జూబ్లీహిల్స్ నియోజకవర్గ బస్తీల్లో వీధులన్నీ ఘుమఘుమలాడిపోతున్నాయ్. అంతా చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై మాటలే వినిపిస్తున్నాయ్. ఇక మందు పార్టీల సంగతైతే సరేసరి. ప్రలోభాల పర్వంలో అదో భాగమా? లేక పోలింగ్ పూజకు ముందు ఓటర్ దేవుణ్ణి ప్రసన్నం చేసుకునే కార్యక్రమమా? జూబ్లీహిల్స్ వీధుల్లో ఏం జరుగుతోందసలు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఓవైపు పీక్స్‌లో ఉంటే… మరోవైపు దానికంటే ఎక్కువగా వీధి వీధినా జరుగుతున్న విందులే హాట్ టాపిక్ అవుతున్నాయి. పార్టీ ఆఫీస్‌ల దగ్గరే కాదు…, కార్తీక మాసం అయినాసరే… గల్లీ గల్లీల్లో మసాలా వాసనలు ఘుమఘుమలాడిపోతున్నాయి. ఇక్కడి పరిస్థితి చూస్తుంటే… క్యాంపెయిన్ కంటే కర్రీ మీదే నేతలు దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని చమత్కరించుకుంటున్నారు. ప్రస్తుతం కొన్ని బస్తీల్లో అయితే… ఎవరు గెలుస్తారు? ఓటెవరికి అన్న చర్చకంటే… ఇవాళ ఎవరు బిర్యానీ పెడుతున్నారు? ఏ పార్టీ విందు భోజనం ఎక్కడ? మెనూ ఏంటన్న చర్చలే ఎక్కువగా నడుస్తున్నాయట. ఇంకా కామెడీ ఏంటంటే… ఈ ఓట్ల భోజనాల దెబ్బకు చాలా ఇళ్ళలో పొయ్యి వెలిగించడం మానేశారట. సకుటుంబ సమేతంగా…. పూటకో పార్టీ టెంట్ దగ్గరికెళ్ళి సకుటుంబ సమేతంగా ఫుల్‌గా నాన్‌వెజ్ మీల్స్ లాగించేసి వస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎంతైనా… పోలింగ్ డేట్ దాకా…. ఓటరు దేవుళ్లు కదా… అందుకే మెనూ విషయంలో కాంప్రమైజ్ అవడం లేదట రాజకీయ పార్టీలు. చికెన్ ఫ్రై, మటన్ బిర్యానీ, ఫిష్ కర్రీ ఇలా… రోజుకో రకంగా సంతృప్తి పరుస్తున్నారట. ఇక మందు సీసాలైతే… సైలెంట్‌గా చేతులు మారిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఓటర్లకు మందు, విందుల్లాంటివి ఇవ్వడం నేరమని ఎన్నికల నియమాలు స్పష్టంగా చెబుతున్నాయి. కానీ… మనోళ్ళు కొంచెం స్మార్ట్ కదా…. అందుకే… ఎన్నికల ప్రస్తావన, పార్టీల జెండాలు లేకుండా భోజనాలు పెట్టేసి ఓటు సంగతి మాత్రం మౌత్ పబ్లిసిటీతో చెవిలో చెప్పేస్తున్నారు. పైగా… దానికి సోషల్ గేదరింగ్ అన్న ముద్దుపేరు కూడా పెట్టేశారు. అలాంటి వాటిని తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం చెప్పినా, అందరు చేసేది అదే పని కావడంతో ఇప్పటిదాకా ఒక్క ఫిర్యాదు కూడా లేదట. ఎన్నికల ప్రచారంలో లీడర్స్ వెంట ఎంత ఎక్కువ మంది కార్యకర్తలు ఉంటే అంత గొప్ప కాబట్టి ఎవరికి వాళ్ళు ఎక్కువ మందిని తీసుకెళ్ళేందుకే ప్రాధాన్యం ఇస్తుంటారు. అలాంటి వాళ్లందరికీ బ్రేక్ ఫాస్ట్ నుండి మొదలు పెడితే… రాత్రి మందు, విందు వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయట ఆయా పార్టీలు. ఓవరాల్‌గా ఎవరి లెక్కలు ఎలా ఉన్నాగానీ… సోషల్ గేదరింగ్స్ పేరుతో మందు, ముక్క మాత్రం జోరుగా దొరుకుతున్నాయి జూబ్లీహిల్స్ బస్తీల్లో. రేపు ఓటెవరికి వేస్తారన్నది వేరే సంగతి. ఇప్పుడైతే.. అందరూ అన్ని పార్టీల సోషల్ గేదరింగ్స్‌కు హాజరవుతూ… అనుభవించు రాజా… అంటున్నారు.
CM Chandrababu : సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుంది