జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో బీజేపీ వ్యూహం ఎలా ఉంది? ఏపీలో పొత్తులున్నా… తెలంగాణలో మాత్రం మేం సింగిల్ అంటున్న కమల నేతలు… జూబ్లీహిల్స్‌లో కూడా అదే స్టాండ్ తీసుకుంటారా? అక్కడ బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? అసలు తెలంగాణలో టీడీపీని ఎందుకు వద్దనుకుంటోంది కాషాయ పార్టీ? లెక్కల్లో ఎక్కడ తేడా కొడుతోంది?
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి టీడీపీ, జనసేన. ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకుంటున్నాయి కూడా. అటు తెలుగుదేశం ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నాయి. అంతవరకు బాగానే ఉన్నా… తెలంగాణకు వచ్చేసరికి సమీకరణలు మారిపోతున్నాయట. మామూలుగా అయితే… ఆ మూడు పార్టీలు కలిసి కూటమిగానే ముందుకు వెళ్ళాలి. కానీ… తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా…ఇక్కడ కూటమి కట్టకపోవచ్చన్న వాదన బలపడుతోంది. ప్రత్యేకించి త్వరలో జరగాల్సిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో రాజకీయ విశ్లేషణలు రకరకాలుగా ఉన్న క్రమంలో… ఇప్పుడు కూటమికి సంబంధించిన కొత్త మాటలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కూడా ఆ మూడు పార్టీలు కలిసి ముందుకు సాగుతాయా… కలిసే పోటీ చేస్తాయా అనే చర్చలు నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కామెంట్స్ తర్వాత ఈ చర్చలు జోరందుకున్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ… భవిష్యత్‌లో తమ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే… బీఆర్‌ఎస్‌కు దెబ్బపడుతుందని కేటీఆర్ భయపడుతున్నట్టున్నారని అన్నారు సీఎం రమేష్. ఆయన ఆ మాటలు అన్నాకే… తెలంగాణలో కూడా కూటమి రాజకీయంపై డిస్కషన్ పెరిగింది. కానీ… తెలంగాణ బీజేపీ నేతల వెర్షన్ మాత్రం డిఫరెంట్‌గా ఉంది.
రాష్ట్రంలో కమలం సింగిల్‌గానే వెళ్తుంది. ఎలాంటి పొత్తులు అవసరం లేదని క్లారిటీ ఇచ్చేశారు ఆ పార్టీ నాయకులు. సీఎం రమేష్ వ్యాఖ్యల తర్వాత స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్… తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తు ఉండబోదని క్లియర్‌గా చెప్పేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, కూటమి కట్టే ప్రసక్తే లేదని అంటున్నారు కాషాయ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలైనా…, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలైనా…. తెలంగాణ వరకు తమది సోలో సాంగేనని తేల్చేశారు. అందుకు ఇక్కడున్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీజేపీ నేతల కామెంట్స్‌తో త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సైతం ఎన్డీఏ తరపున కాకుండా డైరెక్ట్‌గా బీజేపీ అభ్యర్థే బరిలో ఉంటారని తేలిపోయింది. ఏం… ఎందుకలా..? ఏపీలో పొత్తు ఉంది. పైగా జూబ్లీహిల్స్‌లో టీడీపీకి ఓట్ బ్యాంక్ కూడా ఉంది. అలాంటప్పుడు కూటమిగా పోటీచేస్తే అడ్వాంటేజ్ అవుతుంది కదా..? అన్నది కొందరి ప్రశ్న. కానీ…బీజేపీ లెక్కలు మాత్రం వేరుగా ఉన్నాయట.
ఏపీ పొత్తును తెలంగాణకు కూడా విస్తరిస్తే… అది బీఆర్‌ఎస్‌కు అడ్వాంటేజ్ అవుతుందన్నది కాషాయ పార్టీ కేలిక్యులేషన్‌గా తెలుస్తోంది. ఇక్కడ టీడీపీని కూడా ముందు పెడితే….బీఆర్‌ఎస్ మళ్ళీ సెంటిమెంట్ రాజేసి లబ్ధి పొందుతుందన్నది కమననాథుల అభిప్రాయం అట. అందుకే తెలంగాణ వరకు తెలుగుదేశంతో ఎక్కడా డైరెక్ట్‌గా పొత్తు పెట్టుకోకుండా దూరం పాటించాలని అనుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి జనసేనతో కూడా ఇదే దూరం పాటించాలనుకుంటున్నట్టు సమాచారం. అయితే… జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకు చూసుకుంటే…ఇక్కడ టీడీపీకి బలం ఉంది. ఆ బలాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటుదన్నది ఆసక్తికరంగా మారింది. పైకి కనిపించకున్నా… అంతర్గత సర్దుబాట్లు ఉండవచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో.