ఐఎఎస్ శ్రీలక్ష్మిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే భూమన ఆ స్థాయిలో ఎందుకు మాట్లాడారు? పైగా తమ పార్టీ అనుకూల ముద్ర ఉన్న ఆఫీసర్ని రాక్షసులతో పోల్చడానికి బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఆమెను టార్గెట్ చేసి ఇంకెవరికో సందేశం పంపాలనుకున్నారా? చివరికి చీరలు, విగ్గులు అంటూ…. వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడం వెనకున్న వ్యూహం ఏంటి? మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ లీడర్ భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి మీద చేసిన ఆరోపణలు రాజకీయంగా… పెను దుమారం రేపుతున్నాయి. అసలేమైంది? నిన్నటిదాకా అంతా ఒకటే గ్రూప్ అని ప్రచారం జరిగింది కదా? ఇంతలోనే ఎక్కడ తేడా కొట్టింది? భూమన కూడా అలా ఇలా కాకుండా…తాటకి, పూతన అంటూ… ఒక ఐఎఎస్ అధికారిని రాక్షసులతో ఎందుకు పోల్చారు? అన్నిటికీ మించి శ్రీలక్ష్మి వస్త్ర ధారణ మీద కూడా ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది? ఆమె ఎలాంటి చీరలు కట్టుకుంటే ఈయనకు ఎందుకన్న చర్చోపచర్చలు విపరీతంగా జరుగుతున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. ఐఎఎస్ శ్రీలక్ష్మి అంటే… రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసు, ఓబుళాపురం మైనింగ్ కేసులకు సంబంధించి జైలుకు కూడా వెళ్ళివచ్చారామె. విభజన తర్వాత తెలంగాణ కేడర్‌లో ఉండి కూడా.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక డిప్యుటేషన్ మీద అమరావతికి షిఫ్ట్ అయిపోయారామె. జగన్ కూడా శ్రీలక్ష్మికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి… వచ్చీరాగానే…. కీలకమైన మునిసిపల్ శాఖను అప్పగించారు.
కానీ… రాష్ట్రంలో ప్రభుత్వం మారి కూటమి అధికారంలోకి వచ్చాక శ్రీలక్ష్మిని జీఏడీకి బదిలీ చేశారు. అదంతా ఒక ఎత్తయితే…ఎవ్వరూ ఊహించని విధంగా…. తాజాగా ఈ ఐఎఎస్ మీద తీవ్రంగా రియాక్ట్ అయ్యారు భూమన. ఇంకా గట్టిగా చెప్పాలంటే… అసలాయన తన రాజకీయ జీవితంలో ఏ పొలిటికల్ ప్రత్యర్థి మీద ఈ స్థాయిలో విరుచుకుపడలేదు. అలాంటిది ఒక ఐఎఎస్ అధికారిని తీవ్ర పదజాలంతో దూషించడం ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రోడ్లు వేసే క్రమంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్లలో వేల కోట్ల అవినీతి జరిగిందని, నాటి తమ ప్రభుత్వంలోనే మున్సిపల్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణే అందుకు బాధ్యురాలంటూ నేరుగా పేరు చెప్పకుండా శ్రీలక్ష్మి అని అందరికీ తెలిసేలా మాట్లాడారు భూమన. అన్నిటికీ మించి వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ…. ఆమె రోజూ కట్టుకునే ఒక్కో చీర ఖరీదు లక్షన్నరకు పైగానే ఉంటుందని, 50 లక్షలకు పైగా విలువైన 11 విగ్గులు ఉన్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెకు వచ్చే జీతం ఎంత? ఆ మెయింటెనెన్స్ ఎలా సాధ్యం అంటూ ప్రశ్నలు సంధించడం కలకలం రేపుతోంది.
పైగా రోడ్లు వేసే టైంలో స్థలాలు పోగొట్టుకున్న యజమానుల నుంచి కోట్ల రూపాయలు దండుకునే ప్లాన్ చేస్తే మేం అడ్డుకున్నాం. ఆ కోపంతో ఆవిడ పక్క జిల్లాకు చెందిన టీడీపీ నాయకులతో చేతులు కలిపి అసత్య ఆరోపణలు చేయించారని కూడా అనడం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. తమ హయాంలో జరిగిన వ్యవహారాల గురించి భూమన అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు శ్రీలక్ష్మిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీని వెనక వేరే ప్రయోజనాలున్నాయా? అన్న చర్చలు నడుస్తున్నాయి తిరుపతి పొలిటికల్ సర్కిల్స్‌లో. వైసీపీ హయాంలో భూమన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతిలో ఒకేసారి 24 మాస్టర్ ప్లాన్ రోడ్లు, మరో 8 ఫ్రీ లెఫ్ట్ రోడ్లు వేశారు. అక్కడ స్థలాలు కోల్పోయిన వారికి తప్పకుండా టీడీఆర్ బాండ్లు జారీ చేయాల్సి వుండింది. మార్కెట్ కంటే నాలుగు రెట్ల విలువ పెంచి టీడీఆర్ బాండ్స్‌ను ఎక్కడైనా జారీ చేస్తుంటారు. అయితే తిరుపతిలో ఎక్కువ భూములు తీసుకున్నందున భారీగా బాండ్స్ జారీ చేయాల్సి రావడం కారణంగా.., ఆ ప్రభావంతో… తణుకు, రాజమండ్రి, గుంటూరు లాంటి చోట్ల విలువ పడిపోయిందట. దాంతో తిరుపతిలో ఏదో జరిగిపోయిందంటూ…శ్రీలక్ష్మి ఎన్నికలకు ముందే టీడీపీ నాయకులకు లీకులు ఇచ్చారని, వాటి ఆధారంగానే ఎలక్షన్ టైంలో ఆనం లాంటి నెల్లూరు నాయకులు తిరుపతి టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో భూమన రెండువేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించినట్టు అనుమానిస్తున్నారు. ఆ ఆరోపణల తర్వాత తిరుపతిలో టీడీఆర్ బాండ్స్ జారీ నిలిపేయడం రాజకీయంగా భూమన మీద దెబ్బ పడిందట. అయితే.. ఇక్కడే కొన్ని ప్రాధమిక అనుమానాలున్నాయి. ఎన్నికలు ముగిసిపోయి కూడా ఏడాదిన్నర అవుతోంది. కరుణాకర్‌రెడ్డి ఇన్నాళ్ళు కామ్‌గా ఉండి ఇప్పుడెందుకు నోరు తెరిచారంటే… బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేరే ఉండి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూల అధికారిగా ముద్ర ఉన్న శ్రీలక్ష్మిని అదే పార్టీ ముఖ్య నాయకుడు ఆ స్థాయిలో టార్గెట్ చేయడమేమీ ఆషామాషీగా జరగలేదని, తెర వెనక స్టోరీ పెద్దదే ఉండి ఉండవచ్చని టీడీపీ నాయకులు సైతం మాట్లాడుకుంటున్నారు.
కూటమి సర్కార్ శ్రీలక్ష్మిని దూరం పెట్టడంతో… ప్రభుత్వ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆమె కొత్త కొత్త లీకులు ఇస్తుండవచ్చన్నది ఒక డౌట్ అట. దానికి మించి ఇంకో అనుమానం టీడీపీ నేతలకు వస్తున్నట్టు తెలిసింది. ఇన్నాళ్ళు ఎలా ఉన్నా… ప్రస్తుతం చాలా మంది ఐఎఎస్, ఐపీఎస్‌లు మెల్లిగా మనసు మార్చుకుంటున్నారని, ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. వాళ్ళంతా అప్పట్లో జరిగిన వ్యవహారాలకు సంబంధించి ఏదో ఒక ముఖ్యమైన సమాచారంతో ప్రభుత్వ బాస్‌లను కలుస్తున్నారని, ఇది ఇంతా పెరిగిపోతే… తమకు ఇబ్బంది అని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే తమ పార్టీ సానుకూల ముద్ర ఉన్నాసరే… శ్రీలక్ష్మిని ఆ స్థాయిలో టార్గెట్ చేస్తే… రాజకీయ ఆరోపణలకు వెరసి మిగతా వాళ్లంతా సెట్ అవుతారని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే… తొలిగా భూమన ద్వారా శ్రీలక్ష్మిని టార్గెట్ చేయించి ఉండవచ్చన్న చర్చ టిడిపి వర్గాల్లో నడుస్తోంది. అదే నిజమైతే… అధికారంలో ఉన్న వారికి దగ్గరవ్వాలనుకున్న హయ్యర్ ఆఫీసర్స్ ఇలాంటి రాజకీయ ఆరోపణలకు భయపడతారా? అయినా అందరూ నాన్‌వెజ్ తిన్నంత మాత్రాన ఎముకలు మెడలో వేసుకుని తిరుగుతారా ఏంటి అని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తంగా ఈ ఎపిసోడ్‌తో రాజకీయ చదరంగంలో అధికారులు పావులుగా మారుతున్నారన్న విషయం మరోసారి బయటపడిందని అంటున్నారు పరిశీలకులు.