జనసేనకు ఆయువుపట్టుగా నిలిచిన ఆ జిల్లాలో ఇప్పుడు పరిస్థితి తల్లకిందులవుతోందా? ఎగిరెగిరి దంచినా అంతే…. ఎగరకుండా దంచినా అంతేనంటూ ఏకంగా జిల్లా అధ్యక్షుడే కాడి పడేశారా? అధినేత ఆంతర్యాన్ని గమనించకుండా ఎమ్మెల్యేలు సొంత అజెండాతో ముందుకు పోతూ… పార్టీ పరువు తీస్తున్నారా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? జనసైనికులు ఏమంటున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఆరు సీట్లు అందించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జోష్ మీద కనిపించాల్సిన పార్టీ నేతల్లో అసంతృప్తితో పాటు అయోమయం కూడా పెరిగిపోతోంది. పార్టీ అధినేత పవన్ ఆశించిందొకటి క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటిగా నడుస్తోందట. పోలవరం, ఉంగుటూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీటిలో మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలును పక్కన పెడితే మిగతా చోట్ల… అంతా సర్వ మంగళ మేళమే అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం. ఇందులో కూడా నరసాపురం, భీమవరం నియోజకవర్గాల్లో పూర్తి రివర్స్‌లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ రెండు చోట్ల పార్టీ అధిష్టానం ఆశించిన ఫలితం ఏ కోశానా కనిపించడం లేదంటున్నారు. ఇటీవల భీమవరంలో పేకాట క్లబ్బుల కోసం జనసేన నేతలు సృష్టించిన హంగామా అంతా అంతా కాదు. అభివృద్ధి నిధులు కోసం ఏమాత్రం అధినేతను కలిసి విన్నపాలు చేయని లోకల్ లీడర్స్ ముఠాలు కట్టి పోలీసు అధికారి పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు అంటూ ప్రత్యేక ఫిర్యాదు చేయడం దుమారం రేపింది. చివరికి అది బూమరాంగ్ అయి పార్టీ అధినేత పరువు సమస్యగా మారింది.
భీమవరంను పవన్ ప్రత్యేకంగా చూస్తున్నా… ఇక్కడి నాయకులు మాత్రం చివరికి ఆయన నెత్తికే తెస్తున్నారన్నది లోకల్ కేడర్ ఫీలింగ్. ఇక నరసాపురంలో నియోజకవర్గ అభివృద్ధి సంగతి పక్కనపెడితే… ఎమ్మెల్యే పార్టీతో సంబంధం లేకుండా సొంత అజెండాతో ముందుకు వెళుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతి పనిలోనూ కమిషన్లు, కొన్ని శాఖల నుంచి నెలవారీ మామూళ్ళు సైతం వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో స్థానిక టీడీపీ నేతలనుంచి సహకారం అందకపోవడం పెద్ద సమస్యగా మారినట్టు చెబుతున్నారు.దీంతో కలిసి పని చేయాల్సిన నేతల మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతోందని సమాచారం. అదంతా ఒక ఎత్తయితే… సమన్వయంతో పాటు సమస్యల్ని పరిష్కరించాల్సిన జిల్లా అధ్యక్షుడే అయోమయం, గందరగోళం అన్నట్టుగా ఉన్నారట. ఎన్నికల ముందు వరకు దూకుడుగా కనిపించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అలియాస్ చినబాబు ఆ తర్వాత నుంచి అంతంత మాత్రంగానే వ్యవహరిస్తున్నారన్నది పార్టీ టాక్.
భీమవరం ఏరియాకు చెందిన చినబాబు… గత ఎన్నికల్లో అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయకుంటే తాను బరిలో ఉండాలని భావించారు. కానీ…ఆ ఛాన్స్ టిడిపి నుంచి వచ్చిన పులపర్తి రామాంజనేయులుకు దక్కింది. ఇక అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా… ఇప్పటికీ గుర్తింపు ఉండే పదవి ఇవ్వకుండా పార్టీ పెద్దలు చిన్నచూపు చూస్తున్నారన్నది చినబాబు బాధగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కష్టపడి పని చేసినా… ఫలితం వచ్చే సమయానికి ప్రాధాన్యత వేరే వారికి దక్కుతోందన్న అసంతృప్తితో జిల్లా అధ్యక్షుడితో పాటు ఎమ్మెల్యేలు ఉండడంతో పార్టీకి ఆయువుపట్టుగా నిలిచిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆశించిన మైలేజ్ రావడం లేదని అంటున్నారు. ఓవైపు టిడిపి నేతల నుంచి సరైన సహకారం అందకపోవడం, ఇంకోవైపు జిల్లాలో కీలక నేతలకు సరైన పదవులు ఇచ్చే విషయాన్ని పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడం చూస్తుంటే భవిష్యత్తులో మన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుందా అన్న అనుమానాలను సైతం జనసేన నేతల్ని వెంటాడుతున్నాయట. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి ఇప్పుడు గెలిచిన జనసేన సీట్లలో అదే పరిస్థితి ఉంటుందా అన్నది ఎక్కువ మంది జనసేన నేతల డౌట్. ఇప్పటికైనా పశ్చిమగోదావరి జిల్లా నేతల వ్యవహార శైలిపై పార్టీ అధినేత దృష్టి పెడితేనే పట్టు తగ్గకుండా ఉంటుందని, లేదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఉపయోగం ఉండబోదన్నది కేడర్ వాయిస్.