Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడ ఇద్దరు మంత్రుల అనుచరులు ఓ భూ బాగోతంలో ఎంటరయ్యారా? ఒకరు కబ్జాకు ప్రయత్నిస్తే… మరొకరు కాపాడే ప్రయత్నం చేశారా? మేటర్ బాగా ముదిరి కాంగ్రెస్ పార్టీలోనే రచ్చకు దారి తీసే ప్రమాదం ఉందా? ప్రభుత్వ భూమి విషయంలో అంత జరుగుతుంటే… రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోంది? ఎక్కడ జరుగుతోందా తంతు? ఏంటా కబ్జా కహానీ? ఖమ్మం నగరానికి ఆనుకుని ఉన్న, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో భాగమైన దాదాపు నాలుగు కోట్ల విలువైన భూమి కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసింది. ఇందులో ఇద్దరు మంత్రుల అనుచరులు ఇన్వాల్వ్ అవడంతో మేటర్ మాంఛి రసవత్తరంగా మారుతోంది. కబ్జా చేయాలని ఓ వర్గం, కాపాడాలని మరో వర్గం ప్రయత్నిస్తున్నాయన్న ప్రచారం ఇంకా ఆసక్తి రేపుతోంది. ఇక్కడ 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో కొందరు ఇళ్లు కట్టుకోలేదు. దాంతో అవి తిరిగి ప్రభుత్వ పరం అయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో ఈ భూముల మీద కొంత మంది నేతల కన్ను పడింది. ఆ సంగతి గ్రహించిన అధికారులు విచారణ జరిపి ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టి ఫెన్సింగ్ వేశారు. కానీ…ఇప్పుడు మళ్లీ అదే ల్యాండ్ మీద కబ్జా గద్దల కన్ను పడిందట. అనుకున్నదే తడవుగా కొందరు రంగంలోకి వాళ్ళ స్టైల్లో పని మొదలుపెట్టారు. నిజమైన లబ్దిదారులు ఎవరో తెలియదుగానీ… ఆ పేరుతో కొందర్ని తీసుకువచ్చి….వాళ్ళని ముందుపెట్టి జేసీబీలతో చదును చేయడం వివాదాస్పదమైంది. అదే ఏరియాకు చెందిన తాజా మాజీ కార్పొరేటర్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అటు జేసీబీని తీసుకు వచ్చిన వ్యక్తి రాష్ట్ర మంత్రి ఒకరికి ముఖ్య అనుచరుడు కావడం, అలాగే అడ్డుకున్న తాజా మాజీ కార్పొరేటర్ మరో మంత్రికి కావాల్సిన వ్యక్తి అవడంతో… ఈ వ్యవహారం మామూలుకంటే ఇంకొంచెం ఎక్కువ ఇంట్రస్టింగ్‌గా మారింది. ఇలా… భూమి విషయంలో అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకోవడంతో… పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడ జోక్యం చేసుకుంటే… ఎట్నుంచి తంటా వస్తుందోనన్న అనుమానంతో జస్ట్ సినిమా చూస్తూ ఉండిపోయారట. ఖమ్మం 8వ డివిజన్ పరిధిలోని గోపాలపురం, ఎల్బీనగర్ సాగర్ ప్రధాన కాల్వ సమీపంలో ఉన్న భూమికి సంబంధించిన వివాదం ఇది. వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని ఈ భూముల్లో 2004లోనే రెండు వైపులా కలిపి దాదాపు రెండు వేల మంది పేదలకు పట్టాలు ఇచ్చారు. చాలామంది ఇళ్ళు కట్టుకున్నారు.
మొత్తం నాలుగు సర్వే నంబర్లలో పెద్ద కాలనీయే ఏర్పడింది. అయితే… అప్పుడు పట్టాలు పొందిన వారిలో 40 మంది మాత్రం ఇళ్లు కట్టుకోలేదు. రేకుల షెడ్లు మాత్రం వేసుకుని వదిలేశారు. సమీపంలోనే… ఓ ప్రయివేటు విద్యుత్ ప్లాంట్ ఉండటంతో దాని కాలుష్యం కారణంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేకపోయారట. 22 ఏళ్ల తరువాత విద్యుత్ ప్లాంట్ మూతపడటంతో కాంగ్రెస్‌లోని ఓ ఛోటా నేత కళ్లు ఈ ఖాళీ స్థలంపై పడ్డాయి. సుమారు ఒకటిన్నర ఎకరం ఉండే ఈ భూమి ధర కోట్లు పలుకుతోంది. దీంతో అధికారం మాటున దర్జాగా కబ్జాకు తెరలేశారు. ఆ క్రమంలో వివాదం చెలరేగి, వాగ్వాదంతో పాటు బాహాబాహీకి దిగారు. కొందరు లబ్దిదారుల పేరుతో రికార్డులు తారుమారు చేసి బోడా శ్రవణ్ అనే నాయకుడు ఆ భూమిని చదును చేస్తుండగా వివాదం రేగింది. ఆ కబ్జా ప్రయత్నాన్ని మరో కాంగ్రెస్ నాయకుడు సైదులు అడ్డుకున్నారు. దాంతో… ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గతంలోనే ఇలాంటి వివాదం తలెత్తి…ఫెన్సింగ్ వేసినా.. ఇప్పుడు లబ్ది దారుల పేరుతో జేసీబీ తీసుకుని వచ్చి చదును చేస్తున్న కాంగ్రెస్ నాయకుడి మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు మరికొందరు కాంగ్రెస్ నేతల మద్దతు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. 2004లో పట్టాలు పొందితే… రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు వాళ్ల పేరుతో మళ్లీ స్థలం కోసం ప్రయత్నించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏకంగా జిల్లా కలెక్టరుకే తప్పుడు సమాచారం ఇచ్చినట్టు కూడా ఆరోపణలున్నాయి. సాధారణంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైనా కబ్జా చేస్తుంటే… విపక్షం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. రచ్చ అవుతుంది. కానీ… ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు కొట్లాడుకోవడం ఆసక్తిగా మారింది. జనం మాత్రం ఎవరు అడ్డుకుంటే ఏంగానీ… కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మాత్రం కబ్జా అవకుండా కాపాడారని అంటున్నారు.
Also Read
- Tags
- congress
- khammam
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..