ఆ నియోజకవర్గంలో రాజకీయ నాయకుల విన్యాసాలు చూసి జనం పగలబడి నవ్వుకుంటున్నారా? క్రెడిట్ వార్‌లో పడుతున్న పాట్లు చూసి… వీళ్ళెక్కడ దొరికార్రా నాయనా… ఆళ్లనెవరికన్నా చూపించండర్రా అని అంటున్నారా? అయినా సరే… తగ్గేదేలే, సిగ్గుపడేదేలే అంటున్న ఆ నాయకులెవరు? అసలు ఏ విషయంలో పోటీపడి పరువు తీసుకుంటున్నారు? మంచిర్యాల జిల్లాలో వందేభారత్ రైలు హాల్ట్ కావాల్సినంత పొలిటికల్ కలర్ పులుముకుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. తాము ప్రయత్నం చేస్తేనే ఇక్కడ వందేభారత్ రైలును ఆపుతున్నారంటూ…కాంగ్రెస్ ఎంపీ, రాష్ట్ర మంత్రి సభా వేదిక మీదే గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రతిగా అదే వేదిక సమీపంలో కేంద్ర మంత్రి ఉల్టా పంచ్ ఇచ్చారు. హైదరాబాద్- నాగ్‌పూర్ మధ్య ఏడాదిగా నడుస్తోంది వందేభారత్ రైలు. అయితే… మంచిర్యాలలో హాల్టింగ్ లేకపోవడంతో… దాని కోసం రాజకీయ నాయకులు గట్టి ప్రయత్నాలే చేశారు. పలు మార్లు రైల్వే అధికారులు, కేంద్ర మంత్రులను కలిసి వినతులు ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో… ఆక్యుపెన్సీని పరిగణనలోకి తీసుకున్న రైల్వేశాఖ మంచిర్యాలలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు స్టాప్ ఇచ్చింది. ఆ ప్రకటన వెలువడ్డ వెంటనే క్రెడిట్ వార్ మొదలైపోయింది. కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఆయన అనుచరులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. మనవల్లే రైలు ఆగుతోందంటూ వాట్సాప్ గ్రూపుల్లో హోరెత్తిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలు సైతం కేంద్రంలో ఉన్నది ఏ ప్రభుత్వమో గుర్తుంచుకోవాలని, తమ కృషివల్లే హాల్టింగ్ వచ్చిందంటూ తమ ప్రచారం తాము చేసుకుంటున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా యుద్ధం ఓ రంజ్‌లో జరుగుతోంది.
ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా… జనం మాత్రం క్లారిటీగానే ఉన్నారన్న వాదన బలంగా ఉంది. మంచిర్యాలలో రైలు ఆగేలా చేశామన్న మంత్రి వివేక్ కుటుంబం విస్తృతంగా ప్రచారం చేసుకోవడం చూసి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు సైతం దూరంగా ఉన్నారట. సోషల్ మీడియా వార్ అలా ఉంటే… రైలుకు పచ్చజెండా ఊపే కార్యక్రమంలో కూడా రెండు పార్టీ కార్యకర్తలు రచ్చ చేసుకున్నారు. క్రెడిట్ కోసం పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతోపాటు రైల్వే అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేసిన నినాదాలతో బండి సంజయ్‌కే చిర్రెత్తి పోయిందట. లొల్లి కావాలా… అభివృద్ధి కావాలా అంటూ ఆయన రెండు వర్గాల మీద సీరియస్ అయినట్టు తెలిసింది. అయినా సరే… ఇవేమీ పట్టించుకోకుండా… వేదిక మీదున్న కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చేసినట్టు చెప్పుకుంటున్నారు. మంత్రి వివేక్, ఎంపీవంశీతో సహా… అంతా తమ వల్లనే రైల్ ఆగుతోందంటూ ఉపన్యాసాలు దంచి కొట్టేశారు. అటు బీజేపీ లీడర్స్ కూడా తగ్గేదేలే అంటూ వాళ్ల స్టైల్‌లో ప్రసంగించారు. అసలు వాస్తవం ఏంటంటే… ఒక స్టేషన్‌లో వందేభారత్ రైల్ ఆగడం అనేది ఆక్యుపెన్సీని బట్టి నిర్ణయిస్తారు..అదే విషయాన్ని పరోక్షంగా బండి సంజయ్ అదే వేదిక మీద చెప్పేశారట. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా రైల్వేశాఖ పనిచేస్తుందని కూడా క్లారిటీ ఇచ్చారాయన. ఏది ఏమైనా ఇలా రెండు పార్టీలు కేవలం ఒక్క రైలు హాల్టింగ్ కోసం ఇంత హంగామా చేయడం చూసి నవ్వుకుంటున్నారు మంచిర్యాల జనం.