Site icon NTV Telugu

Off The Record: గ్రూపు రాజకీయాలు ఇబ్బందిగా మారయా..?

Gnt

Gnt

Off The Record: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆ ఒక్క నియోజకవర్గమే ఎందుకంత ప్రత్యేకంగా ఉంది? వైసీపీ అధిష్టానానికి కొరకరాని కొయ్యలా మారిపోయింది? జిల్లా మొత్తం ఇన్ఛార్జ్‌లు ఉన్నా అక్కడ మాత్రం ఎందుకు పెట్టలేకపోతోంది? ఎవరికి వారు స్వయంప్రకటిత ఇన్ఛార్జ్‌లు తయారవడాన్ని ఎలా చూడాలి? ఏదా అసెంబ్లీ సెగ్మెంట్‌? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి?

Read Also: PBKS vs RCB : ఆర్సీబీ బౌలర్ల విజృంభణ.. పంజాబ్ బ్యాటర్లు కుదేలు…

గుంటూరు వెస్ట్‌.. రాజకీయంగా మంచి ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్‌. కానీ… ఇక్కడ ఇన్ఛార్జ్‌ని నియమించుకోలేక సతమతం అవుతోందట వైసీపీ. అలాగని…. పార్టీకి ఇక్కడ నాయకుల కొరతేం లేదు. గత ఎన్నికల్లో ఇక్కడనుంచి పోటీ చేసి ఓడిపోయారు మాజీ మంత్రి విడదల రజని. తర్వాత ఆమెను తన పాత నియోజకవర్గం.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమన్వయకర్తగా పంపింది అధిష్టానం. అదే సమయంలో సత్తెనపల్లి ఇన్ఛార్జ్‌గా ఉన్న అంబటి రాంబాబును గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రకటించింది. కానీ… విడదల రజనీ వెళ్లిపోయాక.. గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్‌గా ఎవరినీ నియమించలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో సమన్వయకర్త లేని ఏకైక నియోజకవర్గంగా మిగిలిపోయింది. జిల్లా అధ్యక్షుడిగా గుంటూరులోనే ఉండి రాజకీయం చేస్తున్న అంబటి రాంబాబునే పశ్చిమ ఇన్ఛార్జ్‌గా ప్రకటిస్తారని, అందుకే ఖాళీగా ఉంచారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

Read Also: Off The Record: ఏపీ బీజేపీ పాత ముద్ర చెరిపేయడానికి తంటాలు పడుతోందా?

కానీ, రోజులు, నెలలు గడిచిపోతున్నా… ఆ ఒక్కటి మాత్రం జరగడం లేదు. దీంతో నాయకులకు కొదవ లేకున్నా… పార్టీ పెద్దలు ఇలా ఎందుకు చేస్తున్నారన్న చర్చ మొదలైంది కేడర్‌లో. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మరో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మాజీ మేయర్ కావటి మనోహర్… ఇలా చాలామంది నాయకులున్నారు ఇక్కడ. వీరిలో అప్పిరెడ్డి, ఏసురత్నంకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్దిగా గతంలో పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. మోదుగుల వేణుగోపాలరెడ్డి అయితే… 2014లో టీడీపీ తరపున గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పనిచేశారు కూడా. ఈ ముగ్గురికీ గుంటూరు పశ్చిమపై పూర్తి అవగాహన ఉంది. కానీ…ఇన్ఛార్జ్‌ ప్రకటనలో ఈ ఆలస్యం ఎందుకన్నది మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌. అయితే… దీనివెనక గ్రూప్‌ రాజకీయాలు ఉన్నాయన్నది లేటెస్ట్‌ టాక్‌. అంతా బలమైన నాయకులే కావడంతో… ఎవరికి వారే కర్చీఫ్‌ వేసే ప్రయత్నంలో ఉన్నారని, అందుకే పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. కొత్త ఇన్ఛార్జ్‌దాకా ఎందుకు.. అసలు గతంలో గుంటూరు పశ్చిమలో వైసీపీ అభ్యర్దుల ఓటమికి ఈ గ్రూపు రాజకీయాలే కారణమని కూడా చెప్పుకుంటున్నారు. అవే గ్రూపు రాజకీయాలు ఇప్పుడు సమన్వయకర్త నియామకానికి అడ్డుగా మారాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి స్థానికంగా. అటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాంబాబుకు ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారట ఆయన అనుచరులు.

Read Also: CID: కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు.. మరో ఇద్దరు అరెస్టు..

అయితే, 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలామంది వైసీపీ నాయకులు సైలెంట్ అయినా… అంబటి మాత్రం దూకుడు మీదున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చెయ్యడంలో తగ్గడం లేదాయన. పైగా పలు కేసులకు సంబంధించి న్యాయ పోరాటాలు కూడా చేస్తున్నారు. కానీ… వెస్ట్‌ నియోజకవర్గం మీద మాత్రం అంబటి కంటే మిగతా నేతలకు గట్టి పట్టుంది. నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అనుచరగణం కూడా ఉంది వాళ్ళకి. దీంతో ఎవరిని సమన్వయకర్తగా ప్రకటించాలో అర్ధంగాక అధిష్టానం తాత్సారం చేస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో ఇటీవల అంబటి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతానికి తానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు చూస్తున్నట్లు చెప్పారు. ఇదే ఇప్పుడు లోకల్‌గా హాట్ టాపిక్ అయింది. పార్టీ అధినేత జగన్ హామీ ఇవ్వడంవల్లే అంబటి ఇలా మాట్లాడి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో జిల్లా అధ్యక్షుడిగా ఉండడం వల్ల సమన్వయకర్తలేని గుంటూరు పశ్చిమ గురించి అంబటి అలా మాట్లాడి ఉంటారని అంటున్నారు మరి కొంతమంది. కానీ… ఆయన ప్రకటన మాత్రం గుంటూరు పశ్చిమ వైసీపీలో చిన్న సైజు తుఫాను సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ఫైనల్‌గా పార్టీ అధిష్టానం ఈ దాగుడు మూతలకు ఎప్పుడు తెర దించుతుందో.. కొత్త ఇన్ఛార్జ్‌ ఎవరొస్తారో చూడాలి.

Exit mobile version