ఏపీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ విషయమై వైసీపీలో వాయిస్ తేడాగా ఉందా? ఎక్కువ మంది నాయకులు యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేయాలనుకుంటున్నారా? మీరు ఏదేదో ఊహించేసుకోవద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు గురూ… అంటూ ముందే సందేశం పంపుతున్నారా? ప్రతిష్టాత్మక పోరులో ప్రతిపక్ష నేతల వెనకడుగుకు కారణం ఏంటి? వాళ్ళు చెబుతున్న ఆసక్తికరమైన లెక్కలేంటి? ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల టైం దగ్గర పడుతోంది. షెడ్యూల్ ప్రకారం అయితే… 2026 ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. గ్రామ పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలకు దశలవారీగా ఎన్నికలు జరగాల్సి ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇందకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టేసింది. అయితే… ఇప్పుడు పొలిటికల్ మేటర్స్ ఏంటన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. అధికార కూటమిలో ఉన్నాయి కాబట్టి… సహజంగానే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ షేరింగ్ ఉంటుంది. పోటీ విషయంలో సెకండ్ థాట్ ఉండబోదు. కానీ… ప్రతిపక్షం వైసీపీ సంగతేంటన్న విషయంలో రకరకాల అనుమానాలు పెరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. స్థానిక యుద్ధానికి ఆ పార్టీ సిద్ధమా లేక అస్త్ర సన్యాసం చేస్తుందా అన్న విషయమై ఊహాగానాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టే అట్నుంచి క్లియర్ కట్ స్టేట్‌మెంట్ ఏదీ రాకపోగా… క్షేత్ర స్థాయిలో వైసీపీ నాయకుల తీరు, సన్నిహితులతో అంటున్న మాటలు పోటీ విషయంలో అనుమానాల్ని పెంచుతున్నాయట.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్‌తో బెండ్ అయితే… అనవసరంగా చేతి చమురు బాగానే వదులుతుందని మాజీ ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు పలువురు అంటున్నట్టు సమాచారం. ఏమీలేనిదానికి ఇప్పుడు కోట్లలో ఖర్చు పెట్టడం అవసరమా అన్నది వైసీపీ మాజీ ఎమ్మెల్యేల ప్రశ్నగా చెప్పుకుంటున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మొత్తం 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్స్‌కు ఎన్నికలు జరగ్గా.. ఏకంగా 72 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్స్ ఫ్యాన్ ఖాతాలోనే పడిపోయాయి. కేవలం తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపగలిగింది. ఇక 13వేల97 గ్రామ పంచాయతీలకుగాను 10 వేలకు పైగా గ్రామాల్లో వైసీపీ మద్దతుగారులు గెలిచారు. 7,219 ఎంపీటీసీ స్థానాలుండగా 5,998 సీట్లు, 515 జడ్పీటీసీలకుగాను 502 వైసీపీ గెలుచుకుంది. సరిగ్గా ఆ లెక్కల్నే ఇప్పుడు తెర మీదికి తీసుకువచ్చి కొత్త భాష్యం చెబుతున్నారు ఫ్యాన్ లీడర్స్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది వైసీపీ. తర్వాత స్థానిక ఎన్నికల్లో దున్నేసింది. కట్ చేస్తే… 2024 ఎలక్షన్స్‌తో ఎలాంటి ఓటమి ఎదురైందో చూశాం కదా…? దీన్నిబట్టి చూస్తే… లోకల్ బాడీస్ ఫలితాలకు, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పునకు పొంతన ఉండబోదన్న సంగతి అర్ధం అవుతోంది. ఆ మాత్రం దానికి ఇప్పుడు మరీ స్పీడైపోయి… తెగ పూసేసుకుని చేతిలో ఉన్న నాలుగు రూపాయలు వదిలించుకోవడం ఎందుకన్నది ఎక్కువ మంది వైసీపీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. పోనీ కాస్తో కూస్తో డబ్బు తీద్దామా అంటే… అదేదో.. ఒక పంచాయతీతో పోయేది కాదని, మొదలు పెట్టామంటే… నియోజకవర్గంలో అందరు సర్పంచ్ అభ్యర్థులకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి.. ప్రస్తుతానికి మంచం ఉన్నంతవరకే కాళ్ళు ముడుచుకుంటే బెటరని అనుకుంటున్నట్టు సమాచారం. స్థానిక నాయకులు ఎవరైనా…ఎన్నికల ప్రస్తావన తీసుకువస్తే తర్వాత చూద్దాంలే అని దాటవేస్తున్నారట ఎక్కువ మంది. అయినా పార్టీ కంటిన్యూగా ఏదో ఒక ప్రోగ్రాం ఇస్తూనే ఉంది, వాటితో జనంలోకి వెళ్తున్నాం కదా.. అంటూ స్వీట్ కవరింగ్ ఇస్తున్నట్టు చెబుతున్నారు.
సరే.. అదంతా పక్కనబెట్టి… నిజంగానే మనం ఎఫర్ట్ పెట్టి అభ్యర్థులను గెలిపిస్తే… వాళ్లు మనతోనే ఉంటారన్న గ్యారంటీ ఉందా అన్నది ఇంకొందరి ప్రశ్న. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. వచ్చే ఎన్నికల దాకా తిరుగులేని ఆధిపత్యం ఉంటుంది. అలాంటప్పుడు మన పార్టీ తరపున గెలిచిన వాళ్ళను వాళ్ళు కుదురుగా ఉండనిస్తారా అన్నది వైసీపీ మాజీ ఎమ్మెల్యేల క్వశ్చన్. అందుకు కొన్ని ఉదాహరణల్ని కూడా చూపిస్తున్నారు. కాకినాడ జిల్లానే తీసుకుంటే… ఇక్కడ 21 మండలాలు ఉన్నాయి. వైసీపీ హయాంలో అన్నిచోట్ల ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. కానీ… తర్వాత ఏం జరిగిందో చూశారు కదా అంటూ అడుగుతున్నారు. వార్డు మెంబర్ నుంచి మేయర్ వరకు అంతా మనవాళ్లే ఉన్నారు. కానీ… అసలు మనకు పెత్తనం ఉందా అని గుర్తు చేస్తున్నారట. అలాంటప్పుడు ఆపసోపాలు పడి డబ్బులు వదిలించుకోవడం అవసరమా అన్నది మాజీల క్వశ్చన్. ఒక నియోజకవర్గంలో 60 గ్రామాలకు తక్కువ కాకుండా ఉంటాయి. అలా మనం సపోర్ట్ చేద్దామని అనుకుని ఒక్కొక్క ఊరికి 10 లక్షలు ఇచ్చినా ఎంత ఖర్చవుతుందో మీరే లెక్కేయండని కేలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నారట. ఈ కష్టకాలంలో అంత మొత్తం వదిలించుకోవడం మాకు అవసరమా, మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టామంటూ లోకల్ వార్‌పై నిరాసక్తంగా ఉన్నట్టు చెబుతున్నారు. కాదు కూడదని ఒకవేళ ఎవరైనా ఉత్సాహంగా పోటీ చేస్తామంటే చేయండిగానీ… మా నుంచి ఫండ్స్ మాత్రం ఆశించవద్దన్నది గ్రామ స్థాయి నేతలకు వైసీపీ సీనియర్స్ సూచనగా తెలుస్తోంది. అలా… మొత్తంగా వైసీపీ నేతలు తీరు చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాడి పడేసేట్టే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎవరి సామానుకు వారే బాధ్యులన్నట్టు… పోటీ చేసిన వాళ్ళే ప్లస్, మైనస్‌లకు బాధ్యత వహించాలన్న అభిప్రాయం పార్టీలో బలంగా ఉంది. ఈ విషయంలో తెలిసి ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం మరోలా వాయిస్ వినిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేయడం కాదు బ్రో… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసి దమ్ము చూపిస్తేనే నాయకుడంటారన్నది వాళ్ల అభిప్రాయం. అలా… వోవరాల్‌గా స్థానిక ఎన్నికల గురించి వైసీపీలో ఓ రేంజ్ చర్చలు జరుగుతున్నాయి.