భీమవరం డీఎస్పీ వ్యవహారశైలిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారు? ఒక డివిజన్ అధికారి గురించి డిప్యూటీ సీఎం స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది కేవలం ఒక ఆఫీసర్‌కి సంబంధించిన వ్యవహారమేనా? లేక అంతకు మించి కూటమి పార్టీల మధ్య కుమ్ములాటల పర్యవసానమా? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కూటమి మూడు పార్టీల నేతల మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఉన్న ఐక్యత ఇప్పుడు కనిపించడం లేదన్నది లోకల్ టాక్. ఇప్పుడు దీనికి ఆజ్యం పోసింది భీమవరం డీఎస్పీ ఎపిసోడ్. డీఎస్పీ జయసూర్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం కలకలం రేపింది.భీమవరం కేంద్రంగా కూటమి నేతల మధ్య జరుగుతున్న కుమ్ములాటలే దీనికి బ్యాక్‌గ్రౌండ్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భీమవరంలో ఇటీవల పేకాట క్లబ్బులు, కోడిపందాల బరుల విషయంలో పోలీసులు సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా… ఆ పరిసర ప్రాంతాలు, పొరుగు నియోజకవర్గాల్లో ఇదే తరహాలో జరుగుతున్న తంతును మాత్రం డీఎస్పీ వత్తిడితో స్థానిక పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఈ విషయంలో ఎస్పీని సైతం పక్కదారి పట్టిస్తున్నారన్నది లోకల్ టాక్. కొన్ని చోట్ల జరిగే వ్యవహారాలను డీఎస్పీ దగ్గరుండి పర్యవేక్షించారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. అక్కడ కూడా ఒకరిద్దరు నాయకులు మాత్రమే డీఎస్పీ జయసూర్య సహకరిస్తున్నారన్నది మరో ఆరోపణ. జూదం విషయం పక్కన పెడితే భీమవరం రాజకీయాలతో పాటు, అక్కడి అధికారులపై పక్క నియోజకవర్గాల నేతల పెత్తనం ఎక్కువయ్యిందని కూటమి నేతలే ఫైర్ అవుతున్నారట. స్థానిక జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నరసాపురం ఎంపీగా కేంద్రమంత్రిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉన్నప్పటికీ వాళ్ళని బైపాస్ చేస్తూ… కొంత మంది పక్క ప్రాంతాల టీడీపీ నేతల జోక్యం వల్ల కోల్డ్ వార్ ముదురుతోందని అంటున్నారు. డీఎస్పీ విషయంలో కూడా ఇదే జరిగిందని అంటున్నారు. వ్యవస్థలోపనిచేయాల్సిన పోలీస్ అధికారి కేవలం ఒకరిద్దరు నాయకులను సుప్రీమ్‌గా భావిస్తూ వాళ్ళు చెప్పినట్టే చేయడం, ప్రభుత్వంలో భాగస్వాములైన నేతలను మాత్రం పట్టించుకోకపోవడం, సివిల్ తగాదాల్లోనూ వేలు పెట్టడం లాంటివి డిప్యూటి సీఎందాకా వెళ్ళినట్టు తెలుస్తోంది. తాము చెప్పిన పనులు జరక్కపోవడంతో జనంలో చులకనైపోతున్నామనే భావనతో ఉన్నారట భీమవరం ఎమ్మెల్యేతో పాటు అక్కడి నేతలు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇటు జనసేన, అటు బీజేపీ నేతలకు భీమవరంలో కనీస విలువ లేకుండా పోతుందన్న భయాలు సైతం ఉన్నాయట.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గతంలో స్వరం పెంచి మున్సిపల్ అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేశారని గుర్తుచేసుకుంటున్నారు. అధికారుల దోపిడీ ఎక్కువయ్యింది.. తీరు మార్చుకోండంటూ జనసేన ఎమ్మెల్యే అంజిబాబు చేసిన కామెంట్స్ అప్పట్లో కూటమిలో వేడిపుట్టించాయి. ఇపుడు భీమవరం డీఎస్పీ వంతు వచ్చింది. జనసేన నేతలు జరుగుతున్న విషయాన్ని తమ పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్ళడం, ఆయన ఘాటుగా రియాక్ట్ అవడం…ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పటి వరకు మున్సిపల్, పోలీస్ డిపార్ట్‌మెంట్స్ గురించి రచ్చ అవగా… మిగతా విభాగాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉందని అంటున్నారు.కూటమి పార్టీల తరపున గెలిచిన నేతల్లో ఒకరిద్దరికి మాత్రమే ప్రాధన్యత దక్కడమే ఇందుకు కారణమన్న అభిప్రాయాలున్నాయి. ఈ పరిస్థితుల్లో కూటమిలో ఐక్యత అన్నది నేతిబీర వ్యవహారంలా ఉందన్న టాక్ బలపడుతోంది. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారాలు కూటమి పార్టీలకు మైలేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువ చేస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.