ఉన్న గొడవ సరిపోదని కొత్త తలనొప్పులు తెచ్చుకుంటుంది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పటికే పీసీసీ కమిటీ.. ఫ్యామిలీ ప్యాక్ అయ్యిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కమిటీని జంబో ప్యాక్ చేస్తున్నారట. ఈ విషయంలో కొత్త ఇంచార్జి ఆలోచన ఏంటి? జంబో ప్యాక్‌తో సమస్యలకు ప్యాచప్ చేస్తారా?
ఇప్పటికే 84 మంది పీసీసీ ప్రధాన కార్యదర్శులు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత కూర్పు గందరగోళంగా మారింది. క్షేత్రస్థాయిలో కమిటీల నియామకం ఎలా ఉన్నా… పిసిసి స్థాయిలో కమిటీల పంచాయితీ కంటిన్యూ అవుతుంది. 84 మందితో ప్రధాన కార్యదర్శుల జాబితా పార్టీలో పెద్ద దుమారం లేపింది. కొత్తవారికి ఎక్కువ పదవులు వచ్చాయని కొందరు.. పనిచేయని వారికి పదవులు ఇచ్చారని ఇంకొందరు గొడవ చేశారు. పార్టీ సీనియర్ నాయకులు ఏకంగా సేవ్ కాంగ్రెస్ అనే నినాదం వరకు వెళ్లారు. ఆ పంచాయితీ నుంచి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ తెరుకుంటోంది. అయితే కొత్త ఇన్చార్జి వచ్చాక పెండింగ్‌లో ఉన్న జిల్లా అధ్యక్షులు నియామకంతోపాటు ప్రధాన కార్యదర్శుల సంఖ్య పెంచాలని.. కార్యదర్శుల పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారనే డిమాండ్స్ తెరమీదకు వచ్చాయి. ఫిబ్రవరి మొదటి వారంలో పెండింగ్‌లో ఉన్న డీసీసీ నియామకం పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే పీసీసీ ప్రధాన కార్యదర్శులు.. కార్యదర్శుల పదవుల సంగతే అంతుచిక్కడం లేదట.
ప్రధాన కార్యదర్శుల పదవుల సంఖ్య పెంచుతున్నారా?
మొదట్లో 84 మంది ప్రధాన కార్యదర్శులు నియామకంపై అభ్యంతరాలు వచ్చాయి. కానీ ఇప్పుడు వీటి సంఖ్యను మరింత పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రధాన కార్యదర్శి చొప్పున ఎంపిక చేశారు. కానీ నాయకుల మధ్య పోటీతో ఆ సంఖ్య 84 చేరింది. అసలైన వారికి అవకాశం ఇవ్వలేదనే విమర్శలు రావడంతో.. అందరినీ సంతృప్తి పరిచే పనిలో ఇంఛార్జ్ ఉన్నట్టు తెలుస్తోంది. 84 మంది ప్రధాన కార్యదర్శులకుతోడు ఇంకో 20 మందిని ఆ హోదాలో పీసీసీలోకి తీసుకుంటే నష్టం ఏముందనే ఫీలింగ్‌లో ఉన్నారు కొందరు నేతలు. 119 నియోజకవర్గాలకు ఒక్కో ప్రధాన కార్యదర్శిని నియమించాలని ఆలోచిస్తున్నారట. అలా 119 నియోజకవర్గాల బాధ్యతను ఒక్కో ప్రధాన కార్యదర్శికి అప్పగిస్తారట. ప్రధాన కార్యదర్శులే 119 మంది ఉంటే ఇక కార్యదర్శుల సంగతేంటి? పార్టీలో పనిచేసే వారి కంటే పదవుల్లో ఉండే వారి సంఖ్య ఎక్కువ అవుతోందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ప్రధాన కార్యదర్శి పదవులు పరిమితంగా ఉండాలి.. అవి ఇప్పుడు సెంచరీ కొట్టేస్తున్నాయి.
సమావేశాలకు రాని నేతల పదవులు పీకేస్తారా?
ఇప్పటివరకు పదవులు పొందిన నాయకులకు కోతపెట్టే పనిలో ఉంది పీసీసీ. వరుసగా మూడు సమావేశాలకు రాని నేతలు ఎవరైనా సరే.. వారిని పార్టీ పదవుల నుంచి తప్పించాలని ఇంచార్జికి సూచించారట. ఇదే విషయాన్ని సమావేశాల్లో కూడా చెప్పారట. ఓవైపు పని చేయని వారిని తగ్గిస్తామంటూనే ఇంకోవైపు 119 నియోజకవర్గాలకు ప్రధాన కార్యదర్శలను ఇంఛార్జులను నియమిస్తామనడం ఎలాంటి సంకేతాలు ఇస్తుందో చూడాలి.