ఉప రాష్ట్రపతి ఎన్నికలో గులాబీ పార్టీ వ్యూహం ఏంటి…? ఎన్డీయేకు మద్దతిస్తుందా? లేక ఇండియా కూటమికి జై కొడుతుందా? అది ఇది కాదు… మేం న్యూట్రల్ అంటుందా? అలాంటి స్టాండ్ తీసుకుంటే… బరిలో ఉన్న తెలంగాణ బిడ్డకు అన్యాయం చేసినట్టు కాదా? అందుకే ఎటూ తేల్చుకోలేక చర్చించి నిర్ణయం అంటూ ప్రస్తుతానికి సమాధానం దాట వేస్తున్నారా? పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందన్నది నిజమేనా?
ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయమై గతంలో ఎన్నడూ లేనంత పొలిటికల్ హీట్ పెరిగింది. దక్షిణాది, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు ఈ ఎన్నిక పరీక్షలా మారిందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే.. ఎట్నుంచి ఏ రియాక్షన్ వస్తుందోనన్న భయం ఉందట కొన్ని పార్టీల్లో. మరీ ముఖ్యంగా బీఆర్‌ఎస్ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తయారైందని విశ్లేషిస్తున్నాయి రాజకీయవర్గాలు. జగదీప్ దన్‌ఖడ్ రాజీనామాతో ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటింగ్ విషయంలో మిగతా రాజకీయ పక్షాల సంగతి ఎలాఉన్నా… బీఆర్‌ఎస్ వ్యూహం ఏంటన్న విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులే ఓటర్లు. ప్రస్తుతం గులాబీ పార్టీకి నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పార్టీ అధిష్టానం వాళ్లని ఎలా గైడ్ చేస్తుందన్నది ఇప్పుడు తెలంగాణలో ఇంట్రస్టింగ్ పాయింట్. ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి బరిలో ఉండటమే అందుకు కారణం. కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును ప్రతిపాదించగా… మిగతా భాగస్వామ్యపక్షాలు బలపరిచాయి. ఇక్కడే గులాబీ అధిష్టానం ఇరకాటంలో పడిందట. జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతిస్తే…కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సపోర్ట్ చేశారన్న ప్రచారం జరుగుతుందని, అలాగని ఇవ్వకుండా ఉందామంటే… తెలంగాణ బిడ్డ బరిలో ఉంటే… బీఆర్‌ఎస్ వ్యతిరేకంగా పనిచేసిందని అంటారన్న భయం ఉందట. అలా కాకుండా… ఎన్డీయే అభ్యర్థి రాధా కృష్ణన్‌కు సపోర్ట్ చేస్తే… బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ…. విలీన ప్రచారం కూడామరోసారి తెర మీదికి వస్తుందని భయపడుతోందట గులాబీ అధిష్టానం.
దీంతో… ఈ ఎన్నికలో బీఆర్‌ఎస్ తటస్థంగా ఉండవచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి ఎన్డీయే అభ్యర్థికి, మరోసారి యూపీఏ అభ్యర్థికి మద్దతిచ్చారు కేసీఆర్. కానీ… ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక మారిన పరిస్థితులు, ప్రాధాన్యతల కారణంగా సమస్య తలెత్తిందని, పార్టీ పూర్తిగా ఇరకాటంలో పడిందని చెప్పుకుంటున్నారు. తెలంగాణ బిడ్డగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతివ్వాలనుకున్నా… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున అలా చేయకపోవచ్చంటున్నారు. గతంలో యూపీఏ కూటమి అభ్యర్థిని సపోర్ట్ చేసినా అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి అలా చేసి ఉండవచ్చని, ఇప్పుడు అలాంటి వాతావరణం లేదన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. మొత్తంగా… బీఆర్‌ఎస్ ఓట్లతో గెలుపు ఓటములు డిసైడ్ అయ్యే అవకాశం లేకున్నా…ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఆ పార్టీ వైఖరి చర్చనీయాంశం అయింది. మరోవైపు తెలంగాణకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరు ఇస్తే… వాళ్ళకు సపోర్ట్ చేస్తామంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్రంలో అధికారం లేని కాంగ్రెస్ ఎలాగూ ఆ పని చేయలేదు. పోనీ…. కేటీఆర్ డిమాండ్ చేసినంత మొత్తాన్ని బీజేపీ ఇస్తుందన్న గ్యారంటీ లేదు. అంటే కేటీఆర్ కూడా కర్ర విరక్కుండా, పాము చావకుండా మాట్లాడారన్న విశ్లేషణలున్నాయి.