ఆ ఎమ్మెల్యే ఏ ముహూర్తాన కాంగ్రెస్ పార్టీలో చేరారో గానీ ఎప్పుడూ వివాదాలేనట. పైగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలంటూ ఫిర్యాదులు. వరుస వివాదాలు వెంటాడుతున్నా ఆయన మాత్రం ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారా..? ఏకంగా పార్టీనే ధిక్కరించే స్థాయికి మేటర్ వెళ్తోందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్రెడీ పార్టీ అభ్యర్థి బరిలో ఉండగా… ఎమ్మెల్యే అనుచరుడు బరిలో దిగడాన్ని ఎలా చూడాలి? అతనికి ఎవరి ఆశీస్సులున్నాయి? ఎవరా ఎమ్మెల్యే? ఆయన వ్యూహం ఏంటి? సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. బీఆర్ఎస్ తరపున గెలిచి నిరుడు జూలై 15న అనుచరగణంతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటు పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మాత్రం మహిపాల్ రెడ్డి చేరినప్పటి నుంచి ఎడమొహంగానే ఉంటున్నారు. పైగా… ఇక్కడ పార్టీకి నష్టం చేయడానికే వచ్చారంటూ ఆరోపిస్తున్నారు. మహిపాల్ రెడ్డి మాత్రం వాటి మీద పెద్దగా రియాక్ట్ అవలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని అభివృద్ది కార్యక్రమాలకు తమని ఆహ్వానించడంలేదంటూ గత జనవరిలో పెద్ద పంచాయితీనే నడిచింది. పార్టీలో ఉంటే ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని…ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో సీఎం రేవంత్ ఫోటో పెట్టాలంటూ ధర్నాకు దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. తీవ్ర గందరగోళం తర్వాత ఎట్టకేలకు క్యాంపు ఆఫీస్‌లో సీఎం ఫోటో కూడా పెట్టగలిగాయి కాంగ్రెస్ శ్రేణులు. మరోవైపు పటాన్ చెరులో వర్గపోరుపై పీసీసీ ఓ కమిటీ వేసి ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ ఇంచార్జ్‌ని అడిగి వివరణ కూడా తీసుకుంది. ఇక ఆ వివాదం ముగిసిందో లేదో ఇప్పుడు మరో అంశం తెరపైకివచ్చింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీపీ యాదగిరి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా హాజరయ్యారు.
దీంతో మరోసారి ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఆయన నామినేషన్ వేశారు కూడా. కానీ పార్టీలోనే ఉంటూ అన్నం పెట్టినోడికి సున్నం పెట్టినట్టు ఎమ్మెల్యే అనుచరుడు నామినేషన్ వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మరోసారి ఎమ్మెల్యేపై హైకమాండ్ కి ఫిర్యాదు చేసేందుకు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం రెడీ అవుతున్నట్టు సమాచారం. శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. పార్టీలో చేరక ముందు, చేరిన తర్వాత కూడా ఎమ్మెల్యేకి ఆయనకి పడట్లేదు. జనవరిలో ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ వివాదస్పదమయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్ ఫోటో తన ఆఫీస్‌లో ఎందుకు ఉందంటే పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ది చేసిన నాయకుడి ఫోటో ఉంటే తప్పేంటని అడిగారాయన. సీఎం రేవంత్ ఫోటో ప్రస్తావన వస్తే మాత్రం తనకి ఇష్టం ఉంటే పెట్టుకుంటా లేదంటే లేదని అన్నారు. ఇప్పుడు ప్రధాన అనుచరుడి నామినేషన్ అంశంపై ఎందుకు పెదవి విప్పడంలేదని ఎమ్మెల్యేని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ క్యాడర్. దీనిపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో దోస్త్తీ కటీఫ్ చేసుకొందామని ఎమ్మెల్యే అనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎవరూ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ నాయకుల మద్దతుకోరే అవకాశం ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేకి తెలియకుండా ఆయన అనుచరుడు నామినేషన్ వేసే అవకాశం ఉండదన్నది ఒక వాదన. దీంతో అసలు మహిపాల్ రెడ్డి ఏం చేయదల్చుకున్నారు. ఎందుకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేది అంతుపట్టట్లేదంటోందట కేడర్. ఈ ఎపిసోడ్‌పై కాంగ్రెస్ హైకమాండ్ పై ఏ విధంగా స్పదిస్తుందో, ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.