యవహారాలు చేస్తానంటే ఊరుకునే ప్రసక్తి లేదని క్లారిటీ ఇచ్చేశారట. అయితే…. ఇంత రాద్ధాంతం అవుతుందని మంత్రి కూడా ఊహించలేదని అంటున్నారు. అందుకే ఆ యవ్వారాన్ని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టండని క్లారిటీ ఇచ్చేశారట. మొత్తానికి తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా మంత్రి ఫీల్డ్ విజిట్ చేయడంతో… ఎమ్మెల్యే కి చిర్రెత్తుకొచ్చింది… చెత్త విషయంలో ఇన్వాల్వ్ కావద్దని మంత్రి నారాయణకి క్లారిటీ ఇచ్చేశారు.. దాంతో కూటమిలో కాంపిటీషన్‌గా మారిందట వ్యవహారం. ఈ చెత్త నుంచి సంపద వ్యవహారం ఎట్నుంచి ఎటు పోతుందో చూడాలి మరి.