బతికున్నప్పుడు వేధింపులు…మరణం తర్వాతా సాధింపులా? ఓ టీడీపీ ఎమ్మెల్యే తీరుపై ఆ నియోజకవర్గంలో ఇలాంటి చర్చే జరుగుతోంది. అసలు ఆయన మరణానికీ ఎమ్మెల్యే మెంటల్ టార్చరే కారణమన్న కోపాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఏకంగా మంత్రి లోకేష్ రంగంలోకి దిగినా….సయోధ్య కుదరలేదు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎందుకంత ఆగ్రహం….అసహనం?
నెల్లూరు రాజకీయాల కథే వేరు. చలికాలంలోనూ చెమటలు పట్టించేలా ఉంటాయి. ఇక్కడి నేతలు ప్రతిపక్ష నేతలతో పాటు.. సొంత పార్టీలో ఉండే నేతల ఎత్తులకు కూడా పైఎత్తులు వేస్తూ ఉంటారు. వారి ఆధిపత్యానికి గండి కొడుతూ.. తమ రాజకీయ పబ్బం గడుపుకుంటారు. ఇలాంటి కోల్డ్ వారే కావలి టిడిపిలో భగ్గుమంది. ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మరణంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఆయనకి మధ్య వున్న విభేదాలు రోడ్డున పడ్డాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం టిడిపి అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
కావలి టిడిపి ఇన్చార్జిగా వున్న మాలేపాటి సుబ్బానాయుడుకి.. లాస్ట్ మినిట్ లో అధిష్టానం షాక్ ఇచ్చి వైసీపీ నుంచి వచ్చిన కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చింది. బీద రవిచంద్ర సహకారంతో ఆయనకు టికెట్ వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది. కావ్య గెలుపు కోసం పనిచేయాలని సుబ్బానాయుడికి రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. అయితే దగదర్తి మండలంలో మాలేపాటి సుబ్బానాయుడు వర్గం తమకు పనిచేయలేదని ఎమ్మెల్యే కావ్యలో అసంతృప్తి అలాగే ఉండిపోయిందని ఆయన అనుచరులు ఎప్పుడూ మాట్లాడుతుంటారు.
ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గెలిచినప్పటి నుంచి.. ఆయనకు సుబ్బానాయుడుకు మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. తన నియోజకవర్గంలో ఎవరైనా గ్రూపు రాజకీయాలకు పాల్పడితే హైడ్రా తరహాలో కూల్చేస్తానంటూ సుబ్బానాయుడ్నిని ఉద్దేశించి కావ్య చేసిన వ్యాఖ్యలు అప్పటిలో కలకలం రేపాయి. ఇదే సమయంలో సుబ్బానాయుడు వర్గానికి ఎవరూ పనులు చేయొద్దంటూ కావ్య కృష్ణారెడ్డి అధికారులకు ఫోన్ చేసి మరీ చెప్పారన్న ప్రచారం సుబ్బారాయుడు వర్గంలో అసహనం రాజేసింది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరించేందుకు అప్పట్లో బీద రవిచంద్ర ప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేదు. సుబ్బానాయుడికి రాష్ట్రస్థాయి పదవి రావడంతో.. వీరిద్దరి మధ్య విబేధాలు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్తాయికి వెళ్లినట్లు నియోజకవర్గ టిడిపిలో ప్రచారం సాగింది.
సుబ్బానాయుడి సొంత మండలంగా ఉన్న దగదర్తిలో..ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే కావ్య ఓ వర్గాన్ని ప్రోత్సహించారు. ఈ సమయంలో పోలీసులు కూడా సుబ్బారాయుడికి వ్యతిరేకంగానే పనిచేసే వారిని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇటీవల డిఆర్ ఛానల్ కాలువ వ్యవహారంలో అవినీతి జరిగిందని అధికారులను సుబ్బానాయుడు నిలదీయడంతో కావలిలో మరోసారి వీరిద్దరి మధ్య ఉన్న రాజకీయ వర్గ విభేదాలు బయటపడ్డాయట. ఇది జరుగుతున్న సమయంలోనే.. సుబ్బానాయుడు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆ సమయంలో కనీసం పరామర్శకు కూడా ఎమ్మెల్యే వెళ్లలేదని సుబ్బా నాయుడు వర్గంలో తీవ్ర అసంతృప్తి ఉండేదట. సుబ్బానాయుడు ఆరోగ్యం విషమించడంతో ఆయన మరణించాడు. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు కూడా ఎమ్మెల్యే కావ్య వెళ్ళలేదట. దీంతో కావ్య కృష్ణారెడ్డి వల్లే సుబ్బానాయుడు మానసిక క్షోభ అనుభవించారనీ ఆయన అనుచరులు ఆరోపణలు చేశారు. అయితే, ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం వల్లనే వెళ్లలేదని దీనిపై ఎమ్మెల్యే వర్గం రియాక్ట్ అవుతోంది.
సుబ్బా నాయుడు ఉత్తర క్రియలకు హాజరయ్యేందుకు వెళ్లిన కావ్య కృష్ణారెడ్డిని ఆయన అనుచరులు అడ్డుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇంచార్జ్ మంత్రి ఫరూక్ కారులో ఉండగా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు కారుపై కుర్చీలు సైతం విసిరారన్న కలకలం రేగింది. తాను సయోధ్యకు వెళ్లినా…సుబ్బానాయుడు వర్గం తనను అడ్డుకుందన్న మెసేజ్ ని రాష్ట్ర నాయకత్వానికి పంపేందుకే.. కావ్య కృష్ణారెడ్డి రాష్ట్ర అధ్యక్షుని వెంటపెట్టుకుని ఉత్తర క్రియలకు హాజరయ్యేందుకు వెళ్లారనీ లోకల్ గా వినిపిస్తున్న టాక్. ఈ వ్యవహారంపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారట. నియోజకవర్గంలో ఇద్దరు మధ్య విబేధాలు ఉన్నప్పుడు తన నోటీసుకి ఎందుకు తీసుకురాలేదని ఎమ్మెల్యేను ఆయన ప్రశ్నించారట.
మాలేపాటి సుబ్బానాయుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ఇబ్బంది పెట్టారని ఒకవర్గంలో చర్చ జరుగుతోంది. దీంతో ఆయన సుబ్బానాయుడికి నియోజకవర్గంలో ఎక్కడా పనులు జరగకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చేసారట. సుబ్బానాయుడు మృతి తరువాత జరిగిన పరిణామాలపై అధిష్టానం సీరియస్ అయ్యింది. దీంతో కృష్ణారెడ్డిని అమరావతికి పిలిపించి మరి లోకేష్ వార్నింగ్ ఇచ్చారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. టిక్కెట్టు త్యాగం చేసిన వ్యక్తి మరణిస్తే.. కనీసం పరామర్శి కూడా ఎందుకు పోలేదని లోకేష్ ఎమ్మెల్యేను ప్రశ్నించారట. తనకు సుబ్బానాయుడుకు ఎలాంటి విభేదాలు లేవని.. కొందరు రాజకీయ స్వార్థం కోసం తమ మధ్య విభేదాలు సృష్టించారని ఎమ్మెల్యే చెప్పే ప్రయత్నం చేశారట. కానీ లోకేష్ ఏమాత్రం వినలేదని తెలుస్తోంది.
కావలిలో రెండు వర్గాల మధ్య పరిస్థితి చెయ్యి దాటి పోకుండా మంత్రి లోకేష్ రంగంలోకి దిగారు. సుబ్బా నాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చి రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరించాలని ఆయన చేసిన ప్రయత్నం కూడా విఫలమైందన్న ప్రచారం జరుగుతోంది. ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికారు. కొద్ది దూరం వెళ్ళాక కారు దిగి ఎమ్మెల్యే కావలి వెళ్ళిపోయారు. మీరు ఇక్కడే ఉండండి…తాను వెళ్ళొస్తానని లోకేష్ ఎమ్మెల్యే తో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి లోకేష్ తో కావ్య కృష్ణారెడ్డి దగదర్తి వస్తే తాము అంగీకరించమని.. అలా ఐతే లోకేష్ కూడా పరామర్శకు రావాల్సిన అవసరం లేదంటూ సుబ్బానాయుడు కుటుంబం కరాఖండిగా చెప్పేసిందిట. దీంతో దగదర్తి కి వెళ్లేటప్పుడు ఎమ్మెల్యే లేకుండా లోకేష్ జాగ్రత్త పడ్డారన్న టాక్ సొంత పార్టీలో వినిపిస్తోంది. మొత్తంగా మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనకు వచ్చినా కూడా.. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి.. సుబ్బా నాయుడు వర్గానికి సయోధ్య కుదిరించలేకపోయారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని స్థానికంగా చర్చ జరుగుతోంది.