ఆ జిల్లాలో కాషాయ పార్టీ మొత్తం ఉరుకులు పెడుతుంటే… ఆ ఒక్క నియోజకవర్గంలో ఎందుకు ఉసూరుమంటోంది? అక్కడ కూడా యుద్ధానికి సిద్ధమని సైనికులు అంటుంటే… దళపతి మాత్రం ఎందుకు ముందూ వెనకాడుతున్నాడు? బావ కళ్ళలో ఆనందం కోసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీని పణంగా పెడుతున్నారా? అవి కేవలం ఆరోపణలేనా? అందులో నిజం ఉందా? ఎవరా ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న బావా బావమరిది? ఏంటా స్పెషల్ లవ్ స్టోరీ? తెలంగాణలో కాషాయ పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో నిజామాబాద్ ఒకటి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ సత్తా చాటింది. నిజామాబాద్ పార్లమెంట్ సీటు పరిధిలో పార్టీ బలంగా ఉన్నా.. బాల్కొండ నియోజకవర్గంలో పరిస్థితి కలవరపెడుతోందట. ఇక్కడ క్షేత్ర స్థాయిలో పార్టీకి ఉరకలెత్తే ఉత్సాహం ఉన్నప్పటికీ.. దాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకత్వంలో మాత్రం ఆ ఊపు కరవైందని చెప్పుకుంటున్నారు.స్ధానిక సంస్ధల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. పార్టీ క్యాడర్ పక్క చూపులు చూస్తోందంటే…..అది పూర్తిగా నాయకత్వ లోపమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి బాల్కొండలో. నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ఇటీవలే బీఆర్ఎస్ గూటికి చేరారు. అలా చాలా మంది దిక్కులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పాత-కొత్త క్యాడర్ గా పార్టీ చీలిపోవడంతో పాత వాళ్ళని ప్రస్తుత ఇన్ఛార్జ్ పట్టించుకోవడం లేదనే టాక్ నడుస్తోందట. ఇటీవల భర్తీ చేసిన మండలాధ్యక్షుల పదవుల విషయంలోనూ సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం.
ఈ నియోజకవర్గాన్ని పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. బాల్కొండ బీజేపీ ఇన్ఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కుమారుడు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. పాత టీడీపీ క్యాడర్ ఆయనతో పాటే కాషాయ తీర్ధం పుచ్చుకుంది. దీంతో నియోజకవర్గంలో బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందని అంటున్నారు. పాత బీజేపీ నాయకుల్ని మల్లిఖార్జున్‌రెడ్డి పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి పెరిగిపోతోంది. బాల్కొండలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ.. ఆయన అందరినీ కలుపుకుని వెళ్ళడం లేదన్న చర్చ నడుస్తోంది జిల్లా బీజేపీ వర్గాల్లో. తన వైఖరి కారణందా ఇటు నియోజకవర్గంలో కూడా పట్టు పెంచుకోలేకపోతున్నారట ఆయన. అసెంబ్లీ ఎన్నికల్లో మల్లికార్జునరెడ్డికి బదులు.. ఆయన తల్లి, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణకు టికెట్టు ఇచ్చింది బీజేపీ అధిష్టానం. ఆ ఎన్నికల్లో పార్టీ మూడో స్థఆనంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అన్నపూర్ణమ్మ.. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సొంత మేనత్త. ఈ బంధుత్వాలే నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నాయన్నది లోకల్ బీజేపీ వర్గాల మాట. ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డికి- ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వయానా మేన బావ కావడంతో… బావ కళ్లలో ఆనందం కోసం ఆయన లోకల్‌గా కాషాయ పార్టీ ప్రయోజనాల్ని పణంగా పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా తిరక్కుండా, క్షేత్ర స్థాయిలో ఉన్న అడ్వాంటేజ్‌ని సానుకూలంగా మల్చుకోకుండా వదిలేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం సెగ్మెంట్‌లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లా ఆధిపత్య పోరు నడుస్తుంటే…. బీజేపీలో మాత్రం అస్సలు సౌండ్ వినిపించడం లేదట. స్థానిక సంస్దల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మల్లికార్జున్ రెడ్డి దూకుడుగా ఉంటే తప్ప ఉపయోగం ఉండబోదని అంటోంది కేడర్. జిల్లాలో అంతటా బీజేపీ కేడర్ ఉత్సాహంగా ఉన్నా..బాల్కొండలో మాత్రం నైరాశ్యం నెలకొనడం వెనుక అసలు కారణాలపై పార్టీ విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని కోరుతోంది కేడర్. అధిష్టానం దృష్టి పెట్టి పరిస్దితిని చక్క బెడుతుందా లేదా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.