గులాబీ పార్టీలో ఇంటిపోరు క్లైమాక్స్‌కు చేరిందా? ఈనెల 14తో ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉందా? అది సముద్రపు తుఫానా? లేక టీ కప్పులో తుఫానా అన్నది ఆ రోజే తేలిపోతుందా? ఏంటి ఆ రోజు ప్రత్యేకత? బీఆర్ఎస్ వర్గాలన్నీ ఎందుకు ఉత్కంఠగా చూస్తున్నాయి? తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ పెంపు, ఆర్డినెన్స్ విషయంలో ఇన్నాళ్ళు ముందు నుయ్యి, వెనక గొయ్యిలా ఫీలవుతున్న బీఆర్‌ఎస్ ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది. ఈనెల 14న కరీంనగర్‌లో బీసీ గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించడానికి సిద్ధమైపోయింది పార్టీ. ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది ప్రతిపక్షం. అయితే…అధికార పార్టీ అంతకంటే ముందే అడ్వాన్స్ అవుతుండటంతో ఇన్నాళ్ళు డైలమాలో ఉన్న గులాబీ అదిష్టానం ఇప్పుడో క్లారిటీకి వచ్చి బహిరంగసభ ఏర్పాట్లలో ఉన్నట్టు చెబుతున్నారు. బీసీ గర్జన పేరుతో పెద్ద ఎత్తున సభ నిర్వహించి ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ మీద వత్తిడి పెంచాలని అనుకుంటోందట బీఆర్‌ఎస్. సభను కేవలం బీసీ నాయకులకే పరిమితం చేయకుండా పూర్తి పార్టీ మీటింగ్‌లా నిర్వహించబోతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ మీటింగ్‌కు హాజరవుతారట. ఇక్కడే ఒక ప్రాధమికమైన అనుమానం వస్తోంది రాజకీయవర్గాలకు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ… ఎమ్మెల్సీ కవిత పార్టీలోనే కొనసాగుతున్నారు.
పైగా ఆమె బీసీ వాయిస్‌ను గట్టిగా వినిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిగతా నాయకులు అందరిలాగే… కవితకు కూడా పార్టీ తరపున అధికారికంగా ఆహ్వానం ఉంటుందా? లేదా? అన్న చర్చలు జరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. పార్టీ రజతోత్సవ సభలో చాలా అంశాలకు క్లారిటీ ఇవ్వలేదంటూ…. పార్టీ అధ్యక్షుడు, తండ్రి కేసీఆర్‌కు కవిత లేఖ రాశాక మొదలైన గ్యాప్… రకరకాల వివాదాలతో పెరుగుతూ వచ్చింది. ఇక బీసీ రిజర్వేషన్స్ కోసం ఆర్జినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రోజునే కవిత సంబరాలు చేసుకుంటే… పార్టీ మాత్రం దాని చట్టబద్దతను ప్రశ్నించింది. అలా… పార్టీ ఒకటంటే తాను మరోటి అన్నట్టుగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారామె. ఈ పరిస్థితుల్లో పార్టీకి సంబంధించిన అన్ని సామాజికవర్గాల ముఖ్య నేతలు బీసీ గర్జనరకు వెళ్ళాలని నిర్ణయించడంతో… కవిత విషయంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది. కరీంనగర్ సభకు తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని సన్నిహితులతో చెబుతున్నారట కవిత. తాను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గానే కొనసాగుతున్నాను కాబట్టి… పార్టీ కార్యక్రమాలకు తప్పకుండా హాజరవుతానన్నది ఆమె వెర్షన్.
అయితే… ఇప్పుడు బీఆర్‌ఎస్ అధిష్టానం వైఖరి ఎలా ఉంటుందన్నది బిగ్ క్వశ్చన్. కవిత ఒక రకంగా తన స్టేట్‌మెంట్‌తో పార్టీ పెద్దల్ని డిఫెన్స్‌లో పడేశారన్న అభిప్రాయం ఉంది. ప్రత్యేకించి బీసీ రిజర్వేషన్స్ విషయంలో పార్టీలైన్‌కు భిన్నంగా మాట్లాడిన కవితను సభకు పిలుస్తారా లేదా అని ఉత్కంఠగా చూస్తున్నారు అంతా. మామూలుగా అయితే…ఆమె మాటలు చేతల్ని చూసీ చూడనట్టు తీసుకోవచ్చుగానీ… ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే…. మాత్రం మేటర్ మరోలా ఉంటుందేమోనన్న సందేహాలు వస్తున్నాయట పరిశీలకులకు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మరికొందరు కీలక నాయకుల మీద కాస్త ఘాటు కామెంట్సే చేశారు కవిత. పైగా…. ఇన్నేళ్ళలో లేనిది ఇప్పుడు రాఖీ వేడుకలకు కూడా దూరంగా ఉన్నారామె. అన్నకు రాఖీ కట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని కవిత చెప్పినా… కేటీఆర్ మాత్రం అందుకు ఇష్టపడలేదని చెప్పుకుంటున్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు బీసీ గర్జన సభకు పార్టీ నుంచి పిలుపు వస్తే వెళ్తానని కవిత చెబుతున్నా…పిలుపు వస్తుందా రాదా అన్న సందేహాలు మాత్రం పెరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. ఈ దెబ్బతోనే పార్టీలో అసలేం జరుగుతుందో తేలిపోతుందని అంటున్నారు పరిశీలకులు. పార్టీ కవితను పిలిచి, ఆమె వెళితే ప్యాచప్ వర్క్ మొదలవుతుందని, మిగతా విషయాలన్నీ టీ కప్పులో తుఫాన్‌లా మిగిలిపోతాయని అంటున్నారు. అలా కాకుండా… పార్టీ నుంచి కవితకు అధికారిక ఆహ్వానం అందకపోతే మాత్రం… కథ క్లైమాక్స్‌కు వచ్చినట్టేనని అంచనా వేస్తున్నారు. బీసీ గర్జనకు కవితను పిలవలేందటే….. ఇక పార్టీతో తెగదెంపులు అయినట్టేనన్న విశ్లేషణలు సైతం పెరుగుతున్నాయి. దీంతో ఈనెల 14న ఏం జరగబోతోందోనని ఆసక్తిగా చూస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.