మాజీ సీఎం కేసీఆర్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల మర్మం ఏంటి? కేసీఆర్‌కు ఎర్రవల్లే చర్లపల్లి అని ఎందుకు అన్నారు? ఇప్పటికిప్పుడు అరెస్ట్‌ల దాకా వెళ్ళే ఉద్దేశ్యం లేదని చెప్పకనే చెప్పేశారా? కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? ముఖ్యమంత్రి మాటలకు అర్ధాలు వేరుగా ఉన్నాయా? లెట్స్ వాచ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ మీడియా చిట్‌చాట్‌లో అన్న మాటల్లోని అర్ధాలు, పరమార్ధాలను వెదికే పనిలో బిజీగా ఉన్నాయి రాజకీయ వర్గాలు. హస్తిన వెళ్ళినప్పుడల్లా…ఎక్కువ శాతం మీడియాతో చిట్‌చాట్ చేస్తూ వస్తుంటారు సీఎం. ఆ సందర్భంగానే… ఏదో ఒక చర్చను వెంటబెట్టుకుని హైదరాబాద్‌లో ల్యాండ్ అయిపోతుంటారాయన. ఎప్పటి లాగే…ఇప్పుడు కూడా ఓ పాయింట్‌ని తీసుకుని వచ్చినా… దాని తీవ్రత దృష్ట్యా మునుపటికంటే సీరియస్‌గా డిస్కషన్ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. మేటర్ మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్‌కు సంబంధించినది కావడంతో… ఒక్కసారిగా అందరి కళ్ళు అటువైపు తిరిగాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలు, అవినీతి మీద కేవలం విచారణ లేనా…అరెస్టులు కూడా ఉంటాయా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు… సీఎం రేవంత్ ఇచ్చిన సమాధానం పెద్ద చర్చకే దారి తీస్తోంది. ఆ విషయంలో ప్రభుత్వ వైఖరేంటో… చెప్పీ చెప్పనట్టుగానే చెప్పేశారు సీఎం. కేసీఆర్‌ని జైల్లో పెట్టడం ఎందుకు… ఎర్రవెల్లే ..చర్లపల్లి… ఆయన ఇంట్లో ఉన్నా… జైల్‌లోలాగే ఉంటున్నారు కదా..? చర్లపల్లిలో ఐతే పోలీసులు ఉంటారు. ఇంట్లో ఐతే ఉండరు.
అంతే తేడా….. అన్న సీఎం కామెంట్స్ చుట్టూ చర్చోపచర్చలు మొదలయ్యాయి. కేసీఆర్ దగ్గర ఉన్న సీఎం సీటునే లాక్కున్న… ఇంకేం పనిష్మెంట్ ఉంటది అని రేవంత్ చేసిన కామెంట్స్‌పై రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. ఓ వైపు కాళేశ్వరం, ఇంకో వైపు ఫోన్ ట్యాపింగ్ కేసుల దర్యాప్తు ఆఖరి దశకు చేరుకుంటోంది. ఈ సమయంలో కేసీఆర్.. కేటీఆర్.. హరీష్‌రావు మీద ప్రభుత్వం వైఖరేంటి, యాక్షన్ ఎలా ఉండబోతోందన్న డౌట్స్ సహజంగానే వస్తాయి. ఇక్కడే ముఖ్యమంత్రి పరోక్షంగా తాను చెప్పాలనుకున్నది చెప్పేసినట్టు విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. అరెస్ట్‌ల విషయంలో ప్రభుత్వానికి తొందరేం లేదన్న విషయం ఆయన మాటల్ని బట్టి అర్ధమవుతోందని అంటున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే… గులాబీ నేతలకు నో జైలు..అన్నమాట అంటూ… చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చింది. అందులో వేళ్ళన్నీ… కేసీఆర్..హరీష్‌రావు వైపే చూపించాయి. దీంతో… ఇప్పుడు సర్కార్ ఏం చేస్తుంది..? అరెస్టులు ఉంటాయా..? అన్న ప్రశ్నలు సహజంగానే వచ్చాయి అందరిలో. అందుకు సమాధానంగానా అన్నట్టు ఇప్పట్లో అలాంటివేం ఉండబోవని సీఎం పరోక్షంగా చెప్పినట్టుందని భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు. అయితే… అదే సమయంలో వాళ్ళనేం వదిలేయబోవడం లేదని, చిట్ చాట్‌లో సీఎం చెప్పిన మాటల్ని చూస్తుంటే… ప్రతిపక్ష నేతల్ని కేసులు, కోర్ట్‌లు అంటూ తిప్పే పని పెట్టబోతున్నారా అని విశ్లేషిస్తున్నారు కొందరు.
అలా తిప్పించడంతో పాటు… తమను తాము గొప్పగా చెప్పుకున్న గులాబీ నేతల అవినీతి బాగోతాల్ని ప్రజల్లో చర్చకు పెట్టాలన్నది సీఎం వ్యూహం అయి ఉండవచ్చంటున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీద అసెంబ్లీలో చర్చపెట్టాలని అనుకోవడం కూడా ఆ వ్యూహంలో భాగమే అయిఉండవచ్చంటున్నారు. దీంతో…గులాబీ నేతల్ని జైలుకు పంపించే ఆలోచన ప్రబుత్వానికి లేదా..? లేక చట్టం తనపని తాను చేసుకుపోతుందని వదిలేశారా అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే… రాజకీయంగా కాంగ్రెస్‌కి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు కొందరు. అది మరో పార్టీకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ నేతలు ఎలాంటి పొరపాటు చేసినా కేసీఆర్ అయితే… ఇన్నాళ్లు ఓపిక పట్టే వాడు కాదనే చర్చ నడుస్తోంది గాంధీ భవన్‌లో. ఆ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన ఏంటో బయటికి తెలియదు కానీ… మీడియా చిట్‌చాట్‌లో అన్న మాటలు మాత్రం పొలిటికల్ హాట్ టాపిక్ అయ్యాయి. అదే సమయంలో… ఎంతైనా ఆయన కూడా రాజకీయ నాయకుడే కదా…సమయం, సందర్భానికి తగ్గట్టు వ్యూహం లేకుండా ఎలా ఉంటుంది? సైలెంట్‌గా ఎందుకుంటారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈసారి సీఎం ఢిల్లీ టూర్ మాత్రం మునుపటికి భిన్నంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.