ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ… ఆ ఎమ్మెల్యేలు మాత్రం సొంతూళ్ళనే ప్రత్యర్థులకు సమర్పించుకున్నారు. ఒకాయన అయితే… స్వగ్రామంలో సోదరుడిని కూడా గెలిపించుకోలేకపోయారు. అంత దారుణమైన ఫలితాన్ని చవిచూసిన ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఎందుకలా జరిగింది? తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపాయి. ఈ ఫలితాలు చూస్తుంటే… గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పార్టీ పట్టు తగ్గలేదన్న సంగతి అర్ధమవుతోందని అంటున్నారు హస్తం లీడర్స్. అదంతా ఒక ఎత్తయితే… అదే పార్టీకి చెందిన కొందరు లీడర్స్‌కు మాత్రం తమ సొంత ప్రాంతాల్లోని ఫలితాలు మింగుడు పడ్డం లేదట. కొంతమంది ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో… కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోయారు. దీంతో… ఇంత బతుకు బతికి అంటూ… సదరు నాయకులు తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నది సామెత. కానీ… రచ్చ గెలిచి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మాత్రం సొంత ఊళ్ళోనే తమ వాళ్ళని గెలిపించుకోలేకపోవడంతో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందని మథనపడుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. స్థానిక అభ్యర్థుల ఎంపిక మీద ఎమ్మెల్యేలు పెద్దగా దృష్టి పెట్టకపోవడనే సమస్యకు కరణమా అన్నది ఎక్కువ మంది ప్రశ్న. ఆ… ఏముందిలే…. సర్పంచ్ ఎన్నికలే కదా అని వాళ్ళు చూసీ చూడనట్టు వదిలేశారా? లేక నిజంగానే ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేల మీద పీకలదాకా వ్యతిరేకత ఉందా అన్న ప్రశఅనలకు సమాధానాలు వెదుకుతున్నారు చాలా మంది.
ఎట్నుంచి ఎటు చూసినా…. సొంతూళ్ళలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోవడం మాత్రం తేలిగ్గా తీసుకోకూడని అంశం అన్న అభిప్రాయం బలపడుతోంది. ఎమ్మెల్యేలన్నాక రాజకీయంగా యాక్టివ్‌గానే ఉంటారు. కానీ… సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళ సొంతూళ్ళలోనే ఓటమిని చవిచూడాల్సి వచ్చిందంటే…. లోపం ఎక్కడుందో ఇప్పటికైనా తెలుసుకోవాలన్న సూచనలు విపిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల రూపంలో శాసనసభ్యులకు సొంత గ్రామాలు హెచ్చరికలు జారీ చేయాశాయన్నది ఇంకొందరి మాట. ఇలా… సొంత గ్రామాలను ప్రత్యర్థులకు వదిలేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాస్త ఎక్కువగానే ఉంది. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి సొంత ఊరు ధన్వాడలో కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ విజయం సాధించింది. అక్కడ బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రభావం ఎక్కువ. ఇక దేవరకద్ర ఎమ్మెల్యే….గవినోళ్ళ మధుసూదన్ రెడ్డి సొంత ఊరు దమత్నాపూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్ధికి 120 ఓట్లకు పైబడి మెజార్టీ రావడం చిన్న విషయంమేం కాదంటున్నారు. ఇటు జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుథ్ రెడ్డి సొంత గ్రామం… రంగారెడ్డిగూడలో కూడా కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెళ్తే మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకి కూడా షాక్ ఇచ్చారు సొంతూరు ప్రజలు. ఆయన స్వగ్రామం పచ్చునూరులో కేవలం ఒక్క ఓటుతో brs మద్దతుదారు సర్పంచ్ అయ్యారు. అటు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అయితే… మరీ ఘోరంగా సొంతూరులో సోదరుడిని గెలిపించుకోలేకపోయారు. అక్కడ కూడా BRS మద్దతు పలికిన అభ్యర్ధి గెలిచారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ దత్తత గ్రామం నేరడిగుంటలో కూడా అధికార పార్టీకి చుక్కెదురైంది. ఆ రకంగా ఎమ్మెల్యేలు, మంత్రికి సంబంధించిన ఇలాకాల్లోనే అధికార పార్టీ ఓడిపోవడంతో… అది వాళ్ళ అజాగ్రత్త వల్ల జరిగిందా? లేక పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనాసరే… దీన్నో ముందస్తు హెచ్చరికగా తీసుకుని జాగ్రత్త పడకుంటే ముందు ముందు ఇబ్బందులు తప్పవన్నది పొలిటికల్ పరిశీలకుల మాట.