ఒక లక్ష్యం…రెండు అస్త్రాలు..జూబ్లీహిల్స్ ఎన్నికల రణంలో కీలక ఆయుధాలపై ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. అవే తమకు విజయ తిలకం దిద్దుతాయని లెక్కలేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్…అన్ని రకాలుగా పైచేయి సాధించే పనిలో పడింది. క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా ప్రచారంలో మునిగితేలుతున్నారు. తమకు కలిసొచ్చే ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలేయకుండా అందిపుచ్చుకునే పనిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో సామ దాన భేద దండోపాయాలన్నిటినీ ప్రయోగిస్తోంది. ప్రభుత్వం ఏం చేసిందని అడిగే వాళ్లకు… రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రెండేళ్లుగా అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్… తెల్ల రేషన్ కార్డు…సన్న బియ్యం.. ఉచిత ఆర్టీసీ బస్సు లాంటి అంశాలను ఫోకస్ చేస్తోంది. మహిళల ఓటు బ్యాంకు మీద ఎక్కువ ఫోకస్ చేసింది. మహిళా సంఘాలకు సంబంధించిన నాయకులు సభ్యులపై దృష్టి పెట్టింది. మంత్రులు ప్రతి పోలింగ్ బూతు స్థాయికి వెళ్లడంతో స్థానికంగా ఉండే అవసరాలను నాయకులు చక్కబట్టే పనిలో ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనార్టీల ఓటు బ్యాంకు లక్షా ఇరవై వేల పైచిలుకు ఉంటుంది. ఇటీవల అజహరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వటంతో ఆ ఓటు బ్యాంకును తమవైపు పూర్తిగా తిప్పుకునే పని చేసింది కాంగ్రెస్. అటు మైనార్టీలో కూడా చీలికలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. ప్రత్యర్థి పార్టీని ఇరుకునపెడుతూ మైనార్టీల్లో…మెజార్టీ ఓట్లను సాధించే పనిలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. జూబ్లీహిల్స్ లో ఉన్న మైనార్టీ కీలక నేతలందరితో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ రెండుసార్లు సమావేశం అయ్యారు. వారి నుంచి ప్రతిపాదనలు కూడా తీసుకున్నారు. మాస్ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. తెల్ల రేషన్ కార్డులు… సన్న బియ్యం లబ్ధిదారులను పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్లు ఓటర్ మ్యాపింగ్ పనిలో పడ్డారు. మరోవైపు సినిమా కార్మికుల ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్‌కి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆ కార్మికులతో సమావేశం అయ్యారు. వారి మౌలికమైన సమస్యల పరిష్కారానికి ఆదేశాలు కూడా వెళ్లాయి. కార్మికుల ఓట్లు ఒకవైపు…మైనార్టీ ఓట్లు మరోవైపు… సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లు చీలకుండా కాంగ్రెస్‌కు వేయించే పనిలో ఉన్నారు మంత్రులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని రకాల ఎత్తుగడలను కాంగ్రెస్ అనుసరిస్తోంది. ప్రతి 100 ఓట్లకు ఒక నాయకుడిని నియమించి పర్యవేక్షిస్తోంది.