OTR : సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో కాంగ్రెస్ సర్కార్ చొరవ.. గులాబీ శ్రేణుల్లో మొదలైన చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం చేసిన ఓ పని ప్రతిపక్షం బీఆర్ఎస్ను డిఫెన్స్‌లోకి నెట్టేసిందా? చివరికి ఆ పార్టీ శ్రేణులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నాయా? కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య పోలిక పెట్టి మాట్లాడుతూ….అప్పట్లో మనోళ్ళు తప్పు చేశారని గులాబీ కార్యకర్తలే ఎందుకు అంటున్నారు? అసలు ఏ విషయంలో ఆ స్థాయి పోలిక వచ్చింది? నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అది మాజీ శాసనసభ్యుడికి దక్కిన గౌరవం. మామూలుగా అయితే… ఇదేమంత చర్చనీయాంశం కాదుగానీ… ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. అసలు సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం విషమించినప్పటి నుంచే ప్రభుత్వం స్పెషల్ కేర్ తీసుకుంది. వరంగల్ ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో… కేవలం గంటన్నరలోపే మాజీ ఎమ్మెల్యేని మెరుగైన వైద్యం కోసం తరలించడానికి సాధ్య పడింది.
Also Read
ఇక నాలుగు రోజులపాటు అత్యాధునిక చికిత్స అందించినప్పటికీ చివరి నిమిషం వరకు మృత్యువు తో పోరాడి ఓడిపోయారాయన. సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని వరంగల్‌లోని అమరవీరుల స్థూపం దగ్గరకు, తర్వాత ఆయన స్వగ్రామానికి భారీ ర్యాలీతో తీసుకువెళ్ళారు. అక్కడి వ్యవసాయ క్షేత్రంలో పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే భౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియల కోసం ప్రభుత్వానికి ఎలాంటి విన్నపాలు రాలేదు. ఇటు కుంటుంబం నుంచి గాని, అటు ఆయన ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ నుంచి గాని కోరలేదు. కానీ… ఆ విషయంలో ప్రభుత్వమే చొరవ తీసుకోవడం గురించి ప్రస్తుతం తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉద్యమకారులు, పెద్ది అభిమానులతో పాటు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఇది తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవం అని మాట్లాడుకుంటున్నారట.
నూటికి నూరు పాళ్ళు ఈ గౌరవానికి సుదర్శన్‌రెడ్డి అర్హుడేనని అంటున్నారు. అధికార పార్టీకి చెందని, సిట్టింగ్ ఎమ్మెల్యేకాని నేత అయినప్పటికీ… ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా గౌరవించిందంటూ… ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. సరిగ్గా ఇక్కడే గతంలో బీఆర్ఎస్ తీరు గురించి సోషల్ మీడియా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న చనిపోయారు. కానీ… ఆయన భౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగలేదంటూ గుర్తు చేస్తున్నారు పలువురు. బీఆర్ఎస్ హయాంలో సినీ నటుల భౌతిక కాయాలకు ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ…. సీనియర్, పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పట్లో అధికార లాంఛనాల కోసం సికింద్రాబాద్ స్మశాన వాటికలో సాయన్న కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చేశారు కూడా. చివరి నిమిషం వరకు అప్పటి ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడంతో సాధారణంగానే సాయన్న చివరి కార్యక్రమాలు ముగిసిపోయాయి. సరిగ్గా ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ పోలికపెట్టి మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా, మాజీ ఎమ్మెల్యే అయినా… కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అధికారిక లాంఛనాలతో ఆయనకు గౌరవం కల్పించిందన్న చర్చలు పెరగడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ అధిష్టానం డైలమాలో పడిందట. కాంగ్రెస్ ప్రభుత్వం అందెశ్రీతో పాటు మరి కొందరు నేతలకు కూడా ఇదే గౌరవాన్ని కల్పించింది. మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా… పెద్ది సుదర్శన్‌రెడ్డి విషయంలో వ్యవహరించిన తీరు మాత్రం గొప్పగా ఉందని, బీఆర్ఎస్ సానుభూతిపరుల్ని సైతం ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో గతంలో సాయన్న విషయంలో మనం కాస్త జాగ్రత్తపడి ఉంటే బాగుండేదన్న చర్చలు సైతం గులాబీ వర్గాల్లో జరుగుతున్నాయట. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా తమనే వేలెత్తి చూపించేలా వ్యవహరించిందని అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. అదే సమయంలో… ఉద్యమకారుల విషయంలో రాజకీయాలకు తావులేకుండా… భవిష్యత్తులో కూడా ఇలా వ్యవహరిస్తే బాగుంటుందని, అది మంచి పరిణామం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!