ఆ ఐఏఎస్ అధికారులకు కొత్త టెన్షన్ పట్టుకుందా? గండం గట్టెక్కాంరా.. దేవుడా అని ఊపిరి పీల్చుకుంటున్న టైంలో… పిడుగు పడ్డట్టయిందా? మళ్ళీ క్వశ్చన్ టైం వచ్చేసిందంటూ టెన్షన్ పడుతున్నారా? చివరికి కొందరు రిటైర్డ్ ఐఎఎస్‌లకు కూడా మనశ్శాంతి లేకుండా పోయిందా? ఎవరా ఆఫీసర్స్? ఎందుకు వాళ్ళలో టెన్షన్ పెరుగుతోంది? తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే ఇప్పుడు స్టేట్‌లోని పలువురు సీనియర్ ఐఏఎస్‌లను టెన్షన్ పెడుతోందట. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టింది ప్రభుత్వం. దాని మీద సుదీర్ఘ చర్చ జరిగాక సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది సర్కార్. ఆ నిర్ణయమే ఐఎఎస్‌లను షేక్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం కుంగుబాటుపై విచారణ కోసం కమిషన్‌ను నియమించగా… 15 నెలల తర్వాత 665 పేజీల నివేదిక అందజేసింది. ఆ నివేదికలో మాజీ సీఎస్ ఎస్కే జోషి, అప్పటి సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్ పని తీరును తప్పు పట్టింది కమిషన్. సుమారు పది మంది ఐఏఎస్ లను విచారించి ఇద్దరినే తప్పుపట్టింది. అందర్నీ క్రాస్ ఎగ్జామిన్ చేసి ఫైనల్‌గా ఆ నిర్ణయం తీసుకుంది కమిషన్. అంతకు ముందు ప్రాజెక్టులో పని చేసిన వివిధ స్థాయిల్లోని ఇంజనీర్లను కూడా ప్రశ్నించింది.
మాజీ ఈఎన్‌సీలు సి.మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్‌సీ బి.హరిరామ్‌లను, ఆ తర్వాత సీఎంవో మాజీ కార్యదర్శి స్మితా సభర్వాల్, మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు ఎస్‌కే జోషి, సోమేశ్‌కుమార్, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులను కూడా సాక్షులుగా పిలిచి విచారించింది. అంతా ఒక ఎత్తయితే… ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడంతో… గతంలో ఊపిరి తీసుకున్న అధికారుల్లో కూడా భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. కమిషన్ పిలిచి ప్రశ్నించడానికి, సీబీఐ దర్యాప్తునకు చాలా తేడా ఉంటుంది. ఒక్కసారి ఆ దర్యాప్తు సంస్థ అడుగుపెడితే… బాగా లోతుల్లోకి వెళ్తుంది. అది ఎట్నుంచి ఎటు తిరుగుతుందో తెలియదు. అందుకే గతంలో… ఈ ఇష్యూలో పేర్లు నలిగి, తర్వాత కమిషన్ రిపోర్ట్‌లో లేని అధికారుల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. గతంలో పీసీ ఘోష్ కమిషన్ విచారణ సందర్భంగా ఇబ్బందులు పడ్డామని భావిస్తున్న అధికారులు కూడా… ఇప్పుడు సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. తమకు ఏమీ తెలియదని, నాటి ప్రభుత్వ పెద్దలు చెబితేనే పనులు చేశామని, మూడేళ్ళ కిందటి విషయాలు మాకు గుర్తుకు లేవని కమిషన్‌కు సమాధానాలు చెప్పారట చాలా మంది అధికారులు. మరిప్పుడు సీబీఐ అధికారులు ఎంటరై వాళ్ళ స్టైల్‌లో ప్రశ్నలు సంధిస్తే… వీళ్ళేం సమాధఆనం చెబుతారోనన్న చర్చ జరుగుతోంది తెలంగాణ సెక్రటేరియెట్‌లో.